రాహుల్ పారిన్ టూర్లకు ఇబ్బందే

రాహుల్ పారిన్ టూర్లకు ఇబ్బందే

వీవీఐపీలకు ఇస్తున్న భద్రత విషయంలో నరేంద్ర మోదీ సర్కారు చేసిన సవరణలతో కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ లాంటి వారికి ఇబ్బందులు తప్పేలా లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. గాంధీ ఫ్యామిలీకి చాలా కాలం నుంచి స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) సెక్యూరిటీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

ప్రధాని పదవిలో ఉన్నవారితో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని ఏళ్ల తరబడి తమ చేతుల్లోనే పెట్టుకున్న గాంధీ ఫ్యామిలీకి కూడా ఎస్పీజీ భద్రతే కొనసాగుతోంది. ఈ భద్రత ఉన్నవారిని టచ్ చేయడమంటూ దాదాపుగా అసాధ్యమేనని చెప్పాలి.

ఇంతటి రక్షణ కవచం ఉన్న గాంధీ ఫ్యామిలీకి చెందిన వారు... విదేశీ పర్యటనల్లో మాత్రం ఎస్పీజీ పర్సనల్స్ ను వెనక్కు పంపేస్తున్నారు. ఈ క్రమంలో అసలు వారు ఎక్కడికి వెళుతున్నారు? ఏం చేస్తున్నారన్న వివరాలు బయటకు పొక్కడం లేదు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లారన్న వివరాలు ఈ కారణంగానే వెల్లడి కాలేదు.

అయితే ఈ తరహా రహస్య పర్యటనలపై మోదీ సర్కారు కొరడా ఝుళిపించిందనే చెప్పాలి. ఎస్పీజీ రక్షణ నిబంధనలను కేంద్ర హోం శాఖ తాజాగా సవరించేసింది. సవరించిన నిబంధనల ప్రకారం వీవీఐపీలు ఇక నుంచి విదేశాల్లో పర్యటించినప్పుడు ఎస్‌పీజీ సిబ్బంది అనుక్షణం వారిని వెన్నంటి ఉండటం తప్పనిసరి.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంబోడియా పర్యటనకు వెళ్లారని తెలుస్తున్న నేపథ్యంలో వీవీఐపీల భద్రతా నిబంధనలను ప్రభుత్వం సవరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సవరించిన నిబంధనల ప్రకారం వీవీపీలు విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు వారు ఏ సమయంలో ఎక్కడకు వెళ్లినా ఎస్‌పీజీ సిబ్బంది వారి వెన్నంటే ఉంటారు.

ఇది ఎస్‌పీజీ రక్షణ పొందుతున్న వీవీఐలకు ఆమోదయోగ్యం కాకపోతే, భద్రతా కారణాల రీత్యా వారి విదేశీ పర్యటనలకు కేంద్రం కోతపెట్టే అవకాశం ఉంటుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
 
ఎస్పీజీ భద్రతా ప్రమాణాలకు సంబంధించి చేసిన మార్పులు అమల్లోకి వస్తే.. గాంధీ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఎస్పీజీ భద్రత కొనసాగుతున్న ఏ ఒక్కరు కూడా ఎస్పీజీ పర్సనల్స్ ను వెనక్కు పంపడం కుదరదు. అంటే విదేశీ పర్యటనల్లో వీరు ఎక్కడికెక్కడికి వెళుతున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? వంటి వివరాలన్నీ క్షణాల్లోనే కేంద్రానికి తెలిసిపోతాయి.

అంటే ఇప్పటిదాకా సోనియా గాంధీ గానీ, రాహుల్ గాంధీ గానీ విదేశాల్లో రహస్యంగా చేస్తున్న పర్యటనలు ఇకపై కుదరవన్న మాట. ఎందుకంటే... దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వారు ఎక్కడికి వెళ్లినా కూడా ఎస్పీజీ సిబ్బంది వారి వెన్నంటే ఉంటారు. దీంతో వారి రహస్య పర్యటనలకు అసలు ఛాన్సే ఉండదన్న మాట.

ఈ తరహా కొత్త నిబంధనలపై మోదీ సర్కారు ఏం చెబుతున్నదంటే... విదేశాల్లో ఎస్పీజీ భద్రత లేకుంటే వీవీఐపీలకు భద్రతాపరమైన ప్రమాదం ఉందని కేంద్రం చెబుతోంది. మరి ఈ మార్పులపై వీవీఐపీలు ప్రత్యేకించి ఎప్పుడూ రహస్య పర్యటనలకే ఇష్టపడే సోనియా, రాహుల్ ఏమంటారో చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English