రాజధానిగా గుంటూరు - దీని హిస్టరీ పెద్దదే !

రాజధానిగా గుంటూరు - దీని హిస్టరీ పెద్దదే !

ఏపీలో రాజధాని మార్పు అంశం రచ్చకు దారితీస్తోంది. కారణాలు, ప్రయోజనాలు ఏవైనా కానీ రాజధాని మార్పు అంశం మాత్రం విస్తృత చర్చకు తెర తీసింది. రాజధాని అమరావతికి ముంపు ముప్పు ఉందని శివరామకృష్ణన్ కమిటీయే చెప్పిందని.. ఇప్పుడు కృష్ణా నది వరదలు దాన్ని రుజువు చేశాయని పాలక వైసీపీ చెబుతుండగా... రాజకీయ కక్షతో, ఇతర భూప్రయోజనాలు ఆశించి వైసీపీ ప్రభుత్వం ఇలాంటి నాటకానికి తెరతీసిందిని టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు టీడీపీతో పాటు బీజేపీ కూడా దీనిపై గట్టిగానే విమర్శలు కురిపిస్తోంది. ఇది వైసీపీ మంత్రి బొత్స, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల వరకు వెళ్లింది.

రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉద్దేశపూర్వకంగానే రాజధాని కోసం విశాఖ, నూజివీడు, దొనకొండ వంటి ఇతర ప్రాంతాల పేర్లు తెరపైకి తెచ్చి.. జనం దృష్టిని ఆ ప్రాంతాల వైపు మళ్లించి టీడీపీ పెద్దలు, వారి అనుయాయులు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి ఆ తరువాత అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నది వైసీపీ ఆరోపణ. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడి లాభపడ్డారన్నది బొత్స పదేపదే చేస్తున్న ఆరోపణ.  చంద్రబాబుకు, ఆయన వియ్యంకుడు బాలకృష్ణకు, బాలకృష్ణ వియ్యంకుడికి... చంద్రబాబుకు సన్నిహితులైన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వంటివారికి అమరావతి ప్రాంతంలో వందల ఎకరాలున్నాయని బొత్స ఆరోపిస్తున్నారు.

సుజనా దీన్ని ఖండించడం.. ఎక్కడ ఎవరెవరి పేరుతో ఎన్నెన్ని ఎకరాలున్నాయో బొత్స మళ్లీ చెప్పడం అంతా జరిగాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతి ప్రాంతంలో చంద్రబాబు, ఆయన కుటుంబీకులు, ఆయన సన్నిహితులు పెద్దమొత్తంలో భూములు కొన్న తరువాతే అక్కడ రాజధానిని ప్రకటించారని.. తద్వారా లాభపడ్డారన్నది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అందుకే.. వారిని దెబ్బతీసేలా, నష్టపరిచేలా రాజధాని మార్పు దిశగా ఆలోచనలు కూడా.

అయితే... అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోవాలన్న ఆలోచన కేవలం చంద్రబాబు ఒక్కరికే రాలేదని.. పదుల సంవత్సరాల కిందట రాష్ట్రాన్ని పాలించిన నేతలు, అప్పటి శాసనసభ్యులు కూడా ఆ ప్రాంతం రాజధానిగా బాగుంటుందని విశ్వసించారని చరిత్ర చెబుతోంది.

మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్రం వేరుపడిన తరువాత కర్నూలును రాజధాని చేశారు. అయితే.. కర్నూలుకు బదులు గుంటూరు- విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని కొందరు నేతలు ప్రతిపాదించారు.  1953 జులై 25న దీనికి సంబంధించి అప్పటి ఇండిపెండెంట్ సభ్యుడు వావిలాల గోపాలకృష్ణయ్య గుంటూరు-విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలంటూ ఏడో షెడ్యూల్‌కు సవరణ ప్రతిపాదించారు.

ఆ సవరణ ప్రతిపాదనకు అనుకూలంగా 62 మంది.. వ్యతిరేకంగా 58 మంది ఓటేశారు. అయితే.. వీరితో పాటు ఓటింగులో అయిదుగురు ఆంధ్రేతర సభ్యులు పాల్గొని వ్యతిరేకంగా ఓటేయడంతో నిబంధనల ప్రకారం సవరణ వీగిపోయింది. కానీ.. ఆంధ్ర సభ్యుల్లో 62 మంది మద్దతు ఉండడంతో అత్యధికులు గుంటూరు-విజయవాడ ప్రాంతానికే మొగ్గు చూపినట్లు స్పష్టమైపోయింది.

సమస్యతో సంబంధం లేని ఆంధ్రేతర సభ్యులు ఓట్లేయడం వల్లే వావిలాల గోపాలకృష్ణయ్య సవరణ టెక్నికల్‌గా ఒక్క ఓటుతో వీగిపోయింది కానీ.. కేవలం ఆంధ్ర సభ్యులనే పరిగణనలోకి తీసుకుంటే నాలుగు ఓట్లతో సవరణ పాసైనట్లు తేలింది.

నాలుగు సవరణలు..

నిజానికి నలుగురు నేతలు ఏడో షెడ్యూలుకు నాలుగు సవరణలు ప్రతిపాదించారు. గౌతు లచ్చన్న తిరుపతిని రాజధాని చేయాలని సవరణ ప్రతిపాదించగా... తరిమెల నాగిరెడ్డి విజయవాడను.. వెంకటనారాయణదొర విశాఖపట్నాన్ని.. వావిలాల గోపాలకృష్ణయ్య గుంటూరు-విజయవాడ ప్రాంతాన్ని రాజధాని చేయాలని సవరణలు ప్రతిపాదించారు. అప్పటికి సి.రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ సవరణలపై చర్చ మొదలవడానికి ముందే సభలో సీఎం రాజగోపాలాచారి ఒక ప్రకటన చేశారు. ఇది పూర్తిగా ఆంధ్రకు సంబందించిన అంశం కావడంతో ఓటింగులో ఆంధ్రేతర నాయకులు పాల్గొనరాదని అనగా వారంతా అందుకు అంగీకరించారు కూడా. ఆ తరువాత ఓటింగ్ మొదలైంది.

ఏ రాజధానికి ఎంతమంది అనుకూలం

తొలుత గౌతు లచ్చన్న ప్రతిపాదించిన తిరుపతిపై ఓటింగ్ పెట్టగా 13 మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. వారంతా ఆయన పార్టీ కృషికార్ లోక్ శక్తి నేతలు. దీంతో తిరుపతిని రాజధాని చేయాలన్న సవరణ వీగిపోయింది. అనంతరం ఓటింగ్ సమయానికి తరిమెల నాగిరెడ్డి తన సవరణ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు.

ఆ వెంటనే వెంకటనారాయణ దొర సవరణ ప్రతిపాదన విశాఖపై ఓటింగ్ పెట్టగా 16 మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. దాంతో అదీ వీగిపోయింది.
ఆ తరువాత వావిలాల గోపాలకృష్ణయ్య ప్రతిపాదించిన గుంటూరు-విజయవాడ ప్రతిపాదనపై ఓటింగు పెట్టగా 62 మంది అనుకూలంగా 58 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అయితే.. వీరితో పాటు మరో అయిదుగురు ఆంధ్రేతరులు వ్యతిరేకంగా ఓటేయడంతో వ్యతిరేక ఓట్ల సంఖ్య 63కి చేరింది. దీంతో వావిలాల సవరణ కూడా వీగిపోయింది. ఈ ఓటింగ్‌లో 94 మంది తటస్థంగా ఉండిపోయారు.

ఓటేసిన ఆంధ్రేతర సభ్యులు ఎవరెవరంటే..
చెన్నయికి చెందిన ఎన్‌ఎస్‌పీ ఆంథోనీ పిళ్లై, హోసూరు రోడ్‌కు చెందిన మునిరెడ్డి, విలాత్తిక్కుంకు చెందిన శల్లాదొరై, చెవ్వయ్యూర్‌కు చెందిన ఎ.అప్పూ, మహ్మద్ షఫీలు వ్యతిరేకంగా ఓట్లేయడంతో వ్యతిరేక ఓట్ల సంఖ్య 63కి చేరి సవరణ వీగిపోయింది.

తరిమెల నాగిరెడ్డి టెలిగ్రామ్

కాగా రాజధాని మార్పు సవరణలు వీగిపోయిన అనంతరం అప్పటి శాసనసభ్యుడు, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అయిన తరిమెల నాగిరెడ్డి అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌, హోంమంత్రి డాక్టర్ కట్జూలకు టెలిగ్రాములు పంపించారు. గుంటూరు-విజయవాడ ప్రాంతాన్ని రాజధాని చేయాలని ఆయన ఆ టెలిగ్రాములో కోరారు. అసెంబ్లీలో ఈ సవరణ పెట్టినప్పటికీ ఆంధ్రేతరులు అయిదుగురు ఓటేయడంతో సవరణ వీగిపోయందని.. వారిని మినహాయించి ఆంధ్ర సభ్యుల ఓట్లనే లెక్కిస్తే సవరణ పాసయినట్లేనని.. అందుకే గుంటూరు-విజయవాడను రాజధానిగా ప్రకటించాలని ఆయన కోరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English