రాజధాని మార్పులో జగన్ చంద్రబాబునే ఇరికిస్తున్నారా?

రాజధాని మార్పులో జగన్ చంద్రబాబునే ఇరికిస్తున్నారా?

ఏపీలో పెద్ద ఇష్యూగా మారిన రాజధాని మార్పు విషయంలో సీఎం జగన్ గత ముఖ్యమంత్రి చంద్రబాబునే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రాజధాని నిర్మాణానికి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వం గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఇచ్చిన వివరణనే జగన్ వాడుకుంటున్నారని తెలుస్తోంది.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజధానిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఇటీవల లేఖ రాశారని... దానిలో బాబు సర్కారు గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్‌లోని అంశాలనే ప్రధానంగా ప్రస్తావించారని.. అఫిడవిట్‌ కాపీతో పాటు అంతకు ముందు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ లేవనెత్తిన అభ్యంతరాలను కూడా ఆయన ప్రధానమంత్రికి పంపినట్లు సమాచారం. రాజధాని నిర్మాణ ఖర్చు అనూహ్యంగా పెరిగిపోవడానికి, నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతుండటానికి కారణాలను పేర్కొంటూ ఈ వివరాలను అందచేసినట్లు తెలిసింది. రాజధానిపై తమ ప్రభుత్వమేమి కొత్త విషయాలను మాట్లాడటం లేదని, గత ప్రభుత్వం చెప్పిన అంశాలనే ప్రస్తావిస్తున్నామని ఈ లేఖలో చెప్పారని తెలుస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో కొందరు  పర్యావరణవేత్తలు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో కొందరు గ్రీన్‌ ట్రిబ్యునల్‌‌లో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వివరణ కోరగా, భారీ వరదలొస్తే 13 వేల ఎకరాలు రాజధాని ప్రాంతంలో ముంపునకు గురవుతాయని ప్రభుత్వం పేర్కొంది. 29 గ్రామాల పరిధిలో 34 వేల ఎకరాలు సేకరించగా అందులో మూడవ వంతుకు మాత్రమే ముంపు ప్రమాదం ఉందని, దానిని కూడా నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. నది గర్భం నుండి 25 మీటర్ల ఎత్తులో నిర్మాణాలు చేపడతామని గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు తెలిపింది.

చంద్రబాబు సర్కారు సమర్పించిన ఈ అఫిడవిట్‌ కాపీ మొత్తాన్ని ప్రధానికి రాసిన లేఖకు ముఖ్య మంత్రి జగన్‌ జతపరిచినట్లు సమాచారం. ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు శాశ్వత పరిపాలన భవనాలకు శంకుస్థాపన చేశారని, ముంపు బారి నుండి తప్పించడానికి వంద అడుగుల లోతులో ర్యాప్టు ఫౌండేషన్‌ టెక్నాలజీతో 40 నుంచి 50 టవర్ల భవనాలు ఐదింటిని నిర్మించేందుకు పనులు ప్రారంభించారని, ఫలితంగా ఖర్చు విపరీతంగా పెరిగిపోతోందని వివరించారట. మొత్తానికి వ్యవహారం చూస్తుంటే... చంద్రబాబునే కారణంగా చూపుతూ రాజధానిని మార్చడానికి వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తునే సన్నాహాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English