ఈటలను పిలిపించిన కేసీఆర్.. ఏం జరగనుంది?

ఈటలను పిలిపించిన కేసీఆర్.. ఏం జరగనుంది?

ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఊహించని రీతిలో కేబినెట్ విస్తరణను చేపట్టి.. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా మరో హాట్ టాపిక్ కు కేంద్రమయ్యారు. ఎవరితోనైనా మనస్పర్ధలు వచ్చినా.. ఎవరితోనైనా తేడా వస్తే వారిని తన తన దగ్గరకు రాకుండా ఉంచటమే కాదు.. వారి వైపు కన్నెత్తి చూసేందుకు సైతం ఇష్టపడని తత్త్వం గులాబీ బాస్ ది.

ఇప్పటికే పలువురు నేతలు కేసీఆర్ తో పడకపోవటం.. వారి విషయంలో ఆయన ఎలా వ్యవహరించారో తెలిసిందే. అలాంటివి గడిచిన కొద్దిరోజులుగా కేసీఆర్ కు ఈటలకు సరిగా టర్మ్స్ లేవన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి బలం చేకూరుస్తూ.. గులాబీ ఓనర్లం తామేనంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. ఈటల విషయంలో కేసీఆర్ గుర్రుగా ఉన్నారని.. ఇటీవల రాజేంద్రనగర్ లో నిర్వహించిన రివ్యూకు ఆయన్ను ఆహ్వానించలేదన్న ప్రచారం సాగింది.

ఓవైపు ముఖ్యమంత్రి రివ్యూ చేస్తుంటే.. మరోవైపు ఈటల మాత్రం హైదరాబాద్ నగరంలోని ఆసుపత్రులను సందర్శించటంతో పలు రకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. కేబినెట్ విస్తరణలో భాగంగా ఈటల పదవి పీకేస్తారని.. ఆయన స్థానంలో వేరే వారిని నియమిస్తారన్న ప్రచారం సాగింది. ఇదిలా ఉంటే.. ఊహించని రీతిలో కేసీఆర్ నుంచి ఈటలకు ఫోన్ వెళ్లటం..  ఆయన్ను ప్రగతి భవన్ కు రావాలని చెప్పటంతో.. హుటాహుటిన సారు ఇంటికి వెళ్లారు. చాలా కాలంగా ఇరువురు నేతలు కలిసింది లేదు. దీంతో.. ఒక్కసారిగా వీరి మీటింగ్ కు భారీ ప్రాధాన్యత సంతరించుకుంది.

నిజంగానే ఈటల పదవిని తీసేయటమే కేసీఆర్ ఆలోచన అయితే.. ఆయన్ను ప్రగతి భవన్ కు పిలిపించే అవకాశం ఉండదని.. అలా చేశారంటే ఆయన మంత్రివర్గంలో ఉంటారు కానీ.. మంత్రిత్వ శాఖ మార్చే అవకాశం ఉందంటున్నారు. మంత్రిత్వ శాఖను మార్చే విషయాన్ని ఆయనకు చెప్పటంతో పాటు.. తమ మధ్య ఎలాంటి దూరం లేదన్న భావనను కలిగించే పనిలో భాగంగా ఈటలను తన అధికార నివాసానికి పిలిపించి ఉంటారని భావిస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటల మంత్రిత్వ శాఖను మార్చినా.. బీసీలకు ఏదో నష్టం జరిగిందన్న నిరసన వెల్లువెత్తే అవకాశం ఉండటంతో.. ప్యాచప్ కోసం కేసీఆర్ ఇలా చేసి ఉంటారన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రగతి భవన్ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే.. ఇటీవల రాష్ట్రంలో విష జ్వరాలు విరుచుకుపడుతున్న వేళలో.. ఆ వివరాల్ని తెలుసుకునేందుకే ఈటలను పిలిపించినట్లుగా చెబుతున్నారు. మరీ.. వాదనల్లో నిజం ఎంతన్నది కాలమే సమాధానం చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English