పవన్ సారూ... మోదీ షాలు అపాయింట్ మెంట్ లభిస్తుందా?

పవన్ సారూ... మోదీ షాలు అపాయింట్ మెంట్ లభిస్తుందా?

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిపై ప్రస్తుతం నెలకొన్న కన్ఫూజన్ పై  క్లారిటీ తీసుకొచ్చేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ రంగంలోకి దిగినట్టుగా సంచలన ప్రకటన చేశారు. ఇందుకోసం తాను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల వద్దకు వెళతానని కూడా పవన్ వ్యాఖ్యానించారు.

ఈ మేరకు శుక్రవారం అమరావతికి భూములు ఇచ్చిన రైతులు, రైతు కూలీలు, అక్కడి ప్రజలతో భేటీ అయిన సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చెప్పడానికేముంది... ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. మరి వాటిని కార్యరూపంలో పెట్టేందుకు కాస్తంత దమ్ము కావాల్సిందే కదా. మరి ఆ దమ్ము, కార్యాచరణ పవన్ వద్ద ఉన్నాయా? అన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా వినిపిస్తోంది.

అయినా ఓ పార్టీ నేతగా, ఏపీలో మొన్నటి ఎన్నికల్లో ఫలితాలనే తారుమారు చేసేలా కలరింగ్ ఇచ్చేసి... బీజేపీ నేతలపై తనదైన శైలిలో కామెంట్లు చేసిన పవన్... ఇప్పుడు ఫ్లైటెక్కి ఢిల్లీలో ల్యాండైతే... ఆయనకు అటు మోదీ గానీ, ఇటు అమిత్ షా గానీ కనీసం అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా? అన్నదే అసలు సిసలు డౌట్ గా వినిపిస్తోంది. ఏపీకి చెందిన సింగిల్ ఎమ్మెల్యే కలిగిన పార్టీకి అధినేతగా ఉన్న పవన్... ఏపీ సమస్యలపై చర్చించేందుకు వెళితే... మోదీ షాలు ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వరు? అంటారా? అయితే గతంలో చోటుచేసుకున్న పలు పరిణామాలను గుర్తు చేసుకుంటే గానీ... ఈ విషయంలో కాస్తంత క్లారిటీ వచ్చేలా లేదు.

బీజేపీ మిత్రపక్షంగా ఉన్న సమయంలో ఏపీ సీఎం హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏకంగా 27 సార్లు ఢిల్లీకి వెళ్లినా మోదీ అపాయింట్ మెంట్ దక్కని వైనం తెలిసిందే కదా. ఓ రాష్ట్రానికి సీఎంగానే కాకుండా మిత్రపక్షంగా ఉన్న కీలక పార్టీకి చెందిన అధినేతనే మోదీ షాలు పట్టించుకోకుంటే... ఇప్పుడు పవన్ వెళితే పలుకుతారా? అంతేకాదండోయ్... గతంలో ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మోదీ షాలు చెబితే... ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్... బీజేపీతో పెద్ద అగాథాన్నే సృష్టించుకున్నారు.

మొన్నటి ఎన్నిల్లో బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలను తన పార్టీలోకి లాగేసుకున్నారు. ఇవన్నీ మరిచి పవన్ కు మోదీ షాలు అపాయింట్ మెంట్ ఇస్తారా? అంటే... అనుమానమేనని చెప్పక తప్పదు కదా. అందులోనూ ప్రత్యర్థి పార్టీలపై తమదైన శైలి వ్యూహాన్ని అమలు చేసే విషయంలో రాటుదేలిపోయిన మోదీ షాలు... పవన్ కు అపాయింట్ మెంట్ ఇస్తారని అనుకోలేం కదా. చూద్దాం మరి పవన్ ఢిల్లీకి వెళ్లి ఏం సాధిస్తారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English