ఆ జిల్లాలో ఇంకా టీడీపే నేతే మంత్రా?

ఆ జిల్లాలో ఇంకా టీడీపే నేతే మంత్రా?

ఏపీలో అధికార మార్పిడితో టీడీపీ నేతలంతా తమతమ జిల్లాల్లో పట్టు కోల్పోయారు. ఎక్కడా వారికి ప్రాధాన్యమంటూ లేకుండా పోయింది. ఆఫీసుల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో వారి జాడ కనిపించడం లేదు. కానీ... ఒక్క జిల్లాలో మాత్రం ఇంకా ఓ టీడీపీ నేత హవా కొనసాగుతోందట. ఆ జిల్లాలో వైసీపీ మంత్రి ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన టీడీపీ నేత మాత్రం ఇంకా తన పట్టు చూపిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన నియోజకవర్గం వరకు ఆయన మాటే ఇంకా చెల్లుబాటవుతోందట.

అంతేకాదు.. ఆయన నియోజకవర్గంలోని కార్యక్రమాల ప్రారంభోత్సవాలు కూడా ఆయన చేతుల మీదుగానే సాగుతున్నాయి. ప్రస్తుత మంత్రి ఆయన వెంట నిలబడగా.. ఆ మాజీ మంత్రి ప్రారంభోత్సవాలు చేస్తున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఆ మాజీ మంత్రి ఇంకెవరో కాదు.. టీడీపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన అచ్చెన్నాయుడు. అవును.. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఉన్నప్పటికీ ఇంకా అచ్చెన్నాయుడు చాలా ప్రాంతాల్లో పట్టు చూపించుకుంటున్నట్లు చెబుతున్నారు.

అచ్చెన్నాయుడు నియోజకవర్గమైన టెక్కలిలోని కోటబొమ్మాళి మండలం లక్ష్మీపురంలో సౌడెం ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం ప్రారంభించగా.. ఆ కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే హోదాలో అచ్చెన్నాయుడు.. ఎంపీ హోదాలో కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.

అయితే... ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను అచ్చెన్నాయుడు చేతుల మీదుగానే ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు, రామ్మోహననాయుడు అక్కడ హడావుడి చేస్తుంటే మంత్రి ధర్మాన కృష్ణదాస్ వారి వెనుకాల నిల్చున్న ఫొటోలు వాట్సాప్‌లో తిరుగుతున్నాయి.

కాగా మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ ప్రభంజనం వీచినా.. శ్రీకాకుళం జిల్లాలోనూ వైసీపీ గాలి బలంగా వీచినా టెక్కలిలో ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు.. శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహననాయుడు మళ్లీ గెలిచారు. బాబాయ్-అబ్బాయిలైన వీరిద్దరూ జిల్లాపై ఇంకా తమ పట్టు పోలేదన్న సంకేతాలిస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే రామ్మోహన్ నాయుడు తన ఫేస్‌బుక్ వాల్‌పై ఈ ఫొటో షేర్ చేసి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను అచ్చెన్నాయుడు ప్రారంభించారని రాశారు.

అయితే.. అక్కడున్న శిలాఫలకంపై మాత్రం ‘ప్రారంభకులు ధర్మాన కృష్ణదాస్’ అని స్పష్టంగా ఉంది. అయినా.. అచ్చెన్నాయుడు ప్రారంభించారు అంటూ.. తమ ఇద్దరి వెనుకాల మంత్రి ధర్మాన కృష్ణదాస్ నిల్చున్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం వెనుక ఇంకా తామే కింగ్‌లం అని చెప్పుకోవడం కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది.
మరోవైప మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా ఇంకా పట్టు సాధించలేకపోతున్నారని.. మొహమాటాలకు పోతున్నారని.. ఆ క్రమంలోనే కింజరాపు కుటుంబం ఇంకా తమదే అధికారం అన్నట్లుగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English