బాబు పాయింట్లోకి వచ్చేశాడు

బాబు పాయింట్లోకి వచ్చేశాడు

తెలుగుదేశం నేతల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. మహానాడులో తమ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగం మరింత వాడిగా.. వేడిగా.. సూటిగా ఉండటంతో వారిలో ఒకింత సంతోషం పాళ్లు పెరిగింది. ప్రతిదానికి బాబు బాధ్యతే అంటూ మాట్లాడే వైఎస్సార్ కాంగ్రెస్ చేసే విమర్శలకు కౌంటర్ ఇచ్చేలా.. రోటీన్ కి భిన్నంగా పంచ్ లతో ప్రసంగం ఉండటం వారి సంతోషానికి కారణం.

 ‘‘ఏది జరిగినా నా కుట్రే అని విజయమ్మ అంటున్నారు. నల్లధనం చలామణి, హవాలా.. నీకది-నాకిది పద్దతి ద్వారా లక్ష కోట్ల రూపాయిలు సంపాదిస్తే.. అదీ నా కుట్ర వల్లేనా? బయ్యారంలో అల్లుడికి 1.40లక్షల ఎకరాల ఇనుప ఖనిజం గనులు కట్టబెట్టటం కూడా నా కుట్రేనా? 2004లో వైఎస్ కు ఉన్న ఇళ్లు ఎన్ని? ఇప్పుడున్న ఇళ్లు ఎన్ని? అప్పుడున్న వ్యాపారాలేంటి. ఇప్పడున్న వ్యాపారాలేంటి? అప్పట్లో పేపర్, టీవీ లేవు. ఇప్పుడేమో సాక్షి పత్రిక, టీవీ ఛానల్ ఉన్నాయి. ఉన్నవి.. చేసినవి చెబితే కుట్ర అవుతుందా? తప్పని చెబితే తిరిగి మాపై బురదజల్లుతారా?

 ఈ రోజు పోతే మళ్లీ రాదన్నట్లు ఇష్టారాజ్యంగా చేశారు. దానికీ నేను బాధ్యుడినా? ఆ కుట్ర నేనే చేశానా? ఒక వ్యక్తి దురాశ కోసం చాలామంది జైలుకు వెళితే అందులోనూ నా కుట్రే ఉందా? వారి వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమైపోయాయి’’ అంటూ వ్యంగంగా.. వెరైటీగా బాబు మాట్లాడటం తెలుగుదేశం నేతలకు బాగా నచ్చింది. ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలకు ధీటుగా బాబు చెలరేగటం వారిలో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.  రోటీన్ కి భిన్నంగా మహానాడులో మాట్లాడిన వైఖరిని చూసి.. తెలుగుదేశం నేతల నోట వచ్చే మాటేమిటంటే.. బాబు పాయింట్లోకి వచ్చేశాడు అని.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు