కేసీఆర్‌ను ఫిదా చేసేందుకు క‌డియం పాట్లు

కేసీఆర్‌ను ఫిదా చేసేందుకు క‌డియం పాట్లు

టీఆర్ఎస్ తొలి సర్కారులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంగా పనిచేశారు. పాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ప్రతిపక్షాల విమర్శలను బలంగా తిప్పికొట్టేవారు. దళితుల అంశాలపైనా ప్రతిపక్షాలను ఇరుకునపెట్టేవారని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. విద్యా శాఖ మంత్రిగా కూడా ఆయన మంచి సేవలు అందించారంటున్నారు. కానీ ఇప్పుడు సర్కార్లో, పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కడియం తన జిల్లా వరంగల్ కే పరిమితమయ్యారు. అక్కడ జరిగే పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. క‌డియంను ప‌క్క‌న‌పెట్టేసిన‌ట్లు ప్ర‌చారం జరుగుతుండ‌టంతో... కేసీఆర్‌ క‌ళ్ల‌ల్లో ప‌డేందుకు ఓ ప్ర‌య‌త్నం చేశారు.

తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతోపాటు కన్నెపల్లి పంపు హౌస్ ను సందర్శించడానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సందర్శించారు. తన వెంట సుమారు ఎనిమిది వేల మంది టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలసి ప్రాజెక్టులను సందర్శించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఇంజినీరింగ్ అద్భుతమన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలని సీఎం కేసీఆర్‌ కృషి చేస్తుంటే పనిలేని వాళ్లు ఉనికి కోసం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీకి తెలంగాణపై చిత్తశుద్ది ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కడియం శ్రీహరి డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి మాట్లాడని బీజేపీ నేతలు.. తెలంగాణ ప్రజల గురించి మాట్లాడితే వినడానికి సిద్ధంగా లేరని చురకలు అంటించారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీని ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి అనుమతులు ఇప్పించి అప్పుడు మాట్లాడాలన్నారు. ఏదో నాలుగు సీట్లు రాగానే బీజేపీ ఎగిరి పడడం కరెక్ట్ కాదని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తో సీఎం కేసీఆర్ తెలంగాణ ను… సస్యశ్యామలం చేస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.  కోటి ఎకరాల మాగాణం కోసం ముఖ్యమంత్రి తలపెట్టిన మహాయజ్ఞం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్నారు.  తక్కువ సమయంలో ఇంత భారీ సాగునీటి ప్రాజెక్టును నిర్మించడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారని అన్నారు. కాగ్రెస్, బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ పై అవాకులు చవాకులు మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు. తెలంగాణలో టీఆరెస్ పార్టీని ఢీకొనే సత్తా మరో పార్టీకి లేదన్నారు. కాగా, క‌డియం తాప‌త్రయం ఏ మేర‌కు ఫలితం ఇస్తుందో చూడాలి మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English