జగన్ కొంప ముంచుతున్న ముగ్గురు మంత్రులు

జగన్ కొంప ముంచుతున్న ముగ్గురు మంత్రులు

ఏపీలో పడుతూలేస్తూ సాగుతున్న జగన్ పాలనపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. రివెంజ్ పాలిటిక్సే తప్ప రియల్ పాలిటిక్స్ లేవని... పాలన పడకేసిందే కానీ పరుగులు తీయడం లేదని అంతటా వినిపిస్తోంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న జగన్ పాలనలో అనుభవ లేమి, అయోమయం స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు.

జగన్ సరైన మంత్రులను ఎంపిక చేసుకోకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముగ్గురు మంత్రుల కారణంగా జగన్ పాలనపై విమర్శలు పెరుగుతున్నాయని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇద్దరు సీనియర్ మంత్రులు కాగా.. మరొకరు తొలిసారి మంత్రి పదవి చేపట్టిన నేతని చెబుతున్నారు. సీనియర్ మంత్రుల్లో ఒకరు జగన్ రాష్ట్రంలోని లేని సమయంలో రాజధానిపై అయోమయం సృష్టించి ప్రతిపక్షానికి, ప్రజలకు భారీ అస్త్రం చేతికి అందించారని.. ఆయన వల్ల చాలా డ్యామేజ్ జరిగిందని చెబుతున్నారు. తనకు సరైన ప్రాధాన్యం దక్కడంలేదన్న అసంతృప్తితో ఉన్న ఆయన తెలివిగా గందరగోళం సృష్టించే వ్యూహంతో ముందుకెళ్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరో నేత బయటకు కనిపించేలా ఎలాంటి నష్టం కలిగించకపోతే జగన్ వద్ద తనకున్న పరపతిని వినియోగించుకుంటూ ఆయనకు వాస్తవాలు తెలియకుండా చేస్తున్నారని.. కోటరీని పెంచి పోషిస్తున్నారని తెలుస్తోంది. మెల్లగా తన గ్రిప్ పెంచుకుంటూ పోతున్న ఆయన జగన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడు.. అయితే, ఆ నమ్మకంతోనే జగన్‌కు వాస్తవ పరిస్థితులు తెలియకుండా చేస్తున్నారని.. పార్టికి సంబంధించి, పాలనకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి చాలా పరిస్థితులు జగన్ వరకు వెళ్లకుండా ఆయన  వద్దే ఆగిపోతున్నాయని వినిపిస్తోంది. అదే జరిగితే జగన్ కూడా మరో చంద్రబాబులా వాస్తవాలు తెలుసుకోకుండా నష్టపోవడం ఖాయమంటున్నారు ఆ పార్టీ నేతలే.

ఇక మూడో మంత్రి పాలనకు పూర్తిగా కొత్త. ఆవేశమే తప్ప ఆచరణా సామర్థ్యం లేదని ఇప్పటికే నిరూపించుకున్నారాయన. ప్రతిపక్షాన్ని విమర్శించాలి.. వారి నోరు మూయించాలన్న ఆవేశమే తప్ప తన శాఖకు సంబంధించిన పనులను ఎలా చేస్తున్నామన్నది మాత్రం ఆయన చూసుకోవడం లేదంటున్నారు. ముఖ్యంగా ప్రజలపై హఠాత్ప్రభావం చూపించే విపత్తులను సరిగా డీల్ చేయలేకపోవడంతో దాదాపు నెల రోజుల పాటు నాలుగు జిల్లాల్లో ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని తిట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ మంత్రి అసమర్థ కారణంగా జగన్‌కు పాలన సామర్థ్యం లేదన్న ముద్ర పడిపోయిందని పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English