జనసేనపై ట్విట్టర్లో కుట్ర?

జనసేనపై ట్విట్టర్లో కుట్ర?

ఎన్నికల ముందు హడావుడి చేసే చాలా పార్టీలు.. ఫలితాల తర్వాత మిన్నకుండిపోతాయి. ముఖ్యంగా ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా లేకపోతే..  కేడర్ జావగారి పోవడం, యాక్టివిటీస్ తగ్గిపోవడం మామూలే. కానీ జనసేన పార్టీ మాత్రం దీనికి భిన్నంగా ఉంటోంది. ఎన్నికల తర్వాత ఆ పార్టీ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. పవన్ కళ్యాణ్ పరాభవం నుంచి త్వరగానే కోలుకుని క్షేత్రస్థాయిలోకి దిగి పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డాడు. కీలక సమస్యలపై పోరాటం కూడా సాగిస్తున్నాడు. దీంతో జనసైనికుల ఆఫ్ లైన్, ఆన్ లైన్ రెండు చోట్లా చాలా చురుగ్గా ఉంటున్నారు.

సోషల్ మీడియాను పరిశీలిస్తే ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశమా.. జనసేనా అన్న సందేహాలు కలుగుతాయి. వైకాపా మీద జనసేన సోషల్ మీడియా విభాగం గట్టిగా పోరాడుతోంది. అలాగే నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పవన్ చేస్తున్న పోరాటానికి కూడా గట్టి మద్దతు ఇస్తోంది.

ఇలాంటి తరుణంలో ట్విట్టర్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అభ్యంతకర సమాచారం పోస్ట్ చేస్తున్నారనే కారణంతో ఒకేసారి 300కు పైగా జనసేనకు మద్దతుగా నడిచే ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేసింది ట్విట్టర్ యాజమాన్యం. కంటెంట్ విషయంలో పెద్ద ఎత్తున అభ్యంతాలు వ్యక్తమైతే.. ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేయడం మామూలే.

కానీ ఒకటి రెండు అకౌంట్లంటే ఓకే కానీ.. ఒకేసారి 300కు పైగా అకౌంట్లు.. అందులోనూ ఒక పార్టీకి మద్దతుగా వున్న వాటినే లక్ష్యంగా చేసుకుని బ్లాక్ చేయడం అంటూ అసాధారణమే. జనసేనకు ట్విట్టర్లో చాలా కీలకం అయిన శతఘ్ని సహా చాలా అకౌంట్లే ఇందులో వున్నట్లు సమాచారం. దీని వెనుక వైకాపాతో పాటు కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ వాళ్లున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జగన్ వంద రోజుల పాలనను విమర్శిస్తూ #YSJAGAN FAILED CM.. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా #SAVE NALLAMALA హ్యాష్ ట్యాగుల్ని ట్రెండ్ చేస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తున్న అకౌంట్లనే టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English