ప్రత్యేక ఫ్లైట్ లో హైదరాబాద్ కు.. సత్య నాదెళ్ల

ప్రత్యేక ఫ్లైట్ లో హైదరాబాద్ కు.. సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి.. విశ్రాంత ఐఏఎస్ అధికారి.. ఉమ్మడి రాష్ట్రంలో పలు కీలక పదవుల్ని చేపట్టిన.. వెలుగు (సెర్ప్) ప్రాజెక్టుకు రూపశిల్పి.. వివాదారహితుడు బీఎన్ యుగంధర్ (82) శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని తనింట్లో కన్నుమూశారు. గడిచిన కొద్దికాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయన మరణంతో సత్యనాదెళ్ల కుటుంబంలో విషాదం నెలకొంది.

ఆయన్ను ప్రస్తుతం గచ్చిబౌలిలోని సిటిజన్ ఆసుపత్రిలో ఉంచారు. మరోవైపు అమెరికాలో ఉన్న సత్య నాదెళ్ల.. తండ్రి మరణవార్త విన్నంతనే ప్రత్యేక విమానంలో బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఆయన శనివారానికి హైదరాబాద్ చేరుకుంటారని చెబుతున్నారు. ఆయన వచ్చిన తర్వాత అంత్యక్రియలు ఎప్పుడు? ఎక్కడ? అన్న అంశాల మీద నిర్ణయం తీసుకోనున్నారు.

సత్య నాదెళ్ల మామ (భార్య తండ్రి) కేఆర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. తన చిరకాల స్నేహితుడు.. వియ్యంకుడైన యుగంధర్ మరణంపై సంతాపాన్ని తెలియజేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ కుమార్తెను సత్య నాదెళ్ల ప్రేమ వివాహం చేసుకున్నారు.  1962 సివిల్ సర్వీస్ బ్యాచ్ కు చెందిన యుగంధర్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వద్ద.. తెలుగు ప్రధానమంత్రి పీవీ వద్ద పని చేశారు. రెవెన్యూశాఖలో పలు కీలక పదవుల్ని చేపట్టి.. సమర్థవంతంగా నిర్వహించారు.

ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన రెండురూపాయిలకు కిలో బియ్యం పథకాన్ని తీర్చిదిద్దటంలో ఆయన కీలకభూమిక పోషించారని చెప్పాలి. అంతేకాదు.. స్వర్గీయ పీవీ నరసింహరావు ప్రధానిగా పని చేసిన సమయంలో ఆయన కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా.. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ డైరెక్టర్ గా సేవలు అందించారు.

ఏపీలోని అనంతపురం జిల్లా బుక్కాపురంలో జన్మించిన యుగంధర్ తన పేరును బుక్కపురం యుగంధర్ గా రాసుకున్నారు. ఊరి పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఆయన సతీమణి గతంలోనే మరణించారు. వారికున్న ఏకైక సంతానం సత్య నాదెళ్ల. మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్న ఆయన.. ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితుడన్న విషయం తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English