దొనకొండ.. అదెక్కడన్న సత్తిబాబు

దొనకొండ.. అదెక్కడన్న సత్తిబాబు

రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు వ్యాఖ్యలు చేయటంతోపాటు.. కోపం వస్తే నేను నేనుకాదన్నట్లుగా వ్యవహరించటం బొత్స సత్తిబాబుకు అలవాటే. దివంగత వైఎస్ హయాంలో ఫోక్స్ వ్యాగన్ ఎపిసోడ్ వేళ.. సొమ్ములు పోయాయ్.. ఏం సేత్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్య అప్పట్లో తీవ్ర సంచలనంతో పాటు.. దుమారాన్ని రేపింది.

 బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి అలా మాట్లాడేస్తారా? అంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. అయితే.. ముఖ్యమంత్రిగా వైఎస ఉండటంతో ఆ ఇష్యూను కంట్రోల్ చేయటంతో పాటు.. సత్తిబాబు మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు.

తాజాగా ఏపీ రాజధాని అమరావతిపై బొత్స చేస్తున్న వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వానికి కొత్త ఇబ్బందిగా మారుతున్నాయి. రాజధాని మారుతుందన్న సంకేతాలు ఇచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. అదే సత్తిబాబును రాజధాని ఎక్కడ? అన్నంతనే సమాధానం సూటిగా చెప్పని పరిస్థితి. మొత్తంగా ఏపీ రాజధాని విషయంలో బొత్స ఎప్పుడేం మాట్లాడతారో అర్థం కాని రీతిలో మారిందని మాత్రం చెప్పక తప్పదు.

ఇదిలా ఉంటే.. తాజాగా రాజధానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సీఎం జగన్ వంద రోజుల పాలనకు వంద మార్కులు వచ్చాయన్న ఆయన.. అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీల్ని తాము నెరవేరుస్తామన్నారు. అదే సమయంలో అమరావతితో పాటు.. అన్ని జిల్లాల్ని డెవలప్ చేస్తామన్నారు.

అభివృద్ధి.. సంక్షేమాన్ని సమం చేస్తామన్న సత్తిబాబు మాటలతో మీడియా ప్రతినిధి ఒకరు రాజధానిని దొనకొండకు తరలిస్తారా? అని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. దొనకొండ?  అదెక్కడ ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. దొనకొండను ఏపీ రాజధానిగా మార్చే ఆలోచన ఉందన్న చర్చ జోరుగా సాగుతున్న వేళ.. అసలు దొనకొండ ఎక్కడ? అంటూ సత్తిబాబు మాట్లాడటం అందరి చూపులు ఆయన మీద పడేలా చేశాయని చెప్పక తప్పదు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English