పవన్ పోరాటం మంచిదే.. కానీ!

పవన్ పోరాటం మంచిదే.. కానీ!

తెలంగాణలో కేసీఆర్ సర్కారు మీద పోరాడటానికి.. వాళ్ల నిర్ణయాల్ని తప్పుబట్టడానికి రాజకీయ నాయకులే వెనుకంజ వేస్తుంటారు. ఎవరైనా మాట్లాడినా తమ రాజకీయ ప్రయోజనాల్ని దృష్టిపెట్టుకునే తప్ప.. ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని మాత్రం కాదు. ఇక తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేని వారు, సినిమా వాళ్లు తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడటం అన్నది కలలోనూ జరగని పనే.

 కేసీఆర్, కేటీఆర్‌లను పొగడటానికి ఎగబడే ఈ జనాలు.. ప్రభుత్వాన్ని నిలదీయాల్సినపుడు మాత్రం నోరు మెదపరు. ఐతే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమయ్యాడు. జనసేన పార్టీకి తెలంగాణలో రాజకీయంగా ఏ ప్రయోజనాలూ లేకపోయినా.. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పవన్ నిరసన స్వరం వినిపిస్తున్నాడు.

ఇక్కడి ప్రతిపక్ష పార్టీలే నల్లమల ఇష్యూను అనుకున్న స్థాయిలో టేకప్ చేయట్లేదు. ప్రజా సంఘాల వాళ్లు, స్థానికులు, పర్యావరణ పరిరక్షకులు, శేఖర్ కమ్ముల లాంటి కొందరు సెలబ్రెటీలు మాత్రమే నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల్ని వ్యతిరేకిస్తూ గళం విప్పుతున్నారు. రాజకీయ నేతల్లో కాస్త గట్టిగా స్వరం వినిపిస్తున్న వాళ్లలో పవన్ ఒకడు. నిజంగా జనాల భవిష్యత్ పట్ల ఆందోళనతోనే పవన్ ఈ పోరాటానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది.

ఇందులో ఆయన వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలేమీ ఉన్నట్లు కనిపించడం లేదు. కచ్చితంగా పవన్ చేస్తున్నది మంచి పనే.  నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపనుండటంతో అక్కడి జీవరాశి మనుగడ ప్రమాదంలో పడనుంది. భూగర్భ జలాలు కలుషితం కాబోతున్నాయి. చుట్టుపక్కల గ్రామాాలపై అనేక ప్రతికూల ప్రభావాలు చూడబోతున్నాం. దీని గురించి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీన్ని అర్థం చేసుకునే పవన్ పోరాటానికి సిద్ధమైనట్లుంది. కానీ పవన్‌లో ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే.. ఏదైనా ఇష్యూను టేకప్ చేస్తే దాని మీద చివరి దాకా పోరాడడు. మధ్యలో వదిలేస్తాడు. కొన్ని విషయాలపై గట్టిగా మాట్లాడి.. తర్వాత మౌనం వహించిన సందర్భాలు బోలెడు. అందుకే పవన్‌కు నిలకడ లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తుంటాయి. రాజకీయాల్లో ఒక సమస్య మీద దీర్ఘ కాలం, పరిష్కారం వచ్చే వరకు పోరాడితేనే.. జనాల్లో నాయకుడిపై నమ్మకం కుదురుతుంది. ఈ నేపథ్యంలో తన విశ్వసనీయతను, సిన్సియారిటీని చాటుకోవడానికి పవన్‌కిది మంచి అవకాశం. మరి ఆయన ఈ పోరాటంలో ఎంత వరకు నిలబడతాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English