హరీశ్ సీఎం కావాల్సిందే...

హరీశ్ సీఎం కావాల్సిందే...

తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ లో అసమ్మతి చాప కింద నీరులా పాకుతోందన్న వాదనలు క్రమంగా పెరుగుతున్నాయి. టీఆర్ఎస్ అధినేతగా, సీఎంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఇప్పటిదాకా తిరుగన్నదే లేదు. అయితే మొన్నటికి మొన్న కేసీఆర్ కేబినెట్ లోని మంత్రి ఈటల రాజేందర్ గళం విప్పారు. ఆ గళం ప్రస్తుతానికి చల్లబడ్డా... కేసీఆర్ మేనల్లుడు తన్నీరు హరీశ్ రావు వర్గం ఇప్పుడు తమదైన శైలి చూపిస్తోంది.

హరీశ్ రావు అభిమానులం అని చెప్పుకుంటున్న కొందరు... హరీశ్ రావు సీఎం కావాలంటూ జోగులాంబకు మొక్కులు తీర్చుకున్నారు. ఆ మొక్కులు కూడా మామూలు మొక్కులు కావండి బాబూ. ఏకంగా 1,016 కొబ్బరికాయలు కొట్టి మరీ.. తమ నేత సీఎం కావాలని, కుదరకుంటే డిప్యూటీ సీఎం అయినా కావాలని అమ్మ వారికి మొక్కుకున్నారు. ఈ మొక్కేదో చూడ్డానికి కాస్త చిన్నగానే కనిపిస్తున్నా... మొక్కు సందర్భంగ హరీశ్ అభిమానులం అని చెప్పుకున్న గులాబీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కథాకమామీషు ఏమిటో చూద్దాం పదండి.

మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలంటూ ఆయన అభిమానులు అలంపూర్ జోగులాంబకు మొక్కు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు చింతకుంట విష్ణు, వనపర్తి జిల్లా చందాపూర్‌‌కు చెందిన 25 మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మంగళవారం జోగులాంబకు 1,016 టెంకాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. హరీశ్ రావును తెలంగాణకు ముఖ్యమంత్రిగా చేయాలని, లేదంటే ఉప ముఖ్యమంత్రి పదవి అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హరీశ్ కు పదవి దక్కాలని మాత్రమే డిమాండ్ చేసి అక్కడితో ఆగితే బాగానే ఉండేది. అయితే తమ నేతకు ఎలాంటి పదవి లేకుండా పార్టీలో నిమిత్తమాత్రుడిగా చేసే దిశగా జరుగుతున్న యత్నాలపై వారు తమదైన శైలిలో గళం విప్పారు.

ఉద్యమకారులను పక్కనపెట్టి పక్క పార్టీలోంచి వచ్చిన వారికి కేసీఆర్ పదవులు కట్టబెట్టారని హరీశ్ అభిమానులు మండిపడ్డారు. కేసీఆర్‌ను చూసి ఎవరూ ఓట్లు వేయలేదని, హరీశ్‌రావు మాటతీరు, పనితీరును చూసే ప్రజలు ఓట్లు వేశారని పేర్కొన్నారు. పార్టీ నుంచి హరీశ్‌ను, మంత్రి ఈటల రాజేందర్‌ను బయటకు పంపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

ఇకనైనా కేసీఆర్ కళ్లు తెరిపించాలని అమ్మవారిని కోరుకున్నట్టు వారు తెలిపారు. మొత్తంగా హరీశ్ అభిమానులం అంటూ ఎంట్రీ ఇచ్చిన వీరంతా... హరీశ్ కు పదవులు దక్కాలని మొక్కుకోవడంతో పాటుగా ఏకంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలే చేశారని చెప్పక తప్పదు. ఈ తరహా పరిణామాలపై టీఆర్ఎస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English