చంద్రబాబు ఇంటిని ఎందుకు కూల్చలేదు?

చంద్రబాబు ఇంటిని ఎందుకు కూల్చలేదు?

కృష్ణానది కరకట్ట మీద ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తున్నాం, చంద్రబాబు నివాసం ఉంటున్న అక్కడి ఇంటిని కూడా కూల్చకతప్పదన్న జగన్ సర్కారు ఎందుకో ఆ విషయంలో సైలెంటయినట్లుగా ఉంది.

చంద్రబాబునాయుడు నివాసముంటున్న భవనాన్ని కూడా కూల్చివేయక తప్పదని, వారం రోజుల్లోగా చంద్రబాబు ఆ నివాసాన్ని ఖాళీ చేయాల్సిందేనని సీఆర్డీఏ నోటీసులు కూడా జారీ చేసింది. అంతేకాదు.. ఆ లైన్లో ఉన్న ఇల్లకు సంబంధించిన ఆక్రమణల కూల్చివేత పనులూ మొదలయ్యాయి. అలా మొదలై దాదాపు రెండు వారాలవుతున్నా చంద్రబాబు ఇంటి వైపు మాత్రం ఇంకా ప్రభుత్వ సమ్మెటలు, గునపాలు వెళ్లకపోవడంతో ఏం జరిగి ఉంటుందా అని ప్రజలు ఆలోచిస్తున్నారు.

కరకట్టపై చంద్రబాబు ఇంటి వైపు వెళ్లడానికి చాలా ముందుగానే వైసీపీ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను కూల్చి వేసింది. దీనిపై తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా జగన్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరికలు చేసింది.

కరకట్టపై అక్రమ కట్టడాలకు నోటీసులిచ్చింది. కూల్చివేత పనులూ ప్రారంభించింది. దాంతో చంద్రబాబు నివాసం నేలమట్టం కాక తప్పదని అంతా అనుకున్నారు.  అయితే వారంరోజుల్లో కూల్చి వేస్తామని చెప్పిన జగన్ సర్కార్ కొంత వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నివాసానికి నోటీసులు అంటించి పదిహేను రోజులు గడుస్తున్నా కూల్చివేత ప్రక్రియను మొదలు పెట్టకపోవడం వెనక చంద్రబాబుకు సానుభూతి వస్తుందన్న కారణమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు మంగళగిరి ఎమ్మెల్యే  రామకృష్ణారెడ్డి కూడా కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలంటూ గతంలోనే కోర్టును ఆశ్రయించారు. కూల్చివేస్తామని ఆళ్ల హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పుడాయన కూడా దీనిపై మాట్లాడడం లేదు. దీంతో కరకట్టపై భారీ భవనాలు నిర్మించుకున్న పారిశ్రామివేత్తలు, బడావ్యాపారులు.. వైసీపీ పెద్దల మధ్య ఏమైనా అంగీకారం కుదిరిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు రాజకీయ నాయకుడు కావడంతో ఆయనుండే ఇంటిని కూల్చినా ఆయనకు అది రాజకీయంగా కలిసి రావడమో, సానుభూతి తేవడమో చేస్తుందని.. కానీ, వ్యాపారవర్గాలకు చెందిన తమ ఇళ్లను కూల్చితే మార్కెట్లో తమ గ్రిప్ తగ్గుందని, ప్రభుత్వం అండదండలు తమకు లేవన్న సందేశం వెళ్తుందని అక్కడున్న బడా వ్యాపారులు భావిస్తున్నారని.. ఆ క్రమంలోనే ఏం చేసైనా ఈ కూల్చివేతలు ఆపగలిగితే వైసీపీ ప్రభుత్వంలోనూ పట్టు చూపించుకున్నామన్న సందేశం వెళ్తుంది, ఇల్లు కూడా కాపాడుకోవచ్చన్న ఉద్దేశంతో భారీ మంత్రాంగమే నడిపించారన్న టాక్ ఒకటి విజయవాడలో వినిపిస్తోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English