టీవీ9 రవిప్రకాశ్ అరెస్ట్ వెనుక అంత కథ ఉందా?

టీవీ9 రవిప్రకాశ్ అరెస్ట్ వెనుక అంత కథ ఉందా?

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఒక్కసారిగా ఇలా కేసుల్లో కూరుకుపోయారెందుకు? అటు ఏపీ ప్రభుత్వంలోని పెద్దలు, ఇటు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కూడా రవిప్రకాశ్‌ను వెంటాడుతున్నారెందుకు? రవి ప్రకాశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేయకుంటే తమ రాజకీయ భవిష్యత్తుకు ఆయన సమాధి కట్టేస్తాడని భావించారా?

తాము తీవ్రంగా వ్యతిరేకించే ఓ నాయకుడితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ, ఆయనకు సహాయం చేస్తుండడమే దీనికి కారణమా? అంటే అవుననే అంటున్నాయి దిల్లీ మీడియా వర్గాలు. ఆ నాయకుడు మరెవరో కాదు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. అవును.. రేవంత్ రెడ్డితో టీవీ9 రవిప్రకాశ్ కలిసి పనిచేస్తున్నారన్న కారణంతోనే ఆయన్ను అన్ని వైపుల నుంచి మూస్తున్నారని సమాచారం.

టీడీపీలో ఉన్నప్పటి నుంచి దూకుడుగా ఉండే నేత రేవంత్ రెడ్డి. కేసీఆర్‌ను బలంగా ఎదుర్కొంటున్నది ఎవరైనా ఉన్నారంటే అది రేవంతే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నా కూడా ఎక్కడా తగ్గకుండా కేసీఆర్‌తో ఢీకొడుతున్నారాయన. అంతేకాదు.. ఎన్నో ఆశలు పెట్టుకున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడా మళ్లీ కోలుకుని లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు రేవంత్.

కేసీఆర్ పతనమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న రేవంత్ ఇప్పుడు హుజూర్‌నగర్ ఉప ఎన్నిక విషయంలోనూ టీఆరెస్ ఓటమి టార్గెట్‌గా పనిచేస్తున్నారు. పార్టీలో విభేదాలున్నప్పటికీ కేసీఆర్‌తో విరోధం కారణంగా బైపోల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాద్యతలను భుజానికెత్తుకున్న రేవంత్‌ను టీఆరెస్ మరోసారి టార్గెట్ చేసిందట. ఆ క్రమంలోనే ఆయనకు అండదండలు అందిస్తున్న రవి ప్రకాశ్‌కు అన్ని దారులూ మూసినట్లు తెలుస్తోంది.

రవిప్రకాశ్‌ను టీవీ 9 కొత్త యాజమాన్యం పూర్తిగా బయటకు గెంటేయడంతో పాటుగా ఏకంగా నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ, మోసం తదితర కేసులను ఇప్పటికే నమోదు చేసింది. అయినా కూడా రవిప్రకాశ్ ను టీఆర్ఎస్ సర్కారు అరెస్ట్ చేయలేదు. ఏదో అలా పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఓ నాలుగైదు రోజులు విచారించింది, ఆ తరువాత ఆయన కూడా కామ్ అయిపోయారు.

అయితే, ఇదంతా పైకి కనిపించేది మాత్రమేనట.. తనను మూడు చెరువుల నీళ్లు తాగించి, తనను డీఫేమ్ చేసిన కేసీఆర్ బ్యాచ్‌పై రివెంజ్ తీర్చుకోవాలని ఆయన రేవంత్ రెడ్డితో కలిసి ప్లాన్ చేసినట్లు టీఆరెస్ ప్రభుత్వం అనుమానించినట్లు తెలుస్తోంది. దిల్లీ కేంద్రంగా రేవంత్, రవి ప్రకాశ్‌లు పలుమార్లు భేటీ అయినట్లుగా వారి వద్ద సమాచారం ఉందని చెబుతున్నారు.

రవి ప్రకాశ్‌కు కాస్త సన్నిహితంగా ఉండే ఆ చానల్ జర్నలిస్టే ఒకరు, రవిప్రకాశ్‌ను బయటకు పంపినా తనను ఇంకా పంపకుండా కొనసాగిస్తున్నందుకు కృతజ్ఞతగా ఈ సమాచారం టీఆరెస్ ప్రబుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉండే వర్గాలతో పంచుకోవడంతో ఇదంతా మొదలైందని తెలుస్తోంది.

దిల్లీలోని మరో ప్రధాన పత్రికకు చెందిన ఓ వ్యక్తి కూడా టీఆరెస్ మాజీ ఎంపీ ఒకరి వద్ద దిల్లీలో రేవంత్ మూవ్‌మెంట్స్‌కు సంబంధించిన సమాచారం పంచుకున్నారని.. ఆ ఆధారాలతో టీఆరెస్ కూపీ లాగిందని ప్రచారం జరుగుతోంది.

ఇది చాలదన్నట్లు రవిప్రకాశ్  హుజూర్ నగర్ లో రేవంత్ బృందానికి సాయం అందించేందుకు రంగంలోకి దిగారట. రేవంత్ ప్రసంగాలను సిద్ధం చేయడంతో పాటుగా హుజూర్ నగర్ బైపోల్స్ లో కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ లోనూ కీలక భూమిక పోషించడం మొదలెట్టారట. ఈ సంగతి కూడా టీఆర్ఎస్ పెద్దలకు చేరిపోయిందట.

టీవీ 9 వివాదం సమయంలో అక్కడికి వెళ్లిన పోలీసులను అడ్డుకున్నారన్న ఓ చిన్న కేసును అడ్డంపెట్టుకుని టీఆర్ఎస్ సర్కారు రవిప్రకాశ్ ను అరెస్ట్ చేసింది.  రవిప్రకాశ్‌ను తామొక్కరమే ఎదుర్కోలేమోమో అన్న భయం ఉండడంతో మరో మాస్టర్ మైండ్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితోనూ ఫిర్యాదు చేయించారని వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English