150 కోట్ల‌కు ఖ‌ర్చు పెట్టి.. ప‌క్క‌న ప‌డేశార‌ట‌

ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన‌ మ‌న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి సినిమా బాహుబ‌లి స్ఫూర్తితో.. అందులోని పాత్ర‌ల బ్యాక్ స్టోరీల‌తో స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ ఒక భారీ వెబ్ సిరీస్ చేయ‌డానికి కొన్నేళ్ల ముందే స‌న్నాహాలు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్టు మీద టాలీవుడ్ ద‌ర్శ‌కులు దేవా క‌ట్టా, ప్ర‌వీణ్ స‌త్తారు సైతం ప‌ని చేశారు. వాళ్ల ఆధ్వ‌ర్యంలో స్క్రిప్ట్ వ‌ర్క్‌తో పాటు కొంత ప్రొడ‌క్ష‌న్ కూడా జ‌రిగింది. కానీ ఔట్ పుట్ న‌చ్చ‌క దాన్ని ప‌క్క‌న పెట్టేశారు.

ఆ త‌ర్వాత ఒక‌ బాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్‌, వేరే టీంను పెట్టుకుని కొత్త‌గా మ‌ళ్లీ వ‌ర్క్ చేసి.. కొన్ని నెల‌ల కింద‌టే ఈ సిరీస్‌ను ప‌ట్టాలెక్కిస్తున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. ఇందులో భ‌లే మంచి రోజు హీరోయిన్ వామికా గ‌బ్బి.. శివ‌గామి పాత్ర చేస్తోంద‌ని.. న‌య‌న‌తార‌ను ఓ ముఖ్య పాత్ర‌కు తీసుకున్నార‌ని కూడా వార్త‌లు వినిపించాయి. కానీ తీరా చూస్తే ఈ ప్రాజెక్టును పూర్తిగా ఆపేసిన‌ట్లు బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్ప‌టిదాకా బాహుబ‌లి సిరీస్ మీద నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ.150 కోట్ల దాకా ఖ‌ర్చు చేసింద‌ట‌. ప్రి ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ భారీ స్థాయిలో చేయ‌డం.. ఆర్టిస్టుల‌కు పారితోష‌కాలిచ్చి కాల్ షీట్లు తీసుకోవ‌డం.. ఇలా అన్నింటికీ క‌లిపి రూ.150 కోట్లు అయిన‌ట్లు చెబుతున్నారు. కానీ స్క్రిప్టును ఎన్నిసార్లు రివైజ్ చేసినా.. రీషూట్లు చేసినా ఔట్ పుట్ ఆశించిన స్థాయిలో రాక‌పోవ‌డంతో ఈ ప్రాజెక్టును ప‌క్క‌న పెట్టేసిన‌ట్లు చెబుతున్నారు.

నెట్ ఫ్లిక్స్ వాళ్లు ఇలా ఔట్ పుట్ న‌చ్చ‌క ప‌క్క‌న ప‌డేసిన ప్రాజెక్టులు లెక్క‌లేన‌న్ని ఉన్నాయి. కంటెంట్ విష‌యంలో వాళ్లెంత స్ట్రిక్ట్‌గా ఉంటార‌న‌డానికి ఇది రుజువు. ఐతే మ‌నం రూ.150 కోట్లు వేస్ట్ అని నోరెళ్ల‌బెడ‌తాం కానీ.. ద‌ర్శ‌కుడు దేవా క‌ట్టా చెప్పిన ప్ర‌కార‌మే నెట్ ఫ్లిక్స్ వివిధ ప్రాజెక్టుల మీద‌ రోజువారీ పెట్టుబ‌డులు రూ.200 కోట్ల దాకా ఉంటాయ‌ట‌. కాబ‌ట్టి ఒక రోజు పెట్టుబ‌డిలో నాలుగింట మూడొంతుల మొత్తం వేస్ట్ కావ‌డం వారికి పెద్ద ఇబ్బంది కాక‌పోవ‌చ్చు.