కోడెల రికార్డులు చాలానే వున్నాయి

కోడెల రికార్డులు చాలానే వున్నాయి

టీడీపీ నాయ‌కుడు.. సోమ‌వారం ఉద‌యం అనూహ్య రీతిలో అనంత లోకాల‌కు ఏగిన మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు మ‌ర‌ణ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ‌కీయ నేత‌ల‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అనుచ‌రులు, మిత్రులు, టీడీపీ నాయ‌కులు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న కోడెల‌.. గుంటూరులో అప్ర‌తిహ‌త విజ‌యాల‌ను అనేక మార్లు అందుకున్నారు. విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేసిన నాయ‌కుల స‌ర‌స‌న త‌న‌ను కూడా నిలుపుకొనేందుకు కోడెల ఎంతో శ్ర‌మించారు.

1947 మే 2న‌ గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో జ‌న్మించిన కోడెల వైద్యాన్ని వృత్తిగా స్వీక‌రించారు. అయితే, 1982లో ఎన్టీఆర్ పిలుపుతో ఆయ‌న‌ టీడీపీలో చేరారు. 1983లో న‌ర‌సారావుపేట నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి బి.సుబ్బారెడ్డిపై విజ‌యం సాధించిన కోడెల‌.. అదేఊపులో 1985లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపు గుర్రం ఎక్కారు.

ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ అభ్య‌ర్థి కెవి.కృష్ణారెడ్డిపై గెలుపు సాధించారు. ఇక‌, 1989లో కాంగ్రెస్ గాలిలోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. నిజానికి అప్పుడు కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎం.రాధాకృష్ణ‌మూర్తిపై విజ‌యం సాధించ‌డం టీడీపీ రికార్డుగా నిలిచిపోయింది.

ఆ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చిత్తుగా ఓడిపోయినా న‌ర‌సారావుపేట‌లో మాత్రం కోడెల మూడోసారి గెలుపుతో హ్యాట్రిక్ కొట్టారు. ఇక‌, 1994లో నాలుగోసారి ఘ‌న విజ‌యం సాధించారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి డి. బాల‌కోటిరెడ్డిపై విజ‌యం ద‌క్కించుకుని దూసుకుపోయారు.

అదేవిధంగా 1999లో ఐదోసారి గెలుపు గుర్రం ఎక్కి వ‌రుస‌గా తిరుగులేని విజ‌యాలు సాధించిన నాయ‌కుడిగా గుర్తింపు సాధించారు. 2004లో కాంగ్రెస్ ప్ర‌భంజంలో తొలిసారి ఓట‌మి చెందిన కోడెల మ‌రోసారి కూడా అంటే 2009లోనూ ప‌రాజ‌యం పాల‌య్యారు. ఈ రెండుసార్లు కోడెల త‌న‌కు చిర‌కాల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు అయిన కాసు వెంక‌ట కృష్ణారెడ్డి చేతిలోనే ఓడిపోయారు.

ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. 2014లో స‌త్తెన‌ప‌ల్లికి మారి అక్క‌డ నుంచి ఆరోసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు.  వైసీపీ అభ్య‌ర్థి అంబ‌టి రాంబాబుపై 713 ఓట్ల‌తో గెలుపు గుర్రం ఎక్కారు. అయితే, ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో అంబ‌టిపై ప‌రాజ‌యం పాల‌య్యారు.  కాగా, ఆయ‌న 1987-88 మధ్యలో హోంమంత్రిగా,  1996-97లో భారీ మధ్యతరహా, నీటిపారుదల మంత్రిగా సేవ‌లందించారు.  2014-19 వరకూ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఆయన నిర్వ‌హించిన బాధ్య‌త న‌వ్యాంధ్ర‌లో రికార్డుగా నిలిచిపోయింది.

న‌ర‌సారావుపేట‌లో ఓట‌మి లేకుండా వ‌రుస‌గా ఐదుసార్లు విజ‌యం సాధించ‌డం వెన‌క ఆయ‌న పేద‌ల దేవుడిగా పేరొంద‌డంతో పాటు వైద్య రంగంలో నిష్ణాతులు కావ‌డం కూడా క‌లిసి వ‌చ్చింది. అందుకే కోడెల‌ను అంద‌రూ పార్టీల‌కు అతీతంగా డాక్ట‌రు గారు అని పిలుస్తుంటారు. కోడెల ఏ ప‌ద‌వి చేప‌ట్టినా.. ప్ర‌జ‌ల కోసం ప్ర‌జ‌ల అభ్యున్న‌తికోసం త‌న‌దైన శైలిలో దూసుకుపోయేవారు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌ర‌స‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గం గురించే ఎక్కువ‌గా క‌ల‌లు క‌నేవారు. ఇక్క‌డి తాగు నీటి స‌మ‌స్య‌ప‌రిష్కారం కోసం అనేక ప్ర‌య‌త్నాలు చేశారు.

ఇక వెన‌క‌ప‌డిన న‌ర‌సారావుపేట నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌న‌దైన శైలిలో అభివృద్ధి చేశారు. ఇక్క‌డ ర‌హ‌దారులు, పాఠ‌శాల‌లు, వైద్యాల‌యాలు క‌ట్టించారు. ప్ర‌జ‌ల‌కు అన్ని వేళ‌లా అండ‌గా ఉన్నారు. రాష్ట్రంలో స్పీక‌ర్‌గా ఉంటూనే మ‌హిళా ప‌క్ష‌పాతిగా మ‌హిళా స‌ద‌స్సును నిర్వ‌హించారు. కోట‌ప్ప‌కొండ‌ను ఓ ప‌ర్యాట‌క ప్రాంతంగా తీర్చిదిద్ద‌డంలో కోడెల కృషిని త‌గ్గించ‌లేం. ఇక చివ‌ర్లో 2014లో గెలిచి స్పీక‌ర్ అయ్యాక స్వ‌చ్ఛ భార‌త్ ద్వారా స‌త్తెన‌ప‌ల్లి పేరును జాతీయ‌స్థాయిలో మార్మోగేలా చేశారు. అంత రారాజులో వెలిగినా చివ‌ర్లో స‌న్‌స్ట్రోక్ ఎఫెక్ట్ వ‌ల్లే ఆయ‌న అన్ని విధాలా దెబ్బ‌తిన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English