రామ్మోహననాయుడు బీజేపీలో చేరుతున్నారా?

రామ్మోహననాయుడు బీజేపీలో చేరుతున్నారా?

టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు బీజేపీలో చేరుతున్నారంటూ ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో, స్థానిక టీవీ చానళ్లు, యూట్యూబ్ చానళ్లలో గత రెండు రోజులుగా ఇది ప్రచారమవుతోంది. రామ్మోహన్ నాయుడుతో బీజేపీ అగ్రనేతలు టచ్‌లో ఉన్నారని.. ఆయన బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే, అదంతా అవాస్తవమని, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని రామ్మోహన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మొన్నటి ఎన్నికల్లో వైసీపీ సుడిగాలిని తట్టుకుని గెలిచిన అతికొద్ది మంది ఎంపీల్లో రామ్మోహన్ నాయుడు ఒకరు. తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 5 అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకున్నప్పటికీ రామ్మోహన్ విజయం సాధించగలిగారు.

పైగా కాస్త విషయ పరిజ్ఞానంతో పాటు తెలుగు, ఇంగ్లిష్, హిందీల్లో బాగా మాట్లాడగలిగే నేత కావడంతో ఆయన్ను పార్టీలోకి తీసుకుంటే ఏపీ బీజేపీ అధికార ప్రతినిధిగా నియమించొచ్చని.. అలాగే, ఉత్తరాంధ్రలో బీజేపీ బలం పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని బీజేపీ నేతలు అనుకుంటున్నారట. ఆ క్రమంలోనే ఆయన్ను పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ నేతలు బలంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

బీజేపీ కీలక నేతలు రామ్మోహన్‌ను ఆల్రెడీ సంప్రదించారని కూడా ప్రచారమవుతోంది. ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబు వరకు వెళ్లిందని చెబుతున్నారు. అయితే, రామ్మోహన్ నాయుడి బాబాయి అయిన అచ్చెన్నాయుడు టీడీపీలో ఇప్పుడు కీలకంగా ఉన్నారు. ఆయన ఈ పార్టీ మార్పునకు అంగీకరించడం లేదని టాక్. మరోవైపు రామ్మోహన్ కూడా ఈ ప్రచారాలను ఖండించారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని.. అధికారమే తమకు పరమావధి కాదని.. అధికారంలో ఉన్నా లేకపోయినా తామెప్పుడూ టీడీపీలోనే ఉంటామని ఆయన చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English