కోడెల మరణాన్ని చంద్రబాబు మెడకు చుట్టాలునుకుంటున్న వైసీపీ?

కోడెల మరణాన్ని చంద్రబాబు మెడకు చుట్టాలునుకుంటున్న వైసీపీ?

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య వ్యవహారం ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీస్తోంది. వైసీపీ వేధింపుల వల్లే కోడెల మరణించారని టీడీపీ ఆరోపిస్తుండగా దాన్ని తిప్పికొట్టే పనిని వైసీపీ పూర్తిస్తాయిలో మొదలు పెట్టింది. ఆ క్రమంలోనే వైసీపీ మంత్రులు, సీనియర్ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ కోడెల ఆత్మహత్యకు చంద్రబాబు వైఖరే కారణమని ఆరోపిస్తున్నారు.

కోడెలతో చంద్రబాబు తప్పులన్నీ చేయించి ఆ తరువాత ఆయన్ను పట్టించుకోవడం మానేశారని.. కోడెల ఫోన్ చేసినా చంద్రబాబు లిఫ్ట్ చేయడం మానేశారని.. ఆ కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అడ్డగోలుగా వైసీపీపై బురద చల్లుతున్నారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.  చంద్రబాబు బతికున్నవాళ్లను హింసిస్తారనీ, చనిపోయాక శవరాజకీయం చేస్తారని దుయ్యబట్టారు. చంద్రబాబు తనను ఎలా వేధించాడో దివంగత నేత ఎన్టీఆరే స్వయంగా చెప్పారని అన్నారు.

తాడేపల్లిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... టీడీపీ నేత హరికృష్ణ చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు శవరాజకీయం చేశారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గత మూడు నెలలుగా కలుస్తానని కోడెల కోరినప్పటికీ చంద్రబాబు ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. 2 వారాల క్రితమే కోడెల నిద్రమాత్రలు మింగినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారనీ, మరి చంద్రబాబు అప్పుడైనా ఆయన్ను పరామర్శించారా? అని నిలదీశారు. సత్తెనపల్లిలో కోడెల వ్యతిరేక వర్గాన్ని చంద్రబాబు ప్రోత్సహించారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయం కోడెలను మానసికంగా ఇబ్బంది పెట్టిందన్నారు.

కోడెల ఆసుపత్రిలో ఉంటే చంద్రబాబు కనీసం పలకరించలేదనీ, ఆయన్ను సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారని గుర్తుచేశారు. టీడీపీ నేత వర్ల రామయ్యే కోడెలపై గతంలో తీవ్ర విమర్శలు చేశారన్నారు. పార్టీ సమావేశాలకు సైతం చంద్రబాబు కోడెలను ఆహ్వానించలేదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కోడెల క్యారెక్టర్ ను కించపర్చింది చంద్రబాబేనని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.

ఏపీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ...   కోడెల మరణానికి చంద్రబాబే పరోక్షంగా కారకులయ్యారని.. తెలంగాణ ప్రభుత్వం కోడెల కాల్ డేటాను విశ్లేషించాలనీ, ఇందులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గత 10 రోజులుగా చంద్రబాబు కోడెలకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. తాను నమ్మిన నాయకుడు, పార్టీ చేసిన అవమానంతోనే కోడెల ప్రాణాలు తీసుకున్నారని దుయ్యబట్టారు.

నిన్న ఉదయం 9 గంటలకు చంద్రబాబుతో అపాయింట్ మెంట్ కోసం కోడెల ప్రయత్నించగా దొరకలేదనీ, దీంతో కోడెల తీవ్ర మనోవేదనకు లోనయ్యారని చెప్పారు. సచివాలయంలో ఈరోజు కోడాలి నాని మీడియాతో మాట్లాడారు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కోడాలి నాని స్పష్టం చేశారు. ఫర్నీచర్, బిల్డర్ల కేసులు తమ ప్రభుత్వం పెట్టలేదని నాని అన్నారు. ‘ఏ కేసులోనూ కోడెల, ఆయన కుమారుడు, కుమార్తెలకు మేం నోటీసులు ఇవ్వలేదు. ఆయన్ను చంద్రబాబే వదిలించుకునేలా వ్యవహరించారు. పార్టీ నుంచి దూరం పెట్టి అవమానించారు. అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో వర్లరామయ్యతో విమర్శలు చేయించారు.

1999 బాంబుల కేసులో కోడెలపై విచారణ జరిపించి అవమానించింది చంద్రబాబు కాదా? ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించలేదా? ఇప్పుడు కోడెలను పల్నాటి పులి అంటున్న చంద్రబాబు, గతంలో కోడెలను పల్నాడుకు రాకుండా ఎందుకు అడ్డుకున్నారు. గతంలో నరసరావుపేట నుంచి కోడెలను సత్తెనపల్లికి పంపి అవమానించింది చంద్రబాబు కాదా?’ అని కొడాలి నాని నిలదీశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English