జగన్ తొలి వెనకడుగు... బాబు నిర్ణయాలే ఫైనల్

జగన్ తొలి వెనకడుగు... బాబు నిర్ణయాలే ఫైనల్

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... ఏపీ సీఎం హోదాలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ మార్చేస్తానంటూ నవ్యాంధ్రకు కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. జగన్ కు ఎదురు దెబ్బ తగిలిందనే కంటే కూడా... బాబు తీసుకున్న నిర్ణయాలను మార్చే విషయంలో ఆయన తొలిసారిగా వెనకడుగు వేశారని చెప్పక తప్పదు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)ల పున:సమీక్ష తప్పదంటూ తనదైన శైలిలో ముందుకు సాగిన జగన్... ఆ విషయంలో ముందడుగు సాధ్యం కాక వెనకడుగు వేయక తప్పలేదు. ఈ మేరకు జగన్ పలాయనం చిత్తగించిన మాదిరిగా... పీపీఏల పున:సమీక్ష చేయబోనని కేంద్రానికి లేఖ రాశారు.

గడచిన ఎన్నికల్లో ఏపీకి సీఎంగా పదవీ ప్రమాణం చేసిన సమయంలోనే చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ పున:పరిశీలిస్తామని, అక్రమమని తేలితే చర్యలు కూడా తీసుకుంటామని జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన మాట ప్రకారమే పీపీఏల పున:సమీక్ష అంటూ హడావిడి చేసిన జగన్ కు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు గట్టి ఝలక్ ఇచ్చింది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కావని, ఆ ప్రభావం దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాల పీపీఏలపైనా పడుతుందని, దీనిపై మరోమారు ఆలోచించాలంటూ కేంద్రం జగన్ కు చాలా సూటిగానే చెప్పింది. అంతేకాకుండా పలు లేఖలు కూడా రాసింది.

పీపీఏలపై పున:సమీక్ష వద్దంటూ కేంద్రం ఎంత మొత్తుకున్నా విననట్టుగానే వ్యవహరించిన జగన్... పీపీఏల పున:సమీక్షపై వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పారు. అయితే వాస్తవంలోకి వచ్చి చూసే సరికి జగన్ అసలు విషయం బోధపడినట్టుగా తెలుస్తోంది. కేంద్రం లేఖలు, అసలు పీపీఏల్లో ఎలాంటి అవినీతి లేదని టీడీపీ నేతలు వరుసగా వినిపించిన వాదనలతో జగన్ దిగిరాక తప్పలేదు. పీపీఏలపై పున:సమీక్ష కు సంబందించి బుధవారం కేంద్రానికి లేఖ రాసిన జగన్... ఇప్పటికే కుదిరిన పీపీఏలపై పున:సమీక్ష జరపబోనని, కొత్తగా కుదిరే పీపీఏలపై మాత్రమే దృష్టి సారిస్తానని ఆ లేఖలో చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయంతో జగన్ తన నిర్ణయాలపై తొలిసారి వెనకడుగు వేసినట్లుగా చెప్పుకోవాలి. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి తప్పూ లేదని జగన్ ఒప్పుకున్నట్టుగా కూడా అయ్యిందన్న వాదన వినిపిస్తోంది. అసలు ఇదివరకే కుదిరిన పీపీఏల జోలికే వెళ్లబోనని జగన్ చెప్పడం చూస్తుంటే...ఈ విషయంలో ఆయన ెఎంత గుడ్డిగా ముందుకెళ్లారన్న విషయం కూడా ఇట్టే తెలిసిపోతోందన్న వాదన వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English