బీజేపీకి వ‌రుస షాక్‌లు

గోవాలో ఎన్నిక‌ల‌కు ముందు అధికార బీజేపీకి వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ నేత‌లు వ‌రుస‌గా ఆ పార్టీని వీడుతున్నారు. దీంతో కీల‌క స‌మ‌యంలో పార్టీకి దెబ్బ ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ రాజీనామాలు, చేరిక‌ల‌తో గోవా రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోవడంతో దివంగ‌త ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ త‌న‌యుడు ఉత్ప‌ల్ పారిక‌ర్ పార్టీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా గోవా మాజీ ముఖ్య‌మంత్రి ల‌క్ష్మీకాంత్ పర్సేక‌ర్ కూడా త‌న‌కు టికెట్ ద‌క్క‌లేద‌ని కార‌ణంతో పార్టీకి రాజీనామా చేయానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో పోటీచేసే అభ్య‌ర్థుల తొలి జాబితాను బీజేపీ ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. 34 మందితో ఆ జాబితాను విడుద‌ల చేసింది. అందులో దివంగ‌త సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్ త‌న‌యుడు ఉత్ప‌ల్‌కు చోటు ఇవ్వ‌లేదు. ఆ రాష్ట్రంలో బీజేపీకి పెద్ద దిక్కుగా వ్య‌వ‌హ‌రించిన మ‌నోహ‌ర్ త‌న మ‌ర‌ణం వ‌ర‌కూ 25 ఏళ్ల పాటు ప‌నాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. త‌న తండ్రి మృతితో ఈ ఎన్నిక‌ల్లో ఆ స్థానం నుంచి ఉత్ప‌ల్ పోటీ చేయ‌డానికి స‌న్నాహ‌కాలు చేసుకున్నారు. కానీ బీజేపీ ఆయ‌న‌కు షాకిచ్చింది. టికెట్ నిరాక‌రించింది. ఆయ‌న‌కు బ‌దులు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వ‌చ్చిన వివాదాస్ప‌ద ఎమ్మెల్యే అటానాసియోకు టికెట్ ఇచ్చింది. దీంతో అసంతృప్తి వ్య‌క్తం చేసిన ఉత్ప‌ల్ పార్టీకి రాజీనామా చేసి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఇక ఇప్పుడు గోవా మాజీ సీఎం ల‌క్ష్మీకాంత్ ప‌ర్సేక‌ర్ కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. 2002 నుంచి 2017 వ‌ర‌కు ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హించిన మండ్రేమ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ ద‌యానంద్ సోప్టేను బ‌రిలో దింప‌నుంది. 2017 ఎన్నిక‌ల్లో ల‌క్ష్మీకాంత్‌పై గెలిచిన ద‌యానంద్ ఆ త‌ర్వాత బీజేపీలో చేరారు. మ‌రోవైపు ల‌క్ష్మీకాంత్ 2014 నుంచి 2017 వ‌ర‌కూ గోవా సీఎంగా ప‌నిచేశారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటుండ‌గా పార్టీ టికెట్ నిరాక‌రించ‌డంతో ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త్వ‌ర‌లోనే తాను పార్టీకి రాజీనామా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఆయ‌న గోవా ఎన్నిక‌ల్లో బీజేపీ మేనిఫెస్టో క‌మిటీకి అధ్య‌క్షుడిగా ఉన్నారు.