సానుభూతి తగ్గిందా..?

సానుభూతి తగ్గిందా..?

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇప్పటికే జగన్ బాబు జైలు నుంచి బయటకు రాకపోవటం... బెయిల్ పై విచారణకు కనీసం నాలుగు నెలల సమయం ఉన్న నేపథ్యంలో వారికో సందేహం మనసులో చోటు చేసుకుంది. ఇటీవల హైదరాబాద్ లో విజయమ్మ పాల్గొన్న సభకు పెద్దగా జనం లేకపోవటం... అలాంటి దృశ్యమే మరోమారు పునరావృతం కావటంతో విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు.

 తాజాగా జగన్ ను జైల్లో పెట్టి ఏడాది పూర్తయిన సందర్భంలో ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసిన నిరసన సభలో విజయమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తక్కువ సంఖ్యలో హాజరైన ‘జన’సంఖ్య చూసి ఆమె కంగుతిన్నారు. సాధారణంగా ధర్నా చౌక్ దగ్గర నిరసన సభ ఏర్పాటు చేస్తే జనంతో పోటెత్తాలి. ఎందుకంటే.. చాలా చిన్న ప్రాంతం . ఏ కొద్దిగా జనం వచ్చినా.. ఫోటోల్లో జనం విరగబడినట్లు చూపించేవీలుంది. అలాంటి చోట ఏర్పాటు చేసిన నిరసన సభకు పట్టుమని వందల్లో జనం రాకపోయేసరికి వైఎస్సార్ కాంగ్రెస్ అధినాయకత్వం అసంతృప్తితో నగర నాయకుల మీద మండి పడుతున్నారట.

మరోవైపు జగన్ బాబుపై ప్రజల్లో సానుభూతి తగ్గిందా అని పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. ప్రజల సానుభూతే తమ ఆస్తిగా భావించి పార్టీలో చేరిన నేతల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. తొందరపడ్డామా అన్న భావనను తమ అంతరంగికుల వద్ద వాపోతున్నారట. మరోవైపు... జగన్ మరింత కాలం జైల్లో ఉంటే.. పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందన్న అంచనాలు బలపడుతున్న సమయంలో రాష్ట్ర రాజధానిలో ఆశించినంత ప్రజాస్పందన కనిపించకపోవటాన్ని ఆ పార్టీలో గుబులు రేపుతోంది.

 బెయిల్ కేసు బెంచ్ మీద రావటానికి మరో నాలుగు నెలల సమయం ఉంది. అప్పుడు కూడా బెయిల్ రాకపోతే తమ పరిస్థితి ఏమిటన్నది వారికి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు జగన్ బాణం షర్మిల సభకు జన హాజరు బానే ఉండటం కొంతలో కొంత సాంత్వనగా చెప్పొచ్చు. మరోవైపు నగర ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారన్న అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు