జగన్ వైఫల్యాలే మెట్లుగా పవన్ విజృంభించబోతున్నాడా?

జగన్ వైఫల్యాలే మెట్లుగా పవన్ విజృంభించబోతున్నాడా?

జనసేన.. నిజంగానే అది జనసేనే. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓట్లు రాకపోయినా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కనిపిస్తే చాలు జనం పుట్టలు పగిలినట్లుగా వచ్చి పడుతున్నారు. ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచినా... అంత ప్రజాదరణ ఉన్న పవన్ రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలైనా కూడా ఇప్పటికీ ఆయన ప్రజల్లోకి వస్తుంటే జనం వచ్చి పడుతున్నారు.

జనసేనకు ఇప్పటికీ అర్థం కాని విషయం.. ఇతర పార్టీలను ఇప్పటికీ భయపెడుతున్న విషయం ఇదే. పవన్ కనిపిస్తే ఊగిపోయే ప్రజలు మరి ఎన్నికల్లో ఎందుకు ఓట్లేయలేదు..? మొన్నటి ఎన్నికల్లో ఓటమి తరువాత జనసేనలో అంతర్గతంగా దీనిపై చర్చ జరిగింది.. అందుకు పరిష్కార మార్గాలూ వెతుక్కున్నారని తాజా పరిస్థితులు చెబుతున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ తాజాగా వేస్తున్న అడుగులు జనసేన, పవన్‌లో వస్తున్న మార్పులకు సంకేతమిస్తున్నాయి.

జనసేన పార్టీ 2014 ఎన్నికల సమయంలోనే ఏర్పడినా 2019 ఎన్నికల్లో పార్టీగా అది పోటీచేసింది. బీఎస్పీ, వామపక్షాలతో కలిసి దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసింది. అయితే, ఫలితాలు మాత్రం ఆ పార్టీని నిరాశపరిచాయి. రాజోలు నుంచి తప్ప ఇంకెక్కడా ఆ పార్టీ గెలవలేదు. దీంతో పవన్ వెంటనే నిరాశలో కూరుకుపోయినట్లగా కనిపించారు. కానీ... అదే పవన్ ఇప్పుడు నిరాశ నుంచి బయటపడి కొత్త ఉత్తేజం కనబరుస్తున్నారు.

జగన్ 100 రోజుల పాలనతో మొదలు..

జనసేన ప్రధాన రాజకీయ కార్యక్షేత్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ పాలన ఇంకా బాలారిష్టాలను దాటలేదు. బాలారిష్టాలను దాటలేదనే కంటే పాలనలో తడబాటుకు, ముద్ర చూపించలేకపోవడానికి వైసీపీ స్వయంకృతాపరాధాలే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ 100 రోజుల పాలన పూర్తవగానే ఆయన వైఫల్యాలపై విపక్షాలు బాణాలు వేయడం ప్రారంభించాయి.

ప్రధాన ప్రతిపక్షం టీడీపీ... ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి బలపడాలని బలంగా కోరుకుంటున్న బీజేపీలు జగన్ 100 రోజుల పాలనపై వెంటనే దాడికి దిగాయి. జనసేన కాస్త ఆలస్యంగా స్పందించినా లోతైన విశ్లేషణలతో బలంగా కొట్టడంతో జగన్ 100 రోజుల పాలనపై జనసనే విమర్శలు, విశ్లేషణలు జనంలోకి వెళ్లాయి.

దీంతో ఏపీలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాపోరాటాలు చేస్తూ ప్రజాదరణ పెంచుకుంటూ వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన శక్తిగా అవతరించేలా పవన్ రాజకీయవ్యూహాలు మొదలుపెట్టారని వినిపిస్తోంది. నిజానికి జగన్‌ 100 రోజుల పాలనకు ముందే ఇసుక కొరతపై పవన్ ఓసారి తీవ్ర విమర్శలే చేశారు. ఆ తరువాత గ్యాప్ ఇచ్చారు. కానీ, ఇప్పుడు పవన్ కాస్త దూకుడుగా, ఆలోచనాత్మకంగా కనిపిస్తున్నారు.

నల్లమల యురేనియం పవన్‌ను పొలిటికల్ స్టార్ చేస్తుందా?
పవన్ దేన్నైనా ఎత్తుకుంటే అది పెద్ద ఇష్యూగా మారుతుందన్న సంగతి గతంలోనూ నిరూపణైంది. తాజాగా పవన్ ఏపీలో పాలనా వైఫల్యాలు, వైసీపీ చేస్తున్న తప్పులు, రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింటుండడంపై విమర్శలు చేస్తున్నారు. అదేసమయంలో ఆయన పొరుగు రాష్ట్రం తెలంగాణలో సమస్యగా మారిన నల్లమల యురేనియం తవ్వకాలపైనా పోరాటం మొదలుపెట్టారు. ఈ పోరాటానికి ఎవరూ ఊహించని రీతిలో టీకాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సహకారం కూడా తీసుకుంటున్నారు.  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా చేశారు.

తెలంగాణలో నల్లమల అడవిని తవ్వి యురేనియం తవ్వకాల చేపట్టాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై విపక్షాలు, ప్రజాసంఘాలు, సాధారణ పౌరులు పెద్ద ఎత్తున గళమెత్తడం... సెప్టెంబరు 16న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో.. ఆ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. రేవంత్ రెడ్డిని కూడా ఆ సమావేశానికి రావాల్సిందిగా పవన్ కల్యాణ్ ఫోన్ చేసి కోరారు. దీంతో రేవంత్ రెడ్డి కూడా అందుకు అంగీకరించినట్టు చెబుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు పవన్ కళ్యాణ్‌ను కలసి యురేనియం వ్యతిరేక పోరాటానికి మద్దతివ్వాలని కోరారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ చాలా మందిని కదిలించింది. చాలా మంది సినీ తారలు కూడా సేవ్ నల్లమల పోరాటానికి మద్దతు పలికారు. సెలబ్రిటీలు పెద్ద ఎత్తున గళం విప్పడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను వ్యక్తిగతంగా కేసీఆర్‌కు ఈ విషయాన్ని చేరవేస్తానన్నారు. అయితే, కేటీఆర్ సురభి నాటకాలు ఆపాలంటూ ట్విట్టర్‌లో రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.  ఇలా యురేనియం ఇష్యూలో పవన్ ఎంటరైన తరువాత అది పెద్దదైంది. దీంతో.. ఈ పోరాటంలోనూ జనసేన కీలకం కావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఆ రెండూ స్పష్టమైపోయాయి..

ఈ నేపథ్యంలో ఇక్కడ పవన్ స్టాండులో రెండు అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.
1) జనం సమస్యల్లో ఉన్నప్పుడు కార్యక్షేత్రం దాటి వెళ్లి పోరాటం చేయడం
2) బీజేపీతో పొత్తుపై అనుమానాలకు తెరదించడం

తన ప్రధాన రాజకీయ కార్యక్షేత్రం ఏపీ అయినప్పటికీ పొరుగునే ఉన్న తెలంగాణలోని సమస్యను ఆయన తలకెత్తుకోవడం అనేది పోరాటాలతో ప్రజల్లోకి వెళ్లాలన్న కసి పవన్‌లో పెరిగిందనడానికి సంకేతంగా కనిపిస్తోంది. గతంలో ఆయన పలు పోరాటాలు ప్రారంభించినా మాటల హడావుడికే పరిమితమయ్యారు. దీన్ని అలా కాకుండా వదలకుండా పోరాడితే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి అవకాశముంటుంది.

ఇక రెండోది... ఇంతవరకు పవన్ టీడీపీకి అనుకూలుడని.. బీజేపీతోనూ రహస్య సంబంధాలు మెంటైన్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. కానీ, నల్లమల యురేనియం పోరాటం బీజేపీపై ఎదురుదాడే. పైగా దానికి కాంగ్రెస్ ఎంపీ మద్దతూ ఆయన కోరారు. దీంతో పవన్ బీజేపీ చేతిలో బొమ్మగా మారాలనుకోవడం లేదన్న విషయం దాదాపుగా స్పష్టమైంది.

పవన్ గుర్తించాల్సిన విషయాలు..
* జనసేన ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత పవన్ ఓ మాట చెప్పారు. నాయకత్వ లేమి జనసేన ఓటమికి కారణమైందన్నారు. నిష్టూరంగా అనిపించినా అది నిజం. పవన్ వెనుక ప్రజలు కనిపించినా సరైన నాయకులు ఒకరిద్దరు మినహా లేరు. అంతా అవుట్ డేటెడ్.. చోటా మోటా లీడర్లే. వారిని నమ్ముకుని పవన్ 2019 ఎన్నికల క్షేత్రంలో దిగి దెబ్బతిన్నారు.

ఒక రకంగా ఇది పవన్ వైఫల్యం కూడా. ప్రజలను ఆకట్టుకోవడంలో సఫలమైన పవన్ ఏపీలోని  నాయకులను ఆకట్టుకోవడంలో సఫలం కాలేకపోయారు. అందుకే.. పవన్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి కీలక నాయకులు చేరలేదు. అదే ఎన్నికల్లో దెబ్బతీసింది. సరైన అభ్యర్థులు లేకుండా చేసింది.

ఇప్పటికీ ఏపీలో నాయకులు పార్టీలు మారుతున్నారు. కానీ, ఎవరూ జనసేనలోకి రావడం లేదు. టీడీపీ, వైసీపీ, బీజేపీల మధ్యే తిరుగుతున్నారు కానీ ఎవరూ జనసేన వైపు చూడడం లేదు. ఈ విషయాన్ని పవన్ గుర్తించి ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను గుర్తించి తీసుకుంటే వచ్చే ఎన్నికల నాటికైనా బలపడే అవకాశముంటుంది.

నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోవడమా.. రెడీమేడ్ నాయకత్వాన్ని తెచ్చుకోవడమా?
పవన్ పార్టీకి ఇప్పుడు నాయకుల అవసరం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే దానిపై ఫోకస్ చేయాలి.
దీనికి రెండు మార్గాలుంటాయి..
1) నాయకత్వాన్ని అభివృద్ది చేసుకోవడం
2) రెడీమేడ్ నాయకత్వాన్నితెచ్చుకోవడం

నాయకత్వం అభివృద్ధి చేసుకోవడమంటే ఎన్టీఆర్, అరవింద్ కేజ్రీవాల్ వంటివారు పార్టీలు పెట్టినప్పుడు పూర్తిగా కొత్తవారితోనే ముందుకెళ్లి వారిని గెలిపించుకుని నాయకులుగా ఎదిగేలా చేసినట్లు. పవన్ అలా చేయలేకపోయారు. అది మొన్నటి ఎన్నికల్లో రుజువైపోయింది. పవన్ పార్టీలో మేధావులు, విద్యావంతులు, సామాజికస్పృహ ఉన్నవారు చేరినా వారెవరూ ప్రభావం చూపలేకపోయారు.  

కాబట్టి పవన్ రెండో ఆప్షన్ అయిన రెడీమేడ్ నాయకత్వాన్ని తెచ్చుకోవడం వైపే మొగ్గు చూపాలి. ఏపీలో నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారు కానీ తనవైపు ఎందుకు ఆకర్షితులు కావడం లేదన్నది ఆలోచించాలి. ఇతర పార్టీల నేతలను ఆకర్షించేలా పోరాటాలు, విధానాలతో ముందుకెళ్లాలి. పవన్‌తో కలిసి సాగితే వచ్చే ఎన్నికల్లో లాభపడతాం అన్న భరోసా కల్పించాలి. అప్పుడు పడుతూలేస్తూ సాగుతున్న పాలక పార్టీ నుంచి కూడా నేతలను ఆకర్షించొచ్చు.

* పవన్ ఇక్కడ మరో విషయం గుర్తించాల్సి ఉంది. వ్యక్తిగతంగా పవన్‌కు క్రేజ్, పవన్‌పై అంచనాలు జనంలో ఇంకా ఉన్నాయి. అలాంటప్పుడు పొత్తులు, ఇతరులతో రహస్య అవగాహనలు ఆయనకు అనవసరం. సరైన రాజకీయ మార్గనిర్దేశనం చేసే బృందాన్ని ఏర్పాటు చేసుకుని నిత్యం ప్రజల్లో ఉండేలా సాగితే బెటర్.

విజువల్ ఆదరణను వాస్తవ ఆదరణగా మార్చాలి
ఎన్నికల ముందు కానీ.. ఎన్నికల్లో దారుణ పరాజయం పొందిన మూడు నెలల తరువాత కానీ.. ఎప్పుడైనా పవన ప్రజల్లోకి వెళ్తే జనం వరదలా పొంగుతున్నారు. ఆయన ఇటీవల జిల్లాల్లో పర్యటించినప్పుడు కూడా అది రుజువైంది. మరి.. ఆ జనం ఎందుకు ఓటేయడం లేదు. పవన్ ఇదే విశ్లేషించుకోవాలి.

ఇక్కడ ఓ ఉదాహరణ చెప్పుకోవాలి. సింగరేణిలో ఇప్పుడు టీఆరెస్ అనుబంధ టీజీబీకేఎస్ ఆధిపత్యం నడుస్తోంది కానీ, పదేళ్ల కిందట వరకు సింగరేణిలో వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలే గెలుస్తూ ఉండేవి. ఆ సంఘాల నాయకులు పోటీచేస్తే ఓట్ల వర్షం కురిసేది. టీడీపీ, టీఆరెస్ అనుబంధ సంఘాల నాయకులకు ఓట్లు పడేవి కావు. కానీ... అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అదే వామపక్ష అనుబంధ సంఘాల నాయకులు పోటీచేస్తే 2 వేల ఓట్లు కూడా వచ్చేవి కావు. అంతకుముందే వారికి ఓట్లేసిన వేలాది మంది కార్మికులు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, టీఆరెస్, కాంగ్రెస్ వంటి పార్టీలకు ఓట్లేసేవారు.

పవన్ విషయంలోనూ అలాంటి పరిస్తితే కనిపిస్తోంది. పవన్ వెంట జనం వస్తున్నా వారంతా ఓట్లేయడం లేదు. తన వెంట వచ్చేవారు పోలింగ్ బూత్ వరకు తన వెంటే ఉండేలా పవన్ చేసుకోగలగాలి.

పవన్‌కు అనుకూలాంశాలివే..

ఏపీలో జనసేన భవిష్యత్తుకు సంబంధించి ప్రధానంగా 4 అంశాలు ఆశావహంగా కనిపిస్తున్నాయి. అందులో ప్రజల వైపు నుంచి ఉన్నవి, పవన్ వైపు నుంచి ఉన్నవి రెండూ ఉన్నాయి.
1) ఎన్నికల్లో స్వయంగా పవన్ కూడా ఓటమి పాలైన తరువాత జనసేన పనైపోయిందని అంతా అనుకున్నారు. పవన్ కూడా నిరాశపడ్డాడు. వేదాంతం మాట్లాడాడు. కానీ, బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మళ్లీ యాక్టివ్ అవుతున్నాడు. పార్టీని నడపడం అంత సులభమేమీ కాదు. ఆర్థికంగానూ కష్టమే. కానీ, పవన్ మాత్రం అన్నిటినీ తట్టుకుని ముందుకుసాగడానికే నిర్ణయించుకున్నారు. ఇది ఆశావహపరిణామం. వచ్చే ఎన్నికల వరకు పవన్ దీన్ని కొనసాగించేలానే కనిపిస్తున్నారు.

2) పవన్ పార్టీలోకి నాయకులెవరూ చేరకపోయినా పార్టీలో ఉన్న నాయకులెవరూ పార్టీని వీడలేదు. ఒకరిద్దరు నాయకులు కాస్త దూరంగా ఉన్న మిగతావారంతా ఇప్పటికీ పవన్ వెంటే ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు రాజీనామాలు చేశారు. కానీ, పవన్‌కు అలాంటి పరిస్థితి రాలేదు. ఇది గొప్ప విజయమనే చెప్పాలి. పార్టీ నేతలకు పవన్‌పై నమ్మకం లేకపోతే ఈసరికే పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయేది కానీ, అలా జరగలేదు.

3) ఇక మూడో విషయం.. ఇప్పటికీ పవన్ అంటే పాలక వైసీపీ, ఇతర ప్రధాన పార్టీలు టీడీపీ, బీజేపీ భయపడుతుండడం. సోషల్ మీడియాలో వైసీపీ బలగాలు చంద్రబాబు కంటే కూడా పవన్‌ను ఎక్కువగా టార్గెట్ చేయడమే దీనికి నిదర్శనం.

4) నాలుగోది... పవన్ తమతో బహిరంగంగా కలిసి పనిచేస్తే బాగుండునని టీడీపీ, బీజేపీలు ఇంకా కోరుకుంటుండడం. ఆ క్రమంలోనే పవన్‌ పట్ల సానుకూలంగా ఉండడం. పవన్ కలిసొస్తే ఏపీలో ప్రభుత్వం  ఏర్పాటు చేయగలం అన్న మాట ఇప్పటికీ బీజేపీ అంతర్గత చర్చల్లో వినిపిస్తుండడం. పవన్ మళ్లీ తమతో కలిసి నడిస్తే జగన్ ను దించేయగలమని టీడీపీ అనుకుంటుండడం.
.... తన అనుకూలాంశాలను బలాలుగా మార్చుకుని.. ఇప్పటివరకు ఎక్కడెక్కడ నష్టపోయానో ఆ ఏరియాల్లో కొత్త వ్యూహాలతో ముందుకెళ్లి మళ్లీ ఎన్నికల వరకు సొంతంగా నిలబడితే ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English