పువ్వాడ అజయ్ పొలిటికల్ కెరీర్‌ ఖతం చేసిన కేసీఆర్?

పువ్వాడ అజయ్ పొలిటికల్ కెరీర్‌ ఖతం చేసిన కేసీఆర్?

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెతో రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. కేసీఆర్ పట్టుదలకు పోయి సుమారు 48 వేల మంది కార్మికులను తొలగించడంతో రవాణా మంత్రిగా పువ్వాడ అజయ్ అడ్డంగా బుక్కయ్యారు.

ఇంతవరకు ఎన్నడూ ఉద్యోగులను తొలగించడమన్నది లేని రాష్ట్రంలో తొలిసారి ఇంతపెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులను తొలగించడం.. అది కూడా రవాణా మంత్రిగా పువ్వాడ ఉన్నప్పుడు జరగడంతో ఆ పాపం ఆయనపైనా పడింది. ఈ పరిణామాలు ఆయన రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

పువ్వాడ అజయ్ నేపథ్యం మిగతా మంత్రుల కంటే భిన్నమైనది.. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ఏడేళ్లలోనే రెండు సార్లు వరుసగా అసెంబ్లీకి గెలిచి మంత్రి పదవి కూడా పొందారు. ఈ ఏడేళ్ల కాలంలో మూడు పార్టీలు మారినా ఆయన ప్రజలకు సర్దిచెప్పుకొంటూ రాగలిగారు కానీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులపై వేటు విషయంలో మాత్రం సమాధానం చెప్పుకోలేక గిలగిలలాడుతున్నారు.

పువ్వాడ అజయ్ తండ్రి నాగేశ్వరరావు తన రాజకీయ జీవితంలో అత్యధిక కాలం కరడుగట్టిన కమ్యూనిస్టు నేతగా గడిపారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన వివిధ రంగాల కార్మికుల సమస్యలపై సుదీర్గ కాలం పోరాటాలు చేశారు. ఆయన తనయుడు పువ్వాడ అజయ్ కుమార్ రవానా మంత్రిగా ఉన్నప్పుడు కార్మికులకు న్యాయం జరగాల్సిందిపోయి ఏకంగా 48 వేల మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.

ఖమ్మం జిల్లాలో ఇలాంటి చర్చ ఇప్పటికే మొదలైంది. సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఆశిస్తున్న అజయ్ 2012లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అన్నీ సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటూ తొందరగా ఎదిగారు. వైసీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైనా 2014లో కాంగ్రెస్‌లో చేరి తొలిసారి గెలిచారు.

ఆ తరువాత టీఆరెస్‌లో చేరిపోయారు. మొన్నటి 2018లో ఖమ్మంలో టీఆరెస్ నుంచి గెలిచారు. పాత ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఏకైక టీఆరెస్ నేతగా ఆయన కేబినెట్లో స్థానం సంపాదించుకున్నారు. కానీ, ఇప్పుడు కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల విషయంలో తీసుకున్న నిర్ణయంతో ఇరుకునపడ్డారు.

ఈ మచ్చ ఆయనపై పడకుండా ఉండాలంటే ఆయన రాజీనామా చేయడం బెటరని.. అప్పుడు ఆయన్ను రాష్ట్ర ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని.. తిరుగులేని రాజకీయ జీవితం దొరుకుతుందని పలువురు సూచనలిస్తున్నారు. కానీ, అజయ్ మాత్రం కేసీఆర్ మాటకు ఎదురుచెప్పలేక కక్కలేక మింగలేక ఉండిపోతున్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English