పాకిస్థానీకి పాకిస్థానీ పంచ్ అదిరిపోలా..

పాకిస్థానీకి పాకిస్థానీ పంచ్ అదిరిపోలా..

ఒక పాకిస్థానీ సెలబ్రెటీ ఇండియాను అమితంగా ఇష్టపడటం.. ఇక్కడే కెరీర్ వెతుక్కోవడం.. ఈ దేశ పౌరసత్వం కూడా తీసుకోవడం.. పాకిస్థాన్ పేరెత్తితే మండిపోవడం అరుదైన విషయమే. హిందీతో పాటు తెలుగులోనూ చాలా పాటలు పాడిన గాయకుడు అద్నాన్ సమి విషయంలో ఇదే జరిగింది. అతను స్వతహాగా పాకిస్థానీ. ఐతే తన పాటలతో భారతీయ సంగీత ప్రియులకు చేరువ అయ్యాడు.

బాలీవుడ్, టాలీవుడ్ సహా చాలా ఇండస్ట్రీల్లో అవకాశాలు అందుకున్నాడు. ఐతే ఇక్కడ కెరీర్ బాగుండటం, పాకిస్థాన్‌లో అశాంతి నెలకొనడంతో అతను ఆ దేశమే విడిచిపెట్టి వచ్చేశాడు. భారత్‌లో స్థిరపడ్డాడు. ఇక్కడి పౌరసత్వం కూడా పొందాడు. ఇప్పుడతను తాను భారతీయుడినని గర్వంగా చెప్పుకుంటాడు. సందర్భానుసారం భారత్‌ను పొగిడేందుకు, పాకిస్థాన్‌ను తిట్టేందుకు కూడా అతను వెనుకాడడు.

ఇలా చేసిన వ్యక్తిని పాకిస్థానీలు ఏమీ అనకుండా ఉంటారా? సోషల్ మీడియాలో అతడిపై పాకిస్థానీలు విషం కక్కడం మామూలే. అతను ఏ ట్వీట్ పెట్టినా.. దాని మీద సెటైర్లు వేసి అతడిని కవ్వించే ప్రయత్నం చేస్తుంటారు పాకిస్థాన్ నెటిజన్లు. తాజాగా అద్నాన్ ఏదో ట్వీట్ వేస్తే.. ఒక పాకిస్థానీ జోక్యం చేసుకుని కశ్మీర్ మీద మీ అభిప్రాయమేంటి అని అడిగాడు. అది భారత్‌లో భాగమైన అద్భుతమైన ప్రదేశం అంటూ తనదైన శైలిలో బదులిచ్చాడు అద్నాన్.

ఐతే దీనిపై మరో పాకిస్థానీ స్పందిస్తూ.. అభినందన్ వర్ధమాన్‌కు పాకిస్థానీలు ఇచ్చిన టీ ఎలా ఉందంటూ కవ్వించే ప్రయత్నం చేశాడు. అద్నాన్ ఊరుకుంటాడా? అభినందన్.. పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చి.. పాకిస్థాన్‌కు వెళ్లి టీ తాగి క్షేమంగా ఇండియాకు వచ్చి ఇక్కడ అత్యున్నత సైనిక పురస్కారం కూడా పొందాడంటూ పంచ్ ఇచ్చాడు.

ఆ తర్వాత ఒక పాకిస్థాన్ నెటిజన్ ఒక పందిని.. పక్కన అద్నాన్ ఒకప్పటి భారీ అవతారంతో ఉన్న పిక్, లేటెస్ట్‌ పిక్ పెట్టి అద్నాన్ ‘అప్పుడు ఇప్పుడు’ ఎలా మారాడో చూడండంటూ ట్వీట్ వేశాడు. దీనికి అద్నాన్ మామూలు రిటార్ట్ ఇవ్వలేదు. ‘ఔను నేను అప్పుడు పాకిస్థానీని. ఇప్పుడు ఇండియన్‌గా మారాను’ అని పేర్కొనడం ద్వారా ట్వీట్ వేసిన పాకిస్థానీకి దిమ్మదిరిగేలా చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English