మరో ఉద్యమం తప్పదు.. కేంద్రానికి కమల్ వార్నింగ్

మరో ఉద్యమం తప్పదు.. కేంద్రానికి కమల్ వార్నింగ్

‘ఒక దేశం.. ఒక భాష’ అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తేనె తుట్టెను కదిపారు. పెద్ద వివాదాన్ని రాజేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారి తీశాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా తమిళనాడు సంగతి చెప్పాల్సిన పని లేదు. హిందీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేసిన చరిత్ర తమిళులకు ఉంది. ఇప్పటికీ హిందీ పట్ల వాళ్ల వ్యతిరేకత కొనసాగుతోంది. తమిళం జోలికి వస్తే వాళ్లు ఎప్పుడూ ఒప్పుకోరన్న సంగతి తెలిసిందే.

షా వ్యాఖ్యల మీద తమిళ నేతలు ఇప్పటికే భగ్గుమన్నారు. ఇప్పుడు మక్కల్ నీది మయం అధినేత కమల్ హాసన్ లైన్లోకి వచ్చాడు. హిందీని బలవంతంగా తమపైకి రుద్దాలని చూస్తే మరో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన జల్లికట్టుపై కొన్నేళ్ల కిందటి ఉద్యమాన్ని గుర్తు చేశారు.

ఒక దేశం ఒకే భాష అనే విధానం సరైనది కాదని... భారత్‌ ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఒక దేశం-అనేక భాషలు అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని కమల్ పేర్కొన్నాడు. దేశ జాతీయ గీతం బెంగాళీ భాషలో ఉన్నా.. అది దేశ ఐక్యతను అన్ని రాష్ట్రాలను సంస్కృతిని గౌరవిస్తుందని.. కాబట్టే దాన్ని తమిళులందరూ కూడా గౌరవిస్తారని.. కానీ రాష్ట్రాల సంస్కృతి జోలికి కేంద్రం రావడం సరికాదని.. గతంలో జల్లికట్టు ఉద్యమాన్ని తాము ఎంత ఉద్ధృతంగా చేశామో దేశమంతా చూసిందని... తమిళ భాష జోలికి వస్తే దానికి కంటే మరింత ఎక్కువగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని కమల్ హెచ్చరించాడు.

ఇటీవల హిందీ దివస్‌ సందర్భంగా అమిత్‌ షా ప్రసంగిస్తూ..భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని.. కాబట్టి ఈ దేశంలో ఉండాలంటే అందరూ హిందీ నేర్చుకోవాల్సిందే అని పేర్కొన్న సంగతి తెలిసిందే.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English