జగన్ హానీమూన్ పీరియడ్ పూర్తయిపోతోంది..

జగన్ హానీమూన్ పీరియడ్ పూర్తయిపోతోంది..

ఏపీలో భారీ మెజారిటీతో సీఎం పీఠంపై కూర్చున్న వైఎస్ జగన్మోహనరెడ్డి త్వరలో 100 రోజుల పాలనను పూర్తిచేసుకోబోతున్నారు. 100 రోజుల పాలన పూర్తికాబోతుందని వైసీపీ శ్రేణులు హుషారుగా కనబరుస్తున్నా లోలోన టెన్షన్ పడడం కనిపిస్తోంది. ఇందుకు కారణం.. ఇంకా కొత్త ప్రభుత్వం అన్న ముద్ర ఈ 100 రోజుల తరువాత చెరిగిపోనుండడమే.

మే 30న జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే టీడీపీ, జనసేనలు 100 రోజుల వరకు జగన్ ప్రభుత్వం జోలికి రాబోమని చెప్పారు. కొత్త ప్రభుత్వానికి కనీసం 100 రోజుల సమయం ఇవ్వడం భావ్యమని చెప్పారు. అయితే... మాట నిలబెట్టుకోకుండా ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇప్పుడు 100 రోజులు పూర్తయితే పూర్తిస్థాయిలో జగన్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురవనుంది.

దీనికోసం టీడీపీ ఇప్పటికే టీడీపీ 100 రోజుల జగన్ పాలనలో జరిగిన పొరపాట్లు.. వైఫల్యాల జాబితాను తయారు చేసుకుంది. మొత్తం మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరు నేతలు ఆ లిస్టులను ఫాలో అవుతూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడడానికి సిద్ధమవుతున్నారు.

మరోవైపు బీజేపీ కూడా జగన్ పాలనపై గుర్రుగానే ఉంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లు ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. వీరు కూడా అంశాలవారీగా జగన్ పాలనను ఏకిపారేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలను అనుసరిస్తూ జనసేన కూడా గొంతు విప్పనుంది.

మరోవైపు ఇదే సమయంలో రాజధాని విషయంలో రగడ జరుగుతుండడం... ఆశా వర్కర్ల వేతనాల సమస్య, ఇసుక అక్రమాలు, ఇసుక కొరత, వరదలను సరిగా హ్యాండిల్ చేయలేకపోవడం.. నవరత్నాలు మొదలు కాకపోవడం... టీడీపీ నేతలపై రాజకీయ కక్ష సాధింపులు వంటి అన్ని అంశాలనూ పట్టుకుని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ దాడికి దిగనున్నట్లు తెలుస్తోంది.

జగన్ ప్రభుత్వం తీరు కూడా విపక్షాలకు సులభంగా అస్త్రాలు అందిస్తోంది. ముఖ్యంగా పాలనలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గోదావరి, కృష్ణానదులకు వచ్చిన వరదలను ప్రభుత్వం హ్యాండిల్ చేయలేకపోయిందన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

అలాగే... ఇసుక విషయంలో తలెత్తిన సమస్యను కూడా ఇంకా పరిష్కరించకపోవడంతో నిర్మాణ రంగం పడకేసింది. అమరావతి ప్రాజెక్టు నుంచి ప్రపంచబ్యాంకు, ఏఐఐసీ వంటివి వెనక్కు మళ్లడంతో  రాజధానిపై ఇప్పటికే అనుమానాలు ముసురుకొని రియల్ రంగం పడిపోయింది.. పులిమీద పుట్రలా ఇప్పుడు రాజధాని మార్పు రచ్చతో ఉన్న కొద్దిపాటి రియల్ వ్యాపారమూ స్తంభించిపోయింది.

అంతేకాదు.. శాఖలవారీగా సాధారణ పన్ను వసూళ్లు కూడా భారీగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అంతా ఫ్రీ ఫ్రీ అంటుండడంతో జగన్ ఏవైనా ఉచిత వరాలు ప్రకటిస్తారేమో అన్న ఆశతో పట్టణాలు, పల్లెలు అన్న తేడాలు లేకుండా ప్రజలు పన్నులు కట్టడం తగ్గించేశారని తెలుస్తోంది. ఈ కారణంగానే జగన్ ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత పన్ను వసూళ్లు భారీగా పడిపోయాయి. జూన్ నెలలో ఏకంగా 60 శాతం రెవెన్యూ తగ్గింది.

అనుభవమున్నవారిని మంత్రులుగా నియమించుకోకపోవడం.. అధికార వ్యవస్థ కూడా కాస్త రిలాక్సవుతుండడంతో పాలన గాడి తప్పిందని విశ్లేషకులు చెబుతున్నారు. సరైన టీం లేకపోవడంతో జగన్ పాలన అస్తవ్యవస్తంగా మారింది. అయితే.. ఇప్పటికే లోపాలు బయటపడుతున్నా విపక్షాలు విమర్శిస్తున్నా మీడియా ఇంకా పూర్తి స్థాయిలో జగన్‌కు వ్యతిరేకంగా నోరు విప్పలేదనే చెప్పాలి.
జగన్ వ్యతిరేక మీడియాగా పేరుగాంచిన సంస్థలు కూడా ఇంకా పూర్తిస్థాయిలో జూలు విదల్చనట్లే కనిపిస్తోంది. నేషనల్ మీడియా ఇంకా జగన్ భారీ విజయం దాటి ముందుకు వెళ్లలేదు. దాంతో నేషనల్ మీడియా కూడా జగన్‌ను పసికూనగానే చూస్తూ టైమిచ్చింది.

ఇప్పుడు 100 రోజుల పాలన పూర్తయి విపక్షం విజృంభించడం ప్రారంభిస్తే సహజంగానే అది మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. మారుతున్న రోజుల్లో పాఠకులను ఆకర్షించడానికి జాతీయ మీడియా సైతం ప్రాంతీయ రాజకీయాలు, రాష్ట్రాల వార్తలపై ఫోకస్ పెడుతుండడంతో జగన్ వారికి టార్గెట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ఎలా చూసినా జగన్ హానీమూన్ పీరియడ్ ముగియగానే కష్టాలు తప్పవని తెలుస్తోంది.

ఇవన్నీ ఇబ్బందికరమే..
ఆశా వర్కర్ల వేతనాల సమస్య: ఆంధ్రప్రదేశ్‌లో ఆశావర్కర్లు రెండు రోజుల కిందట సీఎం జగన్ కార్యాలయం ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాల నుంచి బయలుదేరిన ఆశాకార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అంతేకాదు.. జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించేందుకు ప్రయత్నించిన ఆశాకార్యకర్తలనూ అణచివేశారు.

రెండు నెలల కిందట జగన్ ఆశాకార్యకర్తలకు రూ.10 వేల జీతం ఇస్తామని ప్రకటించినప్పుడు వీరంతా ఎంతో సంతోషించారు. కానీ... గ్రేడ్ల విధానాన్ని జగన్ ప్రకటించేటప్పటికి ఏకంగా తమ ఉద్యోగాలకే ఎసరొస్తోందని వీరు గ్రహించి ఆందోళనల బాట పట్టారు.

అకడమిక్ రికార్డులు ఉన్నవారు మాత్రమే ఉద్యోగాల్లో కొనసాగుతారని ప్రభుత్వం ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టిందని.. దానివల్ల ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్న వేలాది మంది రోడ్డున పడతారని అంటున్నారు. 8 నెలలుగా జీతాలు అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు. జగన్ ఇచ్చిన హామీలేవీ నెరవరకపోగా తమ ఉద్యోగాలకే ఎసరొస్తోందని.. వెంటనే జీతాల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇసుక కొరత: చంద్రబాబు ప్రభుత్వం కాలంలో తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేసింది. కానీ, ఇంతవరకు కొత్త విధానాన్ని ఇంకా అమలు చేయలేదు. సెప్టెంబరు 5 నుంచి అమలు చేస్తామని చెబుతున్నా ఇంతవరకు టెండర్ల ప్రక్రియే పూర్తి కాలేదు. దీంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. అధికార పార్టీకి చెందినవారు, ప్రజాప్రతినిధులు, వారి అందడదండలున్నవారు అక్రమంగా ఇసుక తవ్వి విక్రయిస్తున్నారు. దీంతో ట్రాక్టర్ ఇసుక ధర రూ.15 వేలకు పైగా పలుకుతోంది.

నిజానికి వైసీపీ ప్రభుత్వం ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక విక్రయించాలని నిర్ణయించింది. ట్రాక్టర్ ఇసుక ధర 330 రూపాయలుగా నిర్ణయించింది. కానీ.. ఇదంతా అమల్లోకి రాలేదు. ఫలితంగా తీవ్ర కొరత ఏర్పడి భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన ఇసుక కొరత ఏర్పడడంతో ఈ మధ్యనే క్వారీలను తెరిచిన వైసిపి ప్రభుత్వం అధికారుల సమక్షంలో ఇసుక అమ్మకాలను సాగిస్తోంది . క్వారీల వద్ద కిలోమీటర్ల పొడవునా ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి.

ప్రబుత్వం ఉద్దేశపూర్వకంగానే కృత్రిమ కొరత సృష్టించి పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు లాభపడే వ్యూహాన్ని అనుసరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిర్మాణ రంగం పడకేయడంతో ఆ రంగంలోని కార్మికులు ధర్నాలు చేస్తున్నారు.

భయపెడుతున్న ఖజానా: ఏపీ ఖజానాలో కాసుల గళగళ తగ్గిపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల కాలానికి ఏపీకి పన్నుల ఆదాయం.. రూ. 11,102 కోట్లు వచ్చాయి. అదే గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2018-19కి సంబంధించి ఇదే కాలంలో వచ్చిన పన్నుల ఆదాయం 19,827 కోట్లు. అంటే రూ. 8,700 కోట్ల రూపాయల వరకు ఏపీ సర్కార్‌కు మూడు నెలల్లో ఆదాయం తగ్గిపోయింది.

అమరావతి ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ వెనక్కు మళ్లడం.. ప్రభుత్వం రాజధానిపై అనిశ్చితి క్రియేట్ చేయడంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలై రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పడిపోయింది. ఇది ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ ఆదాయంలో భారీ తగ్గుదలకు కారణమవడం ఖాయం.

మరోవైపు  ఇప్పటికే ఏపీ సర్కార్ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించడం.. సంక్షేమ పథకాలు ఇక మొదలుపెడతామని చెప్పడంతో నెలవారీ ప్రభుత్వ ఖర్చు భారీగా పెరగనుంది. ఆ ఖర్చుకు ఈ ఆదాయం చాలదని అధికారులే చెబుతున్నారు.

గత మూడు నెలల్లో వాణిజ్యపన్నుల్లో 14శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3శాతానికి తగ్గిందని తాజాగా అధికారులు సీఎంకు చెప్పారు. స్టీల్, ఇనుము, సిమెంటు రేట్లు కూడా తగ్గడం ఆదాయంపై ప్రభావం చూపుతోంది. ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గగా... ఖర్చులు ముందుముందు భారీగా కనిపిస్తున్నాయి. దీంతో... రాష్ట్రం అప్పులుపాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

నవరత్నాలు-ఇతర పథకాలు: జగన్ ఎన్నికలకు ముందు నుంచి చెబుతున్నవి.. తాను సీఎం అయినాక ఇచ్చిన హామీలు ఇప్పుడిప్పుడే అమలయ్యే సూచనలు కనిపించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.

* కీలకమైన అమ్మఒడి పథకం జనవరి 26 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. అంటే.. మరో అయిదు నెలల వరకు ఈ పథకం లబ్ధి ప్రజలకు చేరే అవకాశం లేదన్నమాటే.
* రైతు భరోసా పథకం ప్రారంభమయ్యేది అక్టోబరు 15న. దీనికి ఇంకా రెండు నెలల టైం ఉంది.
* పేదలకు పట్టాల పంపిణీకి ఉగాది ముహూర్తంగా నిర్ణయించారు. అంటే ఆర్నెల్ల వరకు ఆ మాట లేనట్లే.
* వైఎస్సార్ పెళ్లి కానుకకు ముహూర్తం ఫిబ్రవరి చివర్లో పెట్టుకున్నారు. ఇక ఆర్నెల్ల వరకు అటువైపు చూడనవసరం లేదు.
* నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు మొదలైన వృత్తుల్లో ఉన్నవారికి రూ.10 వేలు ఇవ్వాలన్న నిర్ణయం అమలు కావడానికి కూడా ఆర్నెల్ల సమయం పెట్టుకున్నారు. అది కూడా ఫిబ్రవరి చివర్లోనే.
* మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఇస్తామన్న రూ.24 వేలు మొత్తం డిసెంబరు చివర్లో ఇస్తారట.ః
* పడవ , బోటు ఉన్న మత్స్యాకారులకు ఇచ్చే రూ.10 వేలు నవంబరు 21 నుంచి ఇస్తారు.
* సొంత ఆటో, ట్యాక్సీ ఉన్నవారికి ఇచ్చే రూ.10 వేలు సెప్టెంబరు చివర్లో అందుతాయని చెబుతున్నారు.
వీటిలో ఏడాదిలో ఇస్తామన్నవి మాత్రమే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి ముహూర్తాలు పెట్టుకున్నవన్నీ తరువాత బడ్జెట్లోనే దక్కుతాయి.
అంటే జగన్ చెప్పిన సంక్షేమ ఫలాల్లో చాలావరకు ఆయన గద్దెనెక్కిన తొలి ఏడాదిలో అందడం లేదనే చెప్పాలి. ప్రజల్లో ఇదే అసంతృప్తి వ్యక్తమవుతోంది.

వరదలను సరిగా హ్యాండిల్ చేయలేకపోవడం: జగన్ సీఎం అయిన రెణ్నెళ్లకే గోదావరికి వరదలొచ్చాయి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వందలాది గ్రామాల ప్రజలు నీళ్లలోనే ఉన్నారు. అది చాలదన్నట్లుగా కృష్ణానదికీ వరదొచ్చింది. లంక గ్రామాలు నీట మునిగాయి. రాజధాని పక్కనే ఉన్న విజయవాడ నగరమూ జలమయమైంది. ఇలాంటి విపత్కర సమయంలో సీఎం జగన్మోహనరెడ్డి కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. తొలిసారి మంత్రయిన జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారన్న విమర్శలు వచ్చాయి.

చంద్రబాబు, టీడీపీ నాయకులపై విమర్శలు కురిపిస్తున్నారే కానీ నీట మునిగిపోతున్న ప్రజలను ఎలా గట్టెక్కించాలి.. ప్రకాశం బ్యారేజీకి ఏమైనా అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో ఆలోచన చేయడం లేదని విపక్షం ఆరోపించింది.

టీడీపీ నేతలపై రాజకీయ కక్ష సాధింపులు: జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీడీపీ నేతలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని.. అన్ని రకాలుగా వెంటాడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయడం.. చంద్రబాబు హయాంలో నిర్మించిన భవనాల కూల్చివేత వ్యవహారం.. జిల్లాల్లోనూ టీడీపీ ప్రభుత్వంలోని మంత్రులకు చెందిన అక్రమ కట్టడాల కూల్చివేత.. చంద్రబాబు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయడం వంటివన్నీ విపక్షాన్ని రగిలిపోయేలా చేస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English