కొవిడ్ టీకా తయారీ యోధులకు ‘పద్మ’ పురస్కారం

యావత్ ప్రపంచాన్ని మహమ్మారి పట్టేసిన వేళలో.. భవిష్యత్తు ఏమిటన్నది ఒక పట్టాన అర్థం కాని సందర్భంలో.. తెలియని దారిలో మిణుకు మిణుకుమనే ఆశల లాంతరును పట్టుకొని వెతుక్కుంటూ వెళ్లిన వ్యాక్సిన్ తయారీ యోధులకు తాజా పద్మ పురస్కారాల్లో చోటు లభించింది. తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ అధినేతలు కృష్ణ ఎల్లా.. సుచిత్ర ఎల్లాలకు కేంద్రం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

ఈ శాస్త్రవేత్తల జంటతో పాటు.. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను తయారీలో కీలక భూమిక పోషించి.. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీకాల్ని అందజేయటంలో ప్రధాన పాత్ర పోషించిన సీరం ఇనిస్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలాకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు.దేశ ప్రజలకు వారు అందించిన సేవలకు ఈ పురస్కారం దక్కడం సముచిత గౌరవం. ఈ రోజున దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంత భారీగా.. ఇంత వేగంగా సాగిందంటే దానికి కారణం.. ఈ ముగ్గురి ప్రయత్నాలేనని చెప్పక తప్పదు. 

ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా ప్రయోగాలు సాగిన వేళలో.. సక్సెస్ అయిన ప్రయోగాలు చాలా తక్కువ. అందునా.. దేశీయంగా టీకాను డెవలప్  చేయడానికి  మించిన  సవాలు  మరొకటి ఉండదు. అలాంటి సవాల్ ను స్వీకరించి.. ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ.. పంటి బిగువన ఒత్తిడి మోస్తూ.. ప్రజల ఆశలకు.. ఆకాంక్షలకు ఏ మాత్రం తేడా రానివ్వకుండా.. ప్రపంచంలో అత్యుత్తమ వ్యాక్సిన్లలో ఒకటిగా చెప్పే అతి కొద్ది టీకాల్లో ఒకటిగా పేరును సొంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు.

కోవిడ్ లాంటి కఠిన పరీక్షను ఎదుర్కొంటూ.. ఎలాంటి లోపాలకు చోటివ్వకుండా వ్యాక్సిన్ రూపొందించటం అంత సామాన్యమైన విషయం కాదు. ఏ చిన్న తేడా వచ్చినా జరిగే నష్టం అపారంగా ఉంటుంది. అందుకే.. ఎంతో శ్రద్ధతో పరిశోధన చేయాల్సి ఉంటుంది. రిస్కు పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది.. ఆ సవాళ్లను ఎదుర్కొని.. లోప రహిత టీకాన్ని రూపొందించటం అంత తేలికైన విషయం కాదు.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. భారత్ బయోటెక్.. సీరం సంస్థల మధ్య వ్యాపార పోటీ మామూలుగా ఉండదు. వ్యాక్సిన్ వచ్చిన మొదట్లో జరిగిన ప్రచారం తెలిసిందే.చాలా త్వరగా సదరు వివాదం ఒక కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. ఏమైనా.. వ్యాపార పరంగా భిన్న ధ్రువాలుగా ఉండే ఇద్దరికి.. పద్మ పురస్కారం లభించటం.. అది కూడా ఒకే ఏడాదిలో కావడం ఒక విశేషం.