ఉత్త‌మ్‌కు ఎస‌రు పెడుతున్న రేవంత్‌రెడ్డి..!

ఉత్త‌మ్‌కు ఎస‌రు పెడుతున్న రేవంత్‌రెడ్డి..!

తెలంగాణ కాంగ్రెస్‌లో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి క‌ద‌లిక‌లు.. టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ప‌ద‌వికి ఎస‌రుపెట్టే దిశ‌గా క‌దులుతున్నాయ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఆయ‌న మాట‌ల్లో ఏదో తేడా కొడుతోంది. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా ఉత్త‌మ్ టార్గెట్‌గా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉండ‌డంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక హుజూర్‌న‌గ‌ర్ అభ్య‌ర్థి విష‌యంలో రేవంత్ మాట్లాడిన‌తీరునే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. అయితే.. టీపీసీసీ చీఫ్ ప‌ద‌వే ల‌క్ష్యంగా రేవంత్ క‌ద‌లిక‌లు ఉంటున్నాయ‌ని, ఆయ‌న మాట‌ల్లో ఇదే ఆంత‌ర్య‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి.

నిజానికి.. టీసీసీపీ చీఫ్ ప‌గ్గాలు రేవంత్‌రెడ్డికి అప్ప‌గిస్తార‌నే టాక్ పార్టీవ‌ర్గాల్లో చాలా కాలంగా వినిపిస్తోంది. తాజాగా.. హుజూర్‌న‌గ‌ర్ అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య వార్ మొద‌లైంది. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి గెలిచారు. ఆ త‌ర్వాత జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఆయ‌న న‌ల్ల‌గొండ ఎంపీ స్థానం నుంచి గెలిచిన త‌ర్వాత ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇక హుజూర్‌న‌గ‌ర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన నాటి నుంచే ఇక్కడ ఎవరు పోటీ చేస్తారన్న దానిపై కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

నిజానికి.. తన సతీమణి పద్మావతిని పోటీ చేయించే ఆలోచన లేదని ఉత్తమ్‌ మొదట్లో చెప్పారు. అయితే.. ఇటీవల చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. తన సతీమణి పద్మావతి పోటీ చేస్తారనే సంకేతాలిచ్చారు. దీంతో ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్లు వార్తలు రావ‌డంతో ఆ తర్వాత ఉత్త‌మ్ ఖండించారు. హుజూర్‌నగర్‌ అభ్యర్థిగా ఎవరినీ ఖరారు చేయలేదని ఆయ‌న‌ ప్రకటించారు.

ఇక ఇక్క‌డే రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఇదే అద‌నుగా ఉత్త‌మ్‌పై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. హుజూర్‌నగర్‌ బరిలో పద్మావతి ఉంటారని ఉత్తమ్‌ ఎలా ? చెబుతారని, అసెంబ్లీ అభ్యర్థిత్వాలను పార్టీ హైకమాండ్‌ ప్రకటించాలి క‌దా.. అంటూ రేవంత్‌రెడ్డి అభ్యం తరం వ్యక్తం చేయ‌డం గ‌మ‌నార్హం. అక్క‌డితోనే ఆగ‌కుండా. ఏకంగా బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాను కలసి రేవంత్‌ చర్చించారని, పద్మావతి అభ్యర్థిగా ఖరారైనా కూడా ఉత్తమ్‌ ప్రకటించడమేంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఒక‌వేళ‌.. ప‌ద్మావ‌తి పేరే ఖ‌రారు అయితే.. పార్టీ హైక‌మాండ్ ప్ర‌క‌టించాల‌ని క‌దా.. అంటూ అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. అలాగే.. అసెంబ్లీలో రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా చామల కిరణ్‌రెడ్డిని తాను ప్రతిపాదిస్తున్నానని పేర్కొనడం పార్టీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English