డియర్ సెలబ్రెటీస్.. నోటికి ప్లాస్టర్లు తీయండి

డియర్ సెలబ్రెటీస్.. నోటికి ప్లాస్టర్లు తీయండి

పోయినేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘనవిజయం సాధించింది. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక చూస్కోండి మన సెలబ్రెటీల ఉత్సాహం. కేసీఆర్‌కు, కేటీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి ఎగబడిపోయారు. కొందరు వ్యక్తిగతంగా కలిసి కూడా విషెస్ చెప్పారు. ఇక కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా ఇంప్రెస్ చేయడానికి సెలబ్రెటీలు ఎంతగా ట్రై చేస్తుంటారో చూస్తూనే ఉంటాం. ఆయనేదైనా మంచి పని చేస్తే పోటీ పడి ప్రశంసలు కురిపిస్తుంటారు. పెద్ద పెద్ద వాళ్లు సైతం కేటీఆర్‌తో అసోసియేట్ కావడానికి, పొగడ్డానికి తహతహలాడిపోతుంటారు. కానీ ఏదైనా ఇష్యూ మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినపుడు.. సమస్యల మీద మాట్లాడాల్సినపుడు మాత్రం మన సెలబ్రెటీల నోరు పెగలదు.

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలతో ఎంత ముప్పు వాటిల్లబోతోందో పర్యావరణ వేత్తలు, నిపుణులు కొన్ని రోజులుగా వివరించి చెబుతున్నారు. దీని వల్ల భూగర్భ జనాలు తీవ్రంగా కలుషితం కాబోతున్నాయి. విషతుల్యం కానున్నాయి.  అక్కడి జీవరాశి మనుగడ ప్రమాదంలో పడనుంది. చుట్టుపక్కల గ్రామాలపై అనేక ప్రతికూల ప్రభావాలు చూడబోతున్నాం.

క్యాన్సర్ సహా అనేక వ్యాధుల బారిన జనాలు పడి.. పర్యావరణ సమతుల్యం దెబ్బ తిని.. అనేక దుష్పరిణామాల చోటు చేసుకుంటాయని అంటున్నారు. కానీ ఈ సమస్య మీద మాట్లాడేవాళ్లు.. ప్రభుత్వాన్ని నిలదీసేవాళ్లు పెద్దగా కనిపించడం లేదు.

విద్యుతుత్పత్తి కోసమే యురేనియం తవ్వకాలని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. దీని వెనుక అసలు ఉద్దేశం అణ్వాయుధాల తయారీ అని నిపుణులు అంటున్నారు. ఈ ప్రాజెక్టును చేపడుతున్నది కేంద్ర ప్రభుత్వమే అయినా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సహకారం అందిస్తోంది. కానీ రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్,  ఫిలిం సెలబ్రెటీస్‌లో విజయ్ దేవరకొండ, శేఖర్ కమ్ముల లాంటి ఒకరిద్దరు మినహాయిస్తే ఈ సమస్య మీద మన ప్రముఖులు నోరు మెదపట్లేదు.

పరాయి రాష్ట్రాలు, దేశాల సమస్యల మీద గళం విప్పడంలో మాత్రం మన సెలబ్రెటీలు ఎప్పుడూ ముందుంటారు. మన మహేష్ బాబు సంగతే తీసుకుందాం. ఆయన్ని పెద్ద స్టార్‌ను చేసింది తెలుగు రాష్ట్రాల ప్రజలు. కానీ వాళ్ల పెద్ద సమస్యల మీద పోరాడుతున్నపుడు మహేష్ మౌనంగా ఉంటాడు. కానీ పరాయి వాళ్ల కష్టాలు చూస్తే ఆయన గుండె చెరువైపోతుంది.

కొన్నేళ్ల కిందట తమిళనాట జల్లికట్టు మీద పోరాటం జరుగుతుంటే.. మహేష్ ధైర్యం తెచ్చుకుని వారికి మద్దతుగా ట్వీట్ వేశాడు. జల్లికట్టు రద్దును తీవ్రంగా వ్యతిరేకించేశాడు. దీని మీద మహేష్ స్పందించినా, స్పందించకపోయినా పెద్ద తేడా ఏమీ ఉండేది కాదు. కానీ ‘స్పైడర్’ సినిమాను తమిళంలో విడుదల చేయబోతున్న నేపథ్యంలో తమిళ జనాల మనసులు గెలిచేందుకే మహేష్ ఇలా చేశాడన్న విమర్శలొచ్చాయి. జల్లికట్టు మీద స్పందించిన మహేష్.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా మీద అంత పోరాటం జరుగుతుంటే.. మద్దతుగా ఒక ట్వీట్ వేయలేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

ఈ మధ్యే మహేష్.. అమేజాన్ అడవులు కాలిపోతుండటం మీద ఆవేదన స్వరం వినిపించాడు. ప్రపంచానికి ఊపిరి తిత్తుల్లాంటి ఈ అడవులు తగలబడిపోతుండటం దురదృష్టకరమని.. వాటిని కాపాడాలని మహేష్ కొన్ని రోజుల కిందటే ట్వీట్ వేశాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఊపిరి తిత్తులు అనదగ్గ నల్లమల అడవుల్ని నాశనం చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ సమయంలో సెలబ్రెటీలు కూడా కలిసి రావాల్సి ఉంది.

కానీ ఎక్కడో ఉన్న అమేజాన్ అడవుల గురించి ఆవేదన చెందిన మహేష్.. తెలుగు రాష్ట్రాల్లోని నల్లమల అడవులకు తలెత్తుతున్న ప్రమాదం గురించి స్పందించడా.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడా అని సోషల్ మీడియాలో అతడిని ఏకేస్తున్నారు. ఇక్కడ మహేష్ కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మిగతా సెలబ్రెటీలకూ ఇది వర్తిస్తుంది. తమను ఇంత వాళ్లను చేసి... కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చిన జనాలు సమస్యల్లో ఉన్నపుడు వారిని ఆదుకునే దిశగా స్వరం వినిపిస్తే వీళ్లకు పోయేదేముంది? ఇప్పటికైనా మన సెలబ్రెటీ జనాలు నోటికి వేసుకున్న ప్లాస్టర్లను తీసి పవన్, కమ్ముల లాంటి వాళ్ల జాబితాలో చేరాల్సిన అవసరముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English