చిరుకు గంటా రాయ‌బార‌మా... ఏం జ‌రుగుతోంది?

చిరుకు గంటా రాయ‌బార‌మా...  ఏం జ‌రుగుతోంది?

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చ‌ని అంటారు. ముఖ్యంగా ద‌క్షిణాదిపై క‌న్నేసిన బీజేపీ.. ఇక్క‌డ అధికారంలోకి వ‌చ్చేందుకు అనుకూలంగా వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేసుకుంటోంది. కులాలు, మ‌తాలు, ప్రాంతాల వారీగా కూడా పార్టీని బ‌లోపేతం చేసేందుకు వ్యూహాల‌పై వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.

ఈ క్ర‌మంలోనే కీల‌క నాయ‌కుల‌కు కూడా వ‌ల‌వేస్తోంది. దీంతో ఇప్పుడు బీజేపీ వ్యూహాలపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.  ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా త‌న‌కు క‌లిసొచ్చేవారు ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ నాయ‌కుల‌కు వ‌ల‌విస‌ర‌డమే క‌ర్త‌వ్యంగా ముందుకు సాగుతోంది.

విష‌యంలోకి వెళ్తే.. బీజేపీ ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే త‌న పార్టీలోకి ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించుకున్నట్టు తాజా ప‌రిణామాలు వెల్ల‌డిస్తున్నాయి. 2008లో ప్ర‌జారాజ్యం పార్టీతో రాజ‌కీయ అరంగేట్రం చేసిన చిరంజీవి... త‌ర్వాత త‌న పార్టీని అన‌నుకూల వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న‌కు కేంద్రంలో స్వ‌తంత్ర హోదాలో మంత్రి ప‌ద‌విని పొందారు. ఇక‌, రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కూడా చ‌క్రం తిప్పారు. అయితే, త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న, అనంత‌ర పరిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు.ఇక‌, రెండేళ్లుగా త‌న హిస్టారిక‌ల్ మూవీ సైరాపై దృష్టి పెట్ట‌డంతో ఆయ‌న రాజ‌కీయాల‌పై పెద్ద ఆస‌క్తి చూప‌డం లేద‌ని అంద‌రూ అనుకున్నారు.

ఇదిలావుంటే, ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీ.. చిరంజీవిని త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నా లు ప్రారంభించింది. దీనికిగాను ఇంకా బీజేపీలో తీర్థం పుచ్చుకోని మాజీ మంత్రి, ప్ర‌స్తుత టీడీపీ నాయ‌కు డు గంటా శ్రీనివాస‌రావును బీజేపీ వాడుకుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. చిరు ద‌గ్గ‌ర‌కు గంటాను రాయ‌బారిగా పంపార‌ని అంటున్నారు. తాజాగా గంటా వెళ్లి చిరుతో భేటీ కావ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసింది. గంటాను బీజేపీనే పంపింద‌నే వారి సంఖ్య పెరుగుతోంది.

అదే స‌మ‌యంలో ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చిరు వ్య‌క్తం చేసిన అభిప్రాయం మేర‌కు త‌న‌కు ఓ జాతీయ పార్టీ ఆఫ‌ర్ ఇస్తోంద‌ని చేసిన ప్ర‌క‌ట‌న కూడాఈ నేప‌థ్యంలో నిజ‌మ‌నేభావ‌న ను తెర‌మీదికి తెస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇక‌, చిరంజీవితో గంటా శ్రీనివాస్ కు ఉన్న అనుబంధం గురించి చెప్పాల్సి వ‌స్తే.. వారిద్దరి మధ్య రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉంది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు. ప్రజారాజ్యం పార్టీ తరఫున గంటా శ్రీనివాస్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం..ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ బెర్త్ ను సంపాదించారు.

2014లో రాష్ట్ర విభజన చోటు చేసుకున్న తరువాత గంటా శ్రీనివాస్ తన సొంత గూడు తెలుగుదేశంలో చేరారు. మంత్రిగా కొనసాగారు కూడా. మొన్నటి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా పరాజయం పాలైన అనంతరం- గంటా శ్రీనివాస్ టీడీపీలో పెద్దగా క్రియాశీలకంగా లేరనే వార్తలు వస్తున్నాయి.  ఈ క్ర‌మంలోనే గంటా బీజేపీలోకి చేర‌తార‌ని అంటున్నారు. మ‌రి రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు.. అనేదానికి వీరు నిద‌ర్శ‌నంగా మార‌తారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English