నయన్ మీద తమన్నా పైచేయి

నయన్ మీద తమన్నా పైచేయి

దక్షిణాదిన కొన్నేళ్లుగా నంబర్ వన్ కథనాయికగా కొనసాగుతోంది నయనతార. మామూలుగా వయసు పెరిగే కొద్దీ హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయి కానీ.. నయనతార విషయంలో దీనికి భిన్నంగా జరుగుతోంది. ఆమె డేట్ల కోసం పెద్ద పెద్ద హీరోలు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఆమె సినిమా ఒప్పుకుంటే చాలానుకునే దర్శక నిర్మాతలు చాలామంది ఉన్నారు.

ఐతే దక్షిణాదిన మరే కథానాయిక అందుకోని స్థాయిలో భారీగా పారితోషకం పుచ్చుకునే నయన్.. కాల్ షీట్ల విషయంలో మరీ కచ్చితంగా ఉంటుందంటారు. అలాగే ప్రమోషన్లకు ఎట్టి పరిస్థితుల్లో రానని కండిషన్ పెడుతుంది. మామూలు సినిమాలైతే ఓకే కానీ.. కనీసం ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాల్ని కూడా ఆమె పట్టించుకోకపోవడం అభ్యంతరకరమే. తెలుగు వెర్షన్ ప్రమోషన్లకు రాకపోయినా.. కనీసం తమిళ వెర్షన్ కోసం పెట్టిన ప్రెస్ మీట్‌కు అయినా రావాల్సింది. కానీ రాలేదు.

ఐతే ఈ సంగతలా ఉంచితే.. నయన్ ఓ సినిమా చేసిందంటే ఆమె పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటోంది. ఇద్దరు కథానాయికలున్న సినిమాలో నయన్ నటిస్తే పేరంతా ఆమెకే పోతుంది. సినిమాలో ఆమే హైలైట్ అవుతుంటుంది. పాత్ర ప్రాధాన్యం, నయన్ పెర్ఫామెన్స్ అన్నీ టాప్ లెవెల్లో ఉండి.. రెండో హీరోయిన్ ఔట్ షైన్ అయిపోతుంటుంది.

కానీ ‘సైరా’ విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. ఇందులో నరసింహారెడ్డి భార్యగా నయన్‌దే లీడ్ హీరోయిన్ పాత్ర. తమన్నా ఆయన్ని ఆరాధించే అమ్మాయిగా సహాయ పాత్రే చేసింది. కానీ సినిమాలో నయన్ అనుకున్న స్థాయిలో హైలైట్ కాలేదు. ఆమె నట కౌశలాన్ని చూపించే అవకాశం ఈ పాత్ర ఇవ్వలేదు. తనతో పోలిస్తే తమన్నా పాత్రకే ప్రాధాన్యం ఎక్కువగా కనిపించింది. పెర్ఫామెన్స్ విషయంలోనూ ఆమే హైలైట్ అయింది.

నయన్ మీద తమన్నా పైచేయి సాధించడం అన్నది అరుదైన విషయం. అయితే నయన్ లాగా కాకుండా తమన్నా ‘సైరా’ను ఉత్తరాదిన బాగా ప్రమోట్ చేసింది. చెన్నైకి కూడా వెెళ్లింది. పారితోషకం మాత్రం నయన్ కంటే తక్కువ తీసుకుని ఉంటుందేమో. ఆమె పడ్డ కష్టానికి, తీసుకున్న పారితోషకానికి ఇప్పుడింత మంచి పేరు రావడం న్యాయమే కదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English