నిర్మలమ్మ బుక్కైపోయింది... ట్రోలింగే ట్రోలింగ్

నిర్మలమ్మ బుక్కైపోయింది... ట్రోలింగే ట్రోలింగ్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుపోయారనే చెప్పాలి. దేశ ఆర్థిక పురోగతి అయినా, ఆర్థిక మందగమనమైనా... రీజన్స్ చెప్పడంతో పాటు పరిస్థితిని చక్కదిద్దాల్సిన గురుతర బాధ్యతలు కలిగిన నిర్మల... అలా తన నోటికి వచ్చిన ఓ పస లేని కారణం చెప్పేసి... ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా నిర్మలపై జరుగుతున్న ట్రోలింగ్ ఓ రేంజిలో దూసుకుపోతోంది. దేశంలో ఆర్థిక మందగమనం ఎంత స్పీడుగా విస్తరిస్తుందో... అంతకంటే డబుల్, త్రిబుల్ స్పీడుతో వచ్చి పడుతున్న కామెంట్లతో నిర్మల చాలా ఇబ్బందికరమైన పరిస్థితినే ఎదుర్కొంటున్నారని చెప్పక తప్పదు.

అయినా నిర్మలకు వచ్చిన కష్టమేంటీ? దాని వల్ల ఆమె ఎంతమేర ఇబ్బందిపడుతున్నారన్న విషయానికి వస్తే... దేశంలో ఆర్థిక పరిస్థితి మందగమనం బాట పట్టిందని, ఈ కారణంగా వాహనాల విక్రయాలు భారీగా పడిపోయాయని, పెద్ద సంఖ్యలో వాహన తయారీ సంస్థలు లేఆఫ్ లు ప్రకటించేదాకా పరిస్థితి వెళ్లిపోయిందన్న వార్తలు పెను కలకలం రేపుతున్నాయి. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసే మాంద్యం భారత్ ను కూడా ముంచేస్తోందన్న భయాందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పరిస్థితి అంతా చక్కగానే ఉందని, మాంద్యం ప్రభావం భారత్ పై ఉండదని నిర్మల కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో వాహనాల విక్రయాలు తగ్గడానికి గల కారణాలను వివరిస్తూ... యువత ఉబెర్, ఓలాలను ఆశ్రయిస్తున్న కారణంగానే వాహనాల విక్రయాలు తగ్గిపోయాయంటూ చెప్పారు. ఈ సింగిల్ వ్యాఖ్యనే ఆమెను నెటిజన్లకు శత్రువులా మార్చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ 100 రోజుల పాలన ముగింపు సందర్భంగా మాట్లాడిన ఆమె... ఈ శతాబ్దపు యువత మనస్తత్వం మారిందని తనదైన శైలి వ్యాఖ్య చేశారు. యువత మెట్రో రైళ్లను, క్యాబ్ లను ఆశ్రయిస్తోందని తెలిపారు. నెలనెలా ఈఎంఐలు కట్టాల్సి వస్తుందని భయపడుతున్న యూత్, కార్లను కొనడం లేదని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను యువతను బాగానే హర్ట్ చేసింది. అంతే... నిర్మలను టార్గెట్ చేస్తూ నెటిజన్లు తమదైన శైలిలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు.‘సే ఇట్ సీతారామన్ తాయి లైక్’, ‘బాయ్ కాట్ మిలీనియల్స్’ వంటి హ్యాష్ ట్యాగ్ లను క్రియేట్ చేసి వాటిని వైరల్ చేస్తూ, నిర్మలను ట్రోల్ చేస్తున్నారు. నిర్మల వ్యాఖ్యలనే ప్రస్తావిస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు చేస్తున్న కామెంట్లలో ఈ కింది కామెంట్లు... ఈ ట్రోలింగ్ ఎలా ఉందో చెప్పకనే చెబుతున్నాయి.

* యూత్ కు పానీపూరీ ఇష్టం. అందుకే బీహెచ్ఈఎల్ పడిపోయింది.
* నిజమే, సొంత వాహనం ఉంటే డబ్బు దండగే కదా? డబ్బు మిగుల్చుకోవాలి మరి.
* కొత్త వాహన చట్టమా? మజాకా?
* ఓలా, ఉబెర్ అయితే, లైసెన్స్ అవసరం లేదు, పార్కింగ్ కట్టక్కర్లేదు.
* యువత ఉద్యోగం చేయడాన్ని ఇష్టపడక పోవడం వల్లే నిరుద్యోగం పెరిగిందంటారేమో.
* ప్రతిదానికీ యువతను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English