టార్గెట్ రేవంత్‌..కాంగ్రెస్ సీనియ‌ర్ సంచ‌ల‌నం

టార్గెట్ రేవంత్‌..కాంగ్రెస్ సీనియ‌ర్ సంచ‌ల‌నం

గ‌త కొద్దికాలంగా పీసీసీ చీఫ్‌ను మారుస్తారని ప్రచారం జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి ఈ ప‌ద‌వి ద‌క్క‌నుంద‌నే ప‌లువురు అంచ‌నాలు వేస్తున్నారు. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ ఎంపీ వీహ‌నుమంత రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌...వేరే పార్టీ నుంచి వచ్చినవారికి పీసీసీ చీఫ్ పోస్ట్ ఎలా ఇస్తారు? అని  ప్రశ్నించారు. వీహెచ్ కామెంట్లు రేవంత్ రెడ్డిని ఉద్దేశించిన‌వేనా అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

సోషల్ మీడియాలో పీసీసీ చీఫ్ ప‌ద‌వి కేటాయింపుపై స్పందించిన వీహెచ్‌...పార్టీలో ఆయారాం, గయరాం వంటి వారికే కీలక పదవులు ఇస్తున్నారని ఆరోపించారు.  పీసీసీ చీఫ్‌ పదవి తమదేనంటూ కొందరు ప్రచారం చేసుకుంటున్నారని... పార్టీ కోసం కష్టపడినవారికే పీసీసీ చీఫ్‌ ఇవ్వాలి.. కానీ, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతను నియమిస్తే.....అనేకమంది పార్టీని వీడిపోతారని స్పష్టం చేశారు.  కాంగ్రెస్‌లో ఓడిపోయిన వాళ్లకు ఎంపీ టికెట్‌లు ఇస్తున్నారని, నేతల బ్యాక్‌గ్రౌండ్‌ చూసి పదవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. త‌ద్వారా పార్టీ నేత‌లు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి త‌దిత‌రుల‌ను వీహెచ్ టార్గెట్ చేశారు.

ఇదిలాఉండ‌గా, తెలంగాణలో విషజ్వరాలు పెరిగిపోతున్నాయని వీహెచ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. డెంగ్యూతో ఇప్పటివరకు 70మంది చనిపోయారన్నారు.. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎవరూ చనిపోలేదని ప్రకటిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ బయటకు రావాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English