సాయి రెడ్డి పై రు.100 కోట్ల ప‌రువు న‌ష్టం దావా

సాయి రెడ్డి పై రు.100 కోట్ల ప‌రువు న‌ష్టం దావా

టీవీ-9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై అసత్య ఆరోపణలు చేసినందుకు వైసీపీ నేత, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజయసాయిరెడ్డిపై రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేయాలని నిర్ణయించామని రవిప్రకాశ్‌ మేనేజర్‌ తెలిపారు.

కొద్ది రోజులుగా ఇటు టీడీపీ, చంద్ర‌బాబుతో పాటు ఆ పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న మీడియా సంస్థ‌లకు చెందిన వారిపై సైతం విజ‌యసాయిరెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న రవిప్రకాశ్‌పై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా), ఆదాయం పన్ను చట్టం (ఐటీ యాక్ట్)తోపాటు రిజర్వుబ్యాంకు నిబంధనల ఉల్లంఘనల వ్యవహారంలో రవిప్రకాశ్‌పై దర్యాప్తు జరిపించాలని ఆయన తన లేఖలో కోరారు.

త‌న‌పై విజ‌యసాయి లేఖ రాసిన నేప‌థ్యంలో ఇప్పుడు ర‌విప్ర‌కాశ్ ఆయ‌న‌పై రు.100 కోట్ల‌కు పరువునష్టం దావా వేయబోతున్నారు. అసత్య ఆరోపణలు చేసి, ఆయన పరువుకు భంగం కలిగించినందుకే ఆయన ఈ దావా వేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ర‌విప్ర‌కాశ్ వెర్ష‌న్ కూడా మ‌రోలా ఉంది. టీవీ 9లోకి మై హోం రామేశ్వ‌ర‌రావుతో పాటు మేఘా కృష్ణారెడ్డి అక్ర‌మంగా ప్ర‌వేశించి.. వారిద్ద‌రి ద్వారానే త‌న‌పై ఆరోప‌ణ‌లు చేయిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు.

రామేశ్వ‌ర‌రావు, కృష్ణారెడ్డి అనుచరుడు రామారావు గ‌త నెలలో కొన్ని శాఖల‌కు లిఖితపూర్వకంగా చేసిన ఆరోప‌ణ‌ల‌ను అవి కొట్టి ప‌డేసినా... ఇప్పుడు విజ‌యసాయి సైతం రామారావు పంపిన లేఖ ప్రతినే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించారన్న‌దే ర‌విప్ర‌కాశ్ వెర్ష‌న్‌గా తెలుస్తోంది.

ఈ ఆరోప‌ణ‌ల‌ను ఆధారంగా చేసుకుని త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సారం చేసిన ఛానెల్స్‌పై కూడా కోర్టులో దావా వేసే యోచ‌న‌లో ర‌విప్ర‌కాశ్ ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English