బీజేపీలోకి నారాయణ?.... వేగంగా రంగం సిద్ధమవుతున్నట్లే

బీజేపీలోకి నారాయణ?.... వేగంగా రంగం సిద్ధమవుతున్నట్లే

పొంగూరు నారాయణ... ఈ పేరు విన్నంతనే నారాయణ విద్యా సంస్థల అధినేతతో పాటుగా మొన్నటి ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓటమిపాలైన టీడీపీకి ఆర్థిక స్తంభంగా నిలిచిన వ్యక్తి మన కళ్ల ముందు కదలాడతారు. టీడీపీకి ఆర్థికంగా ఏ కష్టం వచ్చినా కూడా ఆ పార్టీ అధిష్ఠానం ముందుగా నారాయణనే సంప్రదిస్తుందన్న మాట జగమెరిగిన సత్యమే. అందుకే కాబోలు... 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకున్నా కూడా నారాయణను పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలోకి తీసుకుని, ఆపై ఎమ్మెల్సీ సీటిచ్చి... కీలక శాఖల బాధ్యతలను అప్పగించారు. అంతేనా... నవ్యాంధ్ర నూతన రాజధాని వ్యవహారాలన్నీ కూడా నారాయణ కనుసన్నల్లోనే నడిచాయి. టీడీపీలో ఇంతటి కీలకమైన నేత ఇప్పుడు బీజేపీలోకి చేరిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఇప్పటికే దెబ్బల మీద దెబ్బలు తగులుతున్న చంద్రబాబుకు మరో భారీ దెబ్బ తప్పదని చెప్పక తప్పదు.

అయినా టీడీపీలో క్రియాశీలకంగా ఉండే నారాయణ ఇప్పటికిప్పుడు పార్టీ మారతారు? ఈ ప్రశ్న దాదాపుగా అందరిలోనూ వినిపిస్తున్నదే. అటు కేంద్రంతో పాటుగా ఇటు రాష్ట్రంలోనూ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలే నారాయణను పార్టీ మారేలా చేస్తున్నాయన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఆ పరిస్థితులేమిటన్న విషయానికి వస్తే... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎన్నికలకు ముందే చంద్రబాబు సున్నం పెట్టుకున్నారు. ఫలితంగా ఇతర పార్టీలను పక్కనపెట్టేసిన బీజేపీ... ఏపీ వరకు టీడీపీనే టార్గెట్ చేసింది. ఎన్నికలకు ముంగిట టీడీపీ నేతలకు చెందిన నేతల సంస్థల్లో వరుసగా జరిగిన ఐటీ, సీబీఐ దాడులే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. ఈ దాడుల్లో నారాయణకు చెందిన నారాయణ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. సరే... ఎలాగూ ఎన్నికలు జరుగుతున్నాయి కదా... ఎన్నికలు ముగిసిన తర్వాత మోదీ సర్కారుపై దండెత్తుదామని టీడీపీ భావించింది. అయితే టీడీపీ అంచనాలన్నీ తలకిందులు కాగా...ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిపోగా... తాను ఓడినా మోదీ గెలవొద్దన్న చంద్రబాబు ఆశ కూడా నెరవేరలేదు. అదే సమయంలో రాష్ట్రంలో తమ బద్ధ శత్రువు వైసీపీ ఘన విజయం సాధించింది.

మొత్తంగా ఇప్పుడు టీడీపీకి ఎటూ కదలడానికి వీల్లేకుండా పోయింది. ఈ భావనతోనే రాజకీయాల కంటే కూడా తమకు కీలకమని భావిస్తున్న వ్యాపారాలు నిర్వహిస్తున్న సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ వంటి హేమాహేమీలు మూకుమ్మడిగా బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు వారి బాటలోనే నారాయణ నడవక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ఓ దఫా ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో నారాయణ విద్యా సంస్థల పరిస్థితి కాస్తంత ప్రమాదకరంగానే ఉందని చెప్పక తప్పదు. అంతేకాకుండా అమరావతిలో పెద్ద ఎత్తున భూములు సేకరించిన నారాయణ దానిపై చాలా పెద్ద మొత్తంలోనే ఖర్చు పెట్టారు. ఇప్పుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... రాజధాని నిర్మాణం ఉన్నపళంగా ఆగిపోయింది. అందుబాటులో ఉన్ననిదులన్నీ వెచ్చించి నారాయణ వెచ్చించిన భూముల ధరలు ఒక్కసారిగా అధ:పాతాళానికి పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిలో నారాయణ పెట్టిన పెట్టుబడి ఇప్పటికిప్పుడు కాదు కదా... ఏళ్లు గడచినా వెనక్కి వస్తుందో, రాదో కూడా తెలియని పరిస్థితి.

మొత్తంగా నారాయణ ఇప్పుడు ఆర్థికంగా బాగా చితికిపోయిన నేత కిందే లెక్క. ఈ కారణంగానే టీడీపీ ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు నారాయణ చాలా దూరంగానే ఉంటున్నారు. చంద్రబాబు నిర్వహిస్తున్న ఏ ఒక్క కార్యక్రమంలో కూడా నారాయణ కనిపించడం లేదు. పార్టీ తరఫున తన సొంత జిల్లా నెల్లూరుతో పాటు తాను పోటీ చేసిన నెల్లూరు అర్బన్ పరిధిలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాల్లోనూ నారాయణ కనిపించడం లేదు. కేవలం నెల్లూరు, హైదరాబాద్ లకే పరిమితమైన నారాయణ అసలు టీడీపీ వ్యవహారాలనే పట్టించుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకున్న నారాయణ.. తన సొంత జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేతను శరణువేడారట. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా తనను బీజేపీలోకి చేర్చుకునేలా బీజేపీ అధిష్ఠానంతో మాట్టాడాలని నారాయణ సదరు కమలం నేతను కోరారట. ఇక బీజేపీకి సంబంధించి ఏపీ చీఫ్ గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కూడా తన సొంత సామాజిక వర్గానికి చెందిన నారాయణను బీజేపీలోకి చేర్చుకుంటే ఉభయతారకంగా ఉంటుందని కూడా భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో చాలా త్వరలోనే నారాయణ బీజేపీలోకి చేరిపోవడం ఖాయమన్న వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English