ప్ర‌శ్నించ‌డ‌మే పాపం.. పండ‌గ పూట జీతం క‌ట్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌మ ప‌ట్ల క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలంటూ ఉద్యోగులు ఆందోళన చేపట్టిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై క‌న్నెర్ర చేసిన స‌ర్కారు.. పండ‌గ పూట వారి జీతాల్లో నిర‌స‌న తెలిపిన రోజుకు వేతనాన్ని క‌ట్ చేసేసింది.  అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలో 10,665 సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. విధులకు హాజరు కాకుండా నిరసనలో పాల్గొన్నందుకు ఒక రోజు జీతంలో ప్రభుత్వం కోత పెట్టింది.

సచివాలయ ఉద్యోగులందరికీ జీతభత్యాలు మినహాయించాలంటూ.. డీడీఓలను మండల స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి జీతభత్యాలు విడుదల చేస్తే డీడీఓలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. శాంతియుతంగా డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తే జీతభత్యాలు కోత విధించడం ఏంటంటూ సచివాలయ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగంలో చేరి రెండేళ్లు పూర్తయినా ప్రొబేషన్‌ డిక్లేర్‌, పే స్కేల్‌ అమలు చేయలేదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

 ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్త పీఆర్‌సీ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని, అయితే సచివాలయాల ఉద్యోగులకు మాత్రం జులై నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. గత రెండే ళ్లుగా అంకితభావంతో పని చేస్తున్న తమకు ప్రభుత్వం ఇచ్చిన  గుర్తింపు ఇదా.. అని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు.  ప్రొబేషన్‌ పూర్తయినందున వెంటనే డిక్లరేషన్‌ ప్రకటించి పే స్కేలు వర్తిం పజేయాలని కోరుతున్నారు.

అక్టోబరు 2019 నుంచి 2021 అక్టోబరు 2కు రెండేళ్లు పూర్తి చేసుకొని, రూ15వేలు జీతంతో కొనసాగిస్తున్నారని, రెండేళ్ల తరువాత ప్రొబేషిన్‌ డిక్లరేషన్‌ చేసి, పే స్కేల్‌ వర్తింపజేయకుండా 6నెలల వరకు పొడిగించడం తగదని అన్నారు. రెండు నోషల్‌ ఇంక్రిమెంట్లు, 4డీఏలు ఇవ్వాలని, మరణించిన సచివాలయ ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామక ఉద్యోగం ఇవ్వాలని, ఈహెచ్‌ఎస్ హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో నిర‌స‌న‌పై ఉక్కుపాదం మోపిన స‌ర్కారు.. వారి వేత‌నంలో అది కూడా పండ‌గ పూట కోత పెట్ట‌డం .. అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది.