కేకేకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఎందుకు ఇవ్వ‌డం లేదు?

కేకేకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఎందుకు ఇవ్వ‌డం లేదు?

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను ఎంతగానో కలచివేశాయని పేర్కొంటూ....పరిస్థితులు చేయిదాటకముందే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంకావాలని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు కోరిన సంగ‌తి తెలిసిందే.  ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రకటన విడుదల చేసిన కేశవరావు...ఆర్టీసీ కార్మికులు వెంటనే తమ సమ్మెను విరమించాలని కోరారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా ఇతర సమస్యలపై ప్రభుత్వంతో చర్చించాలని లేఖలో సూచించారు. అనంత‌రం సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఇప్ప‌టివ‌ర‌కు కేసీఆర్‌ను క‌లిసేందుకు ఎదురుచూస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, పార్టీ సెక్రటరీ జనరల్ అయిన కే కేశవరావు తాను త‌మ పార్టీ నాయ‌కుడి అపాయింట్‌మెంట్ కోసం నిరీక్ష‌ణ‌లో ఉన్నామ‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

ఆర్టీసీని ప్రైవేటుపరం చేయబోమని చెప్పిన సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపిన కేకే ఆర్టీసీ విలీనం మినహా మిగిలిన సమస్యలను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. కే కేశవరావు మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వానం పలుకాలని అన్నారు. సమస్యల పరిష్కారానికి చర్చల ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ఇలా ప‌రిస్థితులు శుభం కార్డు ప‌డే దిశ‌గా వ‌స్తున్న త‌రుణంలో...తాజాగా కేకే మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ...సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

సమ్మెతో పరిస్థితులు చేజారి పోతున్నాయనే అనుమానం వచ్చిందని అందుకే...ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని కలిసి చర్చలు జరపాలని తాను త‌న అభిప్రాయాన్ని వ్యక్తంచేశానని వెల్ల‌డించారు. ``నా ప్ర‌క‌ట‌న‌తో ఆర్టీసీ కార్మికుల ఆశలు పెరిగాయి. నేను చర్చలు జరుపుతానని అనలేదు. ఐనా సరే, మంచి జరుగుతుందని అనుకుంటే నేను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దం. సీఎం ఆదేశిస్తే ఖచ్చితంగా చర్చలకు దిగుతా. ప్రెస్ రిలీజ్‌కు ముందుగాని, తర్వాత గానీ, సీఎం కేసీఆర్ గారితో నేను మాట్లాడలేదు. సీఎం కేసీఆర్ తో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఆయన నాకు అందుబాటులోకి రాలేదు.నేను సోషలిస్టును. రాజ్యం వైపు ఎప్పుడూ ఉండను. కార్మికుల వైపే ఉంటాను.`` అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌స్తుత అంశం పార్టీ సమస్య కాదు, ప్రభుత్వ సమస్య అని కేకే పేర్కొన్నారు. ``కార్మికులు నాతో చర్చలకు సానుకూలంగా ఉండటం మంచి పరిణామం. అయితే, ప్రభుత్వం నుంచి చర్చలు జరిపేందుకు నాకు ఎలాంటి అనుమతి రాలేదు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటీ అనేది నాకు తెలియదు. తెలిస్తే సమస్య పరిష్కారం అయ్యేది.ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు.`` అంటూ కేకే ప్ర‌స్తుత ప‌రిస్థితిని విశ్లేషించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English