ఆదివారం.. అనూహ్యంగా కేసీఆర్ విస్తరణ ప్రోగ్రాం

ఆదివారం.. అనూహ్యంగా కేసీఆర్ విస్తరణ ప్రోగ్రాం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలన్ని అనూహ్యంగా ఉంటాయి. ఉద్యమ వేళ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సాగుతున్న ఆయన ప్రయాణం చూస్తే.. అప్పటి వరకూ ఉలుకుపలుకు లేనట్లుగా.. నిద్రాణంగా.. నిస్తేజంగా కనిపించే వాతావరణాన్ని వేడెక్కించే నేర్పు ఆయన సొంతంగా చెప్పాలి.

తెలంగాణ రాజకీయాల్ని తన మాటలతోనూ.. చేతలతోనూ మార్చేసే సత్తా ఆయనకు మాత్రమే ఉందని చెప్పాలి. తెలంగాణపై ఆయన ప్రభావం ఎంతన్న విషయాన్ని ఉద్యమంతోనే ప్రపంచానికి చాటి చెప్పిన కేసీఆర్.. ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న వేళలోనూ ఆ పట్టు మిస్ కాలేదని చెప్పాలి.

విస్తరణ మీద అంచనాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నా.. అందరి అంచనాలకు భిన్నంగా.. అనూహ్యంగా తెర మీదకు తీసుకొచ్చారు. సుదీర్ఘకాలంగా గవర్నర్ గా సేవలు అందించిన నరసింహన్ నకు ఊహకు అందని రీతిలో వీడ్కోలు పలికిన కేసీఆర్.. కొత్తగా వచ్చే గవర్నర్ కు ఏ స్థాయిలో స్వాగతం పలుకుతారన్న సందేహం వెంటాడుతున్న వేళ.. అంచనాలకు భిన్నంగా విస్తరణ కార్యక్రమాన్ని తెర మీదకు తెచ్చేశారు.  

శనివారం రాత్రి 9 గంటల వరకూ కూడా మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం మీద ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. ఒక్కసారిగా తెర మీదకు వచ్చిన విస్తరణ అంశంతో టీవీల్లో ఒక్కసారిగా బ్రేకింగ్ న్యూస్ లు.. ప్రత్యేక కథనాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఓపక్క మూఢం.. మరోవైపు భాద్రపద మాసమైనా పట్టనట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నంతలో మంచి ముహుర్తాన్ని చూసి విస్తరణకు ఓకే అనేశారు.

సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్న వేళ.. అనూహ్యంగా పూర్తిస్థాయి కేబినెట్ ను కొలువు తీర్చేలా నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలకు ఒక్కరోజు ముందు.. ఇంకా కచ్ఛితంగా చెప్పాలంటే గంటల ముందు కొత్త మంత్రులు తెరపైకి రానున్నారు. ముఖ్యమంత్రితో సహా తెలంగాణలో మొత్తం 12 మంది ఉండగా.. మరో ఆరుగురిని మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకూ మంత్రివర్గంలో మహిళకు చోటు లేని వేళ..తాజాగా మాత్రం ఇద్దరు మహిళలకు కేబినెట్ లో చోటు కల్పించనున్నారు.

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం కేబినెట్ లో ఆరుగురికి చోటు దక్కనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న వారిలో ఈటెల రాజేందర్.. మల్లారెడ్డి.. ఇంద్రకరణ్ రెడ్డిలపై వేటు తప్పదంటున్నారు. అయితే.. ఈ అంశంపై స్పష్టమైన సంకేతాలు కనిపించని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటలను తప్పించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో ఆయన స్వరంలో ధిక్కారం కనిపించటం.. ఆయనకు మద్దతుగా పలు గొంతులు వినిపిస్తున్న వేళ.. ఇలాంటి వాటికి ఆదిలోనే చెక్ చెప్పాలన్న ఆలోచనలో ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించాలన్న భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒక్క ఈటలను మాత్రమే తప్పిస్తే తప్పుడు సంకేతాలు పోయే అవకాశం ఉండటంతో.. ఆయనతో పాటు మరో ఇద్దరు (మల్లారెడ్డి.. ఇంద్రకర్ రెడ్డి) తప్పించటం ద్వారా.. తాను ఎవరిని ఉపేక్షించేది లేదన్న సంకేతాల్ని ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశం ఎవరికి ఉందన్నది చూస్తే.. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు.. మేనల్లుడు హరీశ్ కు అవకాశం ఇవ్వనున్నారు. తొలుత హరీశ్ కు అవకాశం లేనప్పటికీ.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో హరీశ్ కు అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక.. మహిళలైన సబిత.. సత్యవతికి ఈసారి ఖాయంగా మంత్రి పదవులు దక్కుతాయని చెబుతున్నారు. వీరితో పాటు గంగుల కమలాకర్ కు.. పువ్వాడ అజయ్ కుమార్ కు మంత్రి పదవులు ఖాయమంటున్నారు. మొత్తంగా ఆరుగురికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందంటున్నారు.

ఒకవేళ.. ఇప్పటికే వినిపిస్తున్న అంచనాలకు తగ్గట్లు.. ఈటెల.. మల్లారెడ్డి.. ఇంద్రకరన్ రెడ్డిలపై వేటు వేసిన పక్షంలో వారి స్థానంలో ఎవరెవరికి చోటు దక్కుతుందన్న దానిపైనా కొన్ని ఆసక్తికర అంచనాలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం.. వేటు పడిన ముగ్గురు స్థానంలో జోగు.. సండ్ర.. లక్ష్మారెడ్డిలకు అవకాశం లభిస్తుందంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా లక్ష్మారెడ్డి పని తీరు బాగుందని.. ప్రస్తుతం అదే శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఈటల.. విష జ్వరాల్ని అరికట్టటంలో ఫెయిల్ అయ్యారన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తంగా ఆరుగురు కొత్త మంత్రులని చెబుతున్నా.. ఆరుగురా?  తొమ్మిది మందా? అన్నది మరికాసేపట్లో క్లారిటీ రావటం ఖాయం.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English