భట్టి ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన కేసీఆర్

భట్టి ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం పాలక, విపక్షాల మధ్య వాడివేడి చర్చసాగింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మధ్య ఒకరకంగా మాటల యుద్ధమే సాగిందని చెప్పాలి. బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో బాగంగా భట్టివిక్రమార్క పలు అంశాలను లేవనెత్తారు. ముఖ్యంగా ఆయన రాష్ట్రానికి ఉన్న అప్పులు, కేటాయింపులు తగ్గిపోవడం... జాతీయ స్థాయిలో మాంద్యాన్ని సాకుగా చూపించి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూడడం వంటి అంశాలను లేవనెత్తడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. దీంతో భట్టి లేవనెత్తిన అంశాలకు కౌంటర్ వేయడం కంటే మాటలతో ఆయన గళం నొక్కే ప్రయత్నం జరిగింది. సీఎం కేసీఆర్ కల్పించుకుని భట్టిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆర్థిక మాంద్యం పేరు చెప్పి బడ్జెట్ కేటాయింపులు తగ్గించారని భట్టి విక్రమార్క విమర్శించారు. ఏదో సాకు చూపి పద్దు తగ్గించారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏమయ్యాయని.. ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారని నిలదీశారు. నిరుద్యోగ యువతకు భృతి రూ.3 వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి వంచించారని ఆరోపించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని మభ్యపెట్టారని .. విమర్శించారు. మాంద్యం పేరు చెప్పి ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఉందని .. కానీ మాంద్యం పేరు చెప్పి బడ్జెట్ కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా బడ్జెట్ కేటాయింపులు .. ఖర్చు మన రాష్ట్రంలో తేడా ఉందన్నారు. 34 శాతం డిఫరెన్స్ ఉందని అన్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రం కాస్త ఇప్పుడు దివాలా తీసిందని భట్టి అనడంతో సభలో గందరగోళం మొదలైంది.

దీంతో కేసీఆర్ కల్పించుకొని వాస్తవాలు చెప్పాలని, అదేపనిగా అబద్ధాలు చెప్పరాదని కోరారు.   లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని... బడ్జెట్ ప్రతులను చూసి మాట్టాడితే బాగుంటుందని కేసీఆర్ సూచించారు. కోత పెట్టామని తామే చెబితే ఇంకా దాన్ని ప్రశ్నించడమేంటంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.  పద్దు ఎందుకు తగ్గిందో కూడా వివరించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కేటాయింపుల్లో కోత పెడితే ఏం చేయమంటారు అని నిలదీశారు.

రాష్ట్ర అప్పులపై ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన కొద్దిరోజులకే ధనిక రాజ్యం కాస్త అప్పుల కుప్పగా మారుతోందని భట్టి మండిపడ్డారు. లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నా అందులో 34 శాతం మాత్రమే ఖర్చుచేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పు చేశారని .. అది ఎలా తీరుస్తున్నారని ప్రశ్నించారు.  అప్పు 2 లక్షల 30 వేల కోట్లు, గ్యారంటీ 73 వేల కోట్ల ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో రూ.3 లక్షల కోట్ల అప్పు చేస్తే ముందుముందు ఇంకేం చేస్తారో అన్నారు.

దీంతో కేసీఆర్ బట్టి మాటలను ఖండిస్తూ రాష్ట్రానికి 3 లక్షల కోట్ల అప్పు లేదని.. అంత మొత్తంలో అప్పు ఉందని నిరూపించాలంటూ సవాల్ చేశారు. రాష్ట్రానికి ఉంది 2 లక్షల కోట్ల అప్పులేనని స్పష్టంచేశారు. మిగతా 73 వేల కోట్లు  బ్యాంకు గ్యారంటీ అని చెప్పారు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితి మేరకు అప్పులు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు.

అయితే.. కేసీఆర్ మాటలకు సమాధానపడని భట్టి .... 73 వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ దేనిని చూపించి ఇచ్చారని ప్రశ్నించారు. కార్పొరేషన్ చూపి అప్పు తీసుకున్నారు కదా .. అంటే అప్పు కట్టాల్సింది ప్రభుత్వమే కదా అని నిలదీశారు. మొత్తానికి ఇద్దరు నేతల మద్య వాదోపవాదాలతో సభ దద్దరిల్లింది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English