ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు...

ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు...

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినేట్‌ బుధవారం సమావేశమైంది. ఈ సమావేశంలో కేబినేట్‌ పలు కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. ఈ రోజు తీసుకున్న కీలక నిర్ణ‌యాల్లో ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్ర‌ధాన‌మైంది. ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తూ  మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ఇక అత్యంత కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో జ‌గ‌న్ తాను ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గేది లేద‌ని మ‌రోసారి నిరూపించారు. నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రూ.3216.11 కోట్ల టెండర్ల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రివర్స్ టెండరింగ్‌ పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్ర‌మంలోనే కాంట్రాక్ట‌ర్ల‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల‌ను రిక‌వ‌రీ చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక గ‌త కొద్ది రోజులుగా ఆశా వ‌ర్క‌ర్లు జీతాల పెంపుపై తీవ్ర‌మైన ఆందోళ‌న చేస్తున్నారు. జ‌గ‌న్ ముందుగానే ఇచ్చిన హామీ ప్ర‌కారం వీరి వేత‌నాల‌ను రూ. 3 వేల నుంచి రూ.10 వేల‌కు పెంచేందుకు ఆమోద‌మోద్ర వేశారు.

ఇక కీల‌క‌మైన బంద‌రు పోర్టుకు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ భూముల లీజు కూడా చెల్లించలేదని పరిశ్రమల శాఖ అధికారులు కేబినెట్‌కు వివరించారు. ప‌నులు ప్రారంభించ‌క‌పోవ‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు కూడా ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఇక రాష్ట్రంలో  మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇక కీల‌క‌మైన ఆర్టీసీ విలీనానికి సంబంధించి 15 రోజుల్లో విధివిధానాలు ఖ‌రారు కానున్నాయి. దీనిపై ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే ఆర్డినెన్స్ జారీ చేయ‌నుంది. ఆర్టీసీలోని 53 వేల మంది ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు 60 ఏళ్ల‌కు పెర‌గ‌నుంది. ఇక కొత్త ఇసుక విధానం రేప‌టి నుంచే అమ‌ల్లోకి రానుండ‌గా... ట‌న్ను ఇసుక ధ‌ర రూ.375 గా నిర్ణ‌యించారు. తొలుత 58 ఇసుక స్టాక్ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English