అమరావతిపై జగన్ మౌనం దేనికి సంకేతం?

అమరావతిపై జగన్ మౌనం దేనికి సంకేతం?

రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాజధాని అమరావతిపైనే చర్చ. అమరావతి రాజధానిగా ఉంటుందా… మరో చోటకు తరలుతుందా.. గత పాలకులు దీనికి చట్టబద్ధత లేకుండా చేశారా.. అందుకే ఇన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయా.. వరద ముంపు పేరుతో అధికార వైసీపీ రాజధానిలో కల్లోలం సృష్టిస్తుందా.. మార్చితే లాభమా నష్టమా..? ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అసలు ఏం జరగబోతోంది.. ఇదంతా నిజమేనా... ఉత్తుత్తి ప్రచారమా?.... ఇలాంటి ప్రశ్నలెన్నో జనం మదిలో కదులుతున్నాయి. అయితే, ఇంత గందరగోళం జరుగుతున్నా ప్రభుత్వం కానీ, ప్రభుత్వాధినేత కానీ దీనిపై ఇంతవరకు స్పష్టతనివ్వలేదు.

సీఎం వైఎస్‌ జగన్‌ విదేశీ పర్యటనలో ఉన్నపుడు రాజధాని తరలింపు అంశంపై చర్చోపచర్చలు జరిగాయి. విదేశీ పర్యటన నుంచి రాష్ట్రానికి చేరుకున్న తర్వాత కూడా ఊహాగానాలపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం రైతులలో ఆందోళనను రెట్టింపు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన తాతాల్కిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి.

మరోవైపు రాజధాని ప్రకాశం జిల్లా దొనకొండకు తరలిపోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రియల్టర్లు ఆ ప్రాంతంలో భూములు కొనుగోలుకు ఎగబడటం చూస్తే పలు అనుమానాలకు తావిస్తోంది. అమరావతికి ముంపు సమస్య ఉందన్న మంత్రి బొత్స వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదలకు ఏం కొట్టుకుపోయాయో మంత్రే చూపించాలని డిమాండు చేస్తున్నారు. గతంలో 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తమ ప్రాంతం ముంపునకు గురవ్వలేదని, ఎనిమిది లక్షలకు ఎక్కడ మునిగిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

రాజధాని అమరావతి నిర్మాణం కోసం గత ప్రభుత్వం (టీడీపీ) గుంటూరు జిల్లాలోని 29 గ్రామాలలో 33 వేల ఎకరాలను సమీకరించింది. ప్రపంచస్థాయి రాజధాని వస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలు తమ ప్రాంతాభివృద్ధిపై ఎన్నో కలలు కన్నారు. గత ఎన్నికలలో రాజధానిని మార్చబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ, నేటికీ దానిపై స్పష్టత ఇవ్వలేదు.  ఇప్పటికే రాజధాని నిర్మాణాలు నిలిచిపోగా, ఏం జరుగు తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ అధికారుల క్వార్టర్స్‌, హైకోర్టు నిర్మాణం, శాశ్వత పరిపాలన భవనాలు తదితర నిర్మాణ పనులూ నిలిచాయి. మంత్రి బొత్స వ్యాఖ్యలతో రాజధాని భూములిచ్చిన రైతులతోపాటు ఆ ప్రాంత ప్రజలు ఆవేదన చెందు తున్నారు. విపక్ష నేతలు రాజధాని ప్రాంత పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్ మాత్రం దీనిపై ఇంకా పెదవి విప్పలేదు. దీంతో మౌనం అర్ధాంగీకారమా...? బొత్స నోటి నుంచి వచ్చిన మాట జగన్ మనసులోంచి వచ్చినదేనా అన్న అనుమానాలు మొదలవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English