జగన్ ది ఆరంభశూరత్వమేనా?

జగన్ ది ఆరంభశూరత్వమేనా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి అప్పుడే వంద రోజులు పూర్తి అయిపోయింది. నవ్యాంధ్రకు నూతన సీఎంగా ప్రమాణం చేసిన రోజున... జగన్ సంచలన ప్రకటనలే చేశారు.

అక్రమాలను సహించేది లేదని, అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే జగన్ హెచ్చరికలు మాటల వరకే పరిమితమన్న వాదన ఇప్పుడు గట్టిగానే వినిపిస్తోంది. సీఎం అయిన తర్వాత కలెక్టర్ల సదస్సును కృష్ణా నది కరకట్టపై, మాజీ సీఎం, టీడీపీ అధినేత ఉంటున్న ఇంటికి ఆనుకుని ఉన్న, చంద్రబాబు హయాంలో సర్కారీ సొమ్ముతోనే కట్టేసిన ప్రజా వేదికలో నిర్వహించారు.

తొలి కలెక్టర్ల సదస్సునే అక్రమ కట్టడమైన ప్రజావేదికలో నిర్వహిస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్... ఈ సదస్సు ముగియగానే కూల్చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రజా వేదికతో పాటు కరకట్టపై అక్రమంగా వెలసిన అన్ని నిర్మాణాలకు కూడా ఇదే గతి తప్పదని, ఆయా భవన యజమానులు వారికి వారే సదరు భవనాలను కూల్చివేస్తే మంచిదని, లేదంటే ప్రభుత్వమే ఆ చర్యలు తీసుకుంటుందని కూడా జగన్ ఓ రేంజిలో ఫైరయ్యారు.

ఆ తర్వాత జరిగిందేమిటన్న విఫయానికి వస్తే.... జగన్  ఆదేశాల మేరకు అధికారులు ప్రజా వేదికను కూల్చేసి... మిగిలిన నిర్మాణాలకు నోటీసులతో సరిపెట్టుకున్నారు. జగన్ సర్కారు నోటీసులను కొందరు అసలే పట్టించుకోకపోగా, బీజేపీకి చెందిన గోకరాజు గంగరాజు లాంటి వారైతే... ప్రభుత్వానికే షాకిచ్చేలా స్పందించారు.

అసలు తమ నిర్మాణాలు అక్రమమే కాదని, ఆ మాటకొస్తే... కృష్ణా నదే తమ భూములను ఆక్రమించింందని కూడా వాదించారు. ఈ తరహా వాదనలు నిజంగానే ఆసక్తి రేకెత్తించగా... జగన్ సర్కారు వాటి జోలికి వెళ్లిన దాఖలాలే కనిపించడం లేదు.

రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నా కూడా అక్రమమని జగన్ సర్కారు తేల్చిన కట్టడాలు అలాగే ఉన్నాయి. జగన్ ఈ విషయాన్ని అసలు మరిచిపోయినట్టుగానే వ్యవహరిస్తూ... ప్రజా ధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చివేయడంతోనే తన పని అయిపోయిందన్న రీతిలో సాగుతున్నారు.

మొత్తంగా కరకట్టపై ఏకంగా 30కి పైగా అక్రమ కట్టడాలున్నాయని జగన్ సర్కారే తేల్చేసి... వాటికి నోటీసులు ఇచ్చి కూడా తదుపరి చర్యలకు మాత్రం సాహసించడం లేదు. ఈ క్రమంలో అక్రామలపై యుద్ధమంటూ సంచలన ప్రకటనలు చేసిన జగన్... ఆరంభ శూరుడిగా మారారన్న వాదన వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English