ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు పడనుందా?

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు పడనుందా?

గుంటూరు జిల్లా తుళ్లూరులో వినాయకమండపంలోకి తనను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని.. దళితురాలినంటూ టీడీపీ నేతలు దూషించారంటూ ఆరోపించిన వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇప్పుడు చిక్కుల్లో పడనున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఎక్కడా లేని రీతిలో ఆమెను బుక్ చేయడానికి టీడీపీ సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. అందుకు ఆమె స్వయంగా చెప్పిన మాటలనే ఆధారంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాను క్రిస్టియన్‌ను అని ఆమె చెప్పిన వీడియో ఉండడంతో ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం నుంచి ఎలా పోటీ చేస్తారంటూ కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.

రాష్ట్రంలో పలు ఎస్టీ స్థానాల నుంచి గెలిచిన అభ్యర్థులు గిరిజనలు కాదంటూ గతంలో కేసులు పడిన సందర్భాలున్నాయి. ఆ కేసుల్లో కొందరు ఎమ్మెల్యేలు గిరిజనులు కాదని తేలడంతో అనర్హత వేటు పడిన ఉదంతాలూ ఉన్నాయి. ప్రస్తుతం జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్న పాముల పుష్పశ్రీవాణి కూడా గిరిజనురాలు కాదని కోర్టులో కేసు ఉంది. అదే తరహాలో ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ కాదు.. క్రిస్టియన్ కాబట్టి తప్పుడు సమాచారం ఇచ్చి దళిత రిజర్వ్‌డ్ స్థానం నుంచి గెలిచారంటూ కోర్టును ఆశ్రయించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు ఆమె చేతిలో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కేసు వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే.. వైసీపీని ఇరుకునపెట్టేందుకు ఈ చర్యకు దిగితే భవిష్యత్తులో ఇది తమ పార్టీకి కూడా ఏదైనా స్థానంలో ఇబ్బందులు తెచ్చిపెట్టే ప్రమాదముందన్న ఆలోచన కూడా టీడీపీ నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తక్షణం వైసీపీ నేతల నోళ్లు మూయించాలంటూ కేసు వేయడమే సరైన మార్గమని కొందరు సీనియర్ నేతలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, దీనిపై చంద్రబాబు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని.. నాయకుల నుంచి వస్తున్న సూచనలన్నీ వింటున్నప్పటికీ దీనిపై ముందుకెళ్లాలా లేదంటే ప్రస్తుతానికి ఆగాలా అన్న విషయంలో ఆయన కూడా స్పష్టతకు రాలేదని తెలుస్తోంది. ఇలాంటి కేసు వేస్తే దళితుల్లో మంచి మైలేజీ వచ్చినా క్రిస్టియన్ వర్గాల్లో నష్టం కలుగుతుందుని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English