కేసీఆర్‌ లాగే బీజేపీ కూడా రెచ్చగొడతాదా?

కేసీఆర్‌ లాగే బీజేపీ కూడా రెచ్చగొడతాదా?

ముల్లును ముల్లుతోనే తీసేందుకు తెలంగాణ క‌మ‌ల‌ద‌ళం వ్యూహం ర‌చిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా అధికారంలోకి రావాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న బీజేపీ..  ఆ దిశంగా వేగంగా క‌దులుతోంది. అధికార టీఆర్ఎస్‌ను, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు అనేక వ్యూహాలు ర‌చిస్తోంది. తాజాగా.. మ‌రో అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఆ స‌రికొత్త అస్త్రం ఏమిటో చూద్దాం.. తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ల‌క్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ అనుస‌రించిన వ్యూహం ఒక్క‌టే.. సెంటిమెంట్‌..!

తెలంగాణ‌ను ఆంధ్ర పాల‌కులు దోచుకుతింటున్నార‌ని, ఆంధ్రా వ్యాపారుల‌ను, పెట్టుబ‌డిదారుల‌ను, పాల‌కుల‌ను ఇక్క‌డి నుంచి త‌రిమికొడితే.. తెలంగాణ ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డుతాయ‌న్న ఏకైక నినాదంతో కేసీఆర్ సెంటిమెంట్‌ను బాగా పండించారు. దాని ఫ‌లితంగా స్వ‌రాష్ట్రం కూడా వ‌చ్చేసింది.

అంటే.. సెంటిమెంట్‌ను రాజేసి.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలుగా మార్చ‌కోవ‌డంలో కేసీఆర్ దిట్ట‌. అయితే.. ఇక్క‌డ స‌మ‌స్య ఏమిటంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అదే ఆంధ్ర వ్యాపారుల‌కు, పెట్టుబ‌డి దారుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అండ‌గా ఉంటున్నారు.

హైద‌రాబాద్‌లో ఎవ‌రైనా ఉండొచ్చు.. హాయిగా వ్యాపారాలు చేసుకోవ‌చ్చున‌ని కేసీఆర్ చెబుతున్నారు. ప‌లు కీల‌క ప్రాజెక్టులు కూడా ఆంధ్రాకు చెందిన కంపెనీలే చేస్తున్నాయ‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఇక 2018లో జ‌రిగిన తెలంగాణ  అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కూడా కేసీఆర్ సెంటిమెంట్‌ను బాగానే ఉప‌యోగించుకున్నారు. అయితే.. ముల్లును ముల్లుతోనే తీయాల‌న్న వ్యూహంలో బీజేపీ ఉంది. తెలంగాణ నుంచి ఆంధ్రా వ్యాపారుల‌ను, పెట్టుబ‌డి దారుల‌ను త‌రిమివేస్తాన‌ని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడే వాళ్ల‌కే అండ‌గా ఉంటూ.. తొత్తుగా మారుతున్నార‌నే విష‌యాన్ని జ‌నంలోకి బ‌లంగా తీసుకెళ్లేందుకు రెడీ అవుతోంది.  

ఇక తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లిలో తెలంగాణ‌కు చెందిన ప‌లువురికి ఏపీ ప్ర‌భుత్వం స్థానం క‌ల్పించింది.. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులు ముగ్గురికి అవ‌కాశం ఇవ్వ‌డం వెనుక ఇద్ద‌రు సీఎంలు కేసీఆర్‌, జ‌గ‌న్ కుమ్మ‌క్కు అయ్యార‌ని బీజేపీ నేత జీ వివేక్ ఆరోపిస్తున్నారు. తెలంగాణ నుంచి ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు ఏకంగా ఏడుగురికి టీటీడీలో ఛాన్స్ ఇచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాల‌న అన‌డానికి ఇది మ‌రో ఉదాహ‌ర‌ణ అని వివేక్ ఫైర్ అయ్యారు.

అంతేగాకుండా.. ఆయ‌న ప‌లు అంశాల‌ను కూడా లేవ‌నెత్తారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రా నీళ్లు తీసుకుని వెళ్లిపోతుంటే, కేసీఆర్ ఎందుకు ? అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. మీకు నీళ్లు, మాకు ప‌ద‌వులు అన్న‌ట్టుగా కేసీఆర్ వ్యవ‌హారం  క‌నిపిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. ఇది ఆంధ్రా పాల‌కుల‌తో కేసీఆర్‌ చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ లా ఉంద‌న్నారు. తెలంగాణ అవ‌స‌రాల‌ను ఆంధ్రాకి తాక‌ట్టుపెడుతున్న‌ట్టున్నార‌ని ఆరోపించారు. ఏదేమైనా మ‌రోసారి ఆంధ్రా సెంటిమెంట్‌తో కేసీఆర్‌ను టార్గెట్ చేసేందుకు బీజేపీ వేస్తోన్న ఎత్తులు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ?  చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English