మృతదేహాలు తీసేవరకు గోదావరి నీళ్ళు వాడరట

మృతదేహాలు తీసేవరకు గోదావరి నీళ్ళు వాడరట

గోదావరి నదిలో బోటు ప్రమాదం జరిగి వారం రోజులైంది. ఇంకా 16 మంది ఆచూకీ తెలియలేదు. వారి మృతదేహాలు దొరకాల్సి ఉంది. కొందరి మృతదేహాలు బోటులోనే చిక్కుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా బోటు పైకి తీయలేకపోయింది. కొన్ని మృతదేహాలు బోటులో, ఇంకొన్ని గోదావరిలో దిగువకు కొట్టుకొచ్చి ఉంటాయని భావిస్తున్నారు.

 దీంతో ప్రమాదం జరిగిన కచ్చులూరు దిగువ ప్రాంతాలవారు గోదావరి నీటిని వాడడానికి ఇష్టపడడంలేదు.  బోటు మునిగిపోయిన తరువాత నదీమతల్లి మైలపడిందని, చివరి మృతదేహాన్ని వెలికితీసేంత వరకూ ఆ నీటిని వాడేది లేదని కచ్చులూరు దిగువ ప్రాంతాల ప్రజలు తేల్చి చెబుతున్నారు. మరోవైపు మృతదేహాల కోసం ప్రభుత్వం గాలింపు చర్యలు నిలిపివేయడంతో ఆ మృతదేహాలు దొరికే పరిస్థితి కనిపించడం లేదు.

ఉభయ గోదావరి జిల్లాలకు జీవనదిగా ఉన్న గోదావరిని, ఈ ప్రాంత ప్రజలు నిత్యమూ పూజిస్తారన్న సంగతి తెలిసిందే. జూన్ తొలివారంలో కాలువలకు నీటిని విడుదల చేసే వేళ, కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేస్తారు కూడా. మృతదేహాల వెలికితీతలో ప్రభుత్వ వైఫల్యం ఇప్పుడు గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలపై ప్రభావం చూపుతోంది.

ఇటీవల దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద గోదావరి మునిగిపోగా, ఇప్పటికింకా అన్ని మృతదేహాలనూ వెలికితీయలేదన్న సంగతి తెలిసిందే. దీంతో గోదావరి నీటిని వాడేందుకు పరీవాహక గిరిజన గ్రామాలు ఇష్టపడటంలేదు. మొత్తం 10 నుంచి 12 గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. కాస్తంత దూరమైనా, బోర్డు, కొండలపై నుంచి వచ్చే జల కాలువల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. మృతదేహాలన్నీ బయటకు వచ్చాక, నదీమతల్లిని శుద్ధి చేసిన తరువాతనే నీటిని వాడుకుంటామని గిరిజనులు భీష్మించుకు కూర్చున్నారు. కాగా, గత సంవత్సరం మే 15న మంటూరు వద్ద ప్రమాదం జరిగిన సమయంలోనూ వీరు ఇలానే వ్యవహరించారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English