ఈ మంత్రి అసెంబ్లీలో ఉన్నారంటే...న‌వ్వులే న‌వ్వులు

ఈ మంత్రి అసెంబ్లీలో ఉన్నారంటే...న‌వ్వులే న‌వ్వులు

చామకూర మల్లారెడ్డి..ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌. ప్ర‌స్తుత టీఆర్ఎస్ నేత‌, తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కూడా. త‌న‌దైన శైలిలో కామెంట్లు చేసే మ‌ల్లారెడ్డికి పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్లు ఉన్నారు.

గ‌తంలో సినీ న‌టుడు రామ్‌చ‌ర‌ణ్ తేజ్ గురించి చేసిన కామెంట్లు అయితే...వైర‌ల్ అయ్యాయి. అసెంబ్లీలో కార్మికశాఖ పద్దులపై చర్చకు సమాధానమిస్తూ మంత్రి చామకూర మల్లారెడ్డి ఓ రేంజ్‌లో రియాక్ట‌య్యారు.

ఐదేళ్లలో రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి మార్గంలో నడిపారని.. దుబాయ్ దివాలా తీస్తే.. హైదరాబాద్ నగరం మాత్రం అభివృద్ధిలో టాప్ లో ఉందనీ చెప్పారు. ఇలా ఓ ద‌శ‌లో కొంత సహనం కోల్పోయారు. దీంతో ఓ సందర్భంలో ఆయన్ను మంత్రి కేటీఆర్ నవ్వుతూ వారించాల్సిన సందర్భం ఎదురైంది.

28 రాష్ట్రాల్లో 28 ముఖ్యమంత్రుల్లో ఎవరూ కేసీఆర్ అంత ప్రగతి చూపించలేదని గుండెలు బాదుకుంటూ  మంత్రి మల్లారెడ్డి చెప్పారు. '28 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలో ఎవరూ పింఛన్లు ఇవ్వలేదు...పథకాలు రచించలేదు...ప్రాజెక్టులు కట్టలేదు...దేశంలోనే తన పాలనతో చరిత్ర సృష్టించిన ఘనత కేసీఆర్ ది. మూడేళ్లలోనే కాళేశ్వరాన్ని కట్టారు' అని మల్లారెడ్డి అన్నారు. ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం చెప్పడంతో 'కార్మికులతోనే కట్టారయ్యా... కాళేశ్వరం ప్రాజెక్టు.. మూడేళ్లలో కార్మికులు కట్టారు కాబట్టే కంప్లీట్ అయ్యింది అది' అని మల్లారెడ్డి సహనం కోల్పోయి ఆవేశంగా చెప్పారు.

అదే సందర్భంలో మంత్రి కేటీఆర్ నవ్వుతూ మంత్రి మల్లారెడ్డికి సర్ది చెప్పారు. సమాధానం కొనసాగించండి అన్నట్టుగా సైగ చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా మంత్రిని కొనసాగించాలంటూ కోరడంతో మల్లారెడ్డి తన స్పీచ్ కంటిన్యూ చేశారు.

హైదరాబాద్‌లో ఉన్నన్ని ఉపాధి అవకాశాలు మరే రాష్ట్రంలోనూ లేవని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాలనుంచి ఉద్యోగాల కోసం హైదరాబాద్ వస్తున్నారని అన్నారు. దుబాయ్ లాంటి దేశం దివాలా తీసిందని.. హైదరాబాదే టాప్ లెవెల్లో నడుస్తోందని చెప్పారు. పేరుకు కార్మిక శాఖ కానీ, ఇది ధనిక శాఖ అనీ.. 1600 కోట్ల FDలు ఉన్నాయని మల్లారెడ్డి అన్నారు. కార్మికుల సమస్యలు పూర్తిగా తెలిసిన సీఎం కేసీఆర్ అన్నింటినీ పరిష్కరిస్తున్నారని చెప్పారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English