రాజమండ్రి రాజకీయం రసవత్తరం

రాజమండ్రి రాజకీయం రసవత్తరం

ఏపీలో అధికార వైసీపీలోకి వలసల జోరు ఇప్పట్లో ఆగేలా లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే టిడిపి, జనసేనకు చెందిన కీలక నాయకులు... మాజీ ఎమ్మెల్యేలు.. జిల్లా స్థాయి నేతలు వరుసపెట్టి ఆ పార్టీలో చేరబోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలో చేర్చుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించిన సీఎం జగన్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గేట్లు ఎత్త‌డంతో ఒక్కసారిగా వలసలు ఊపందుకున్నాయి. అడారి ఆనంద్‌కుమార్‌, పిల్లా ర‌మాదేవి, తోట‌ త్రిమూర్తులు ఇప్పటికే వైసిపిలో చేరగా... తాజాగా దసరా రోజున రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో పాటు మాజీ ఎమ్మెల్సీ గతంలో వైసీపీ నేతగా ఉన్న జూపూడి ప్రభాకర్ రావు వైసీపీ కండువా కప్పుకున్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. ఇదిలా ఉంటే ఆకుల సత్యనారాయణ 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత బిజెపి నేత సోము వీర్రాజుకు ఆయనకు ఉన్న వైరం నేపథ్యంలో ఎన్నికలకు ముందు జనసేనలోకి జంప్‌ చేసేశారు. ఈ ఎన్నికల్లో జనసేన నుంచి రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన‌ప్పటి నుంచి ఆయ‌న జ‌న‌సేన‌కు దూరం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు.

ఇక ఆకుల సత్యనారాయణ వైసీపీ మరో వైసీపీ నేత ఆకుల వీర్రాజు పోస్టుకు ఎర్త్ పెట్టేసిన‌ట్టే కనిపిస్తోంది. వైసిపి ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా ఉన్న ఆకుల వీర్రాజు గత రెండు ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వీర్రాజు విజయం సాధించాల్సి ఉన్నప్పటికీ సామాజిక సమీకరణలు... జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ భారీగా ఓట్లు చీల్చ‌డంతో  అనూహ్యంగా వీర్రాజు ఓటమిపాలై టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు.

ఇక రెండు సార్లు ఓడిపోయిన వీర్రాజును ప‌క్క‌న పెట్టి ఇప్పుడు ఆర్థికంగా కూడా స్ట్రాంగ్‌గా ఉన్న ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌కు అక్క‌డ ప‌గ్గాలు అప్ప‌గించాల‌న్న ఆలోచ‌న‌లో వైసీపీ అధిష్టానం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక గ‌తంలో వైసీపీ నుంచి కొండ‌పిలో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు సైతం వైసీపీలో చేరుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లి అక్క‌డ ఎమ్మెల్సీ, ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ప‌నిచేసిన ఆయ‌న తిరిగి వైసీపీలోకి రివ‌ర్స్ జంప్ చేస్తున్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English