బీజేపీ తిప్పుడు ప్రయత్నాలు?

తెలంగాణలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు చూస్తుంటే అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ వేగంగా దూసుకెళ్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ జైలుకు వెళ్లి వ‌చ్చిన ఎపిసోడ్‌తో ఆ పార్టీ మ‌రింత దూకుడుతో సాగాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇక తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేది ఒక్క బీజేపీ మాత్ర‌మేన‌నే భావ‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ నేత‌లు శాయశ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై సీఎం కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్న వ‌ర్గాల‌ను త‌మ‌వైపు తిప్పుకునే ప్లాన్ అమ‌లు చేస్తున్నార‌ని టాక్‌.

ఆ అసంతృప్తి..
వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్‌పై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి పెరుగుతంద‌నే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోవ‌డ‌మే అందుకు కార‌ణంగా తెలుస్తోంది. ఆ అసంతృప్తి దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బ‌య‌ట ప‌డింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ను టార్గెట్ చేయ‌డంలో స్పీడు పెంచిన బీజేపీ.. ఆ అసంతృప్తితో ఉన్న వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్న అంశాల‌పై పోరాటాలు ఉద్ధృతం చేసేందుకు క‌మ‌ళ‌నాథులు రెడీ అవుతున్నార‌ని స‌మాచారం.

ఉద్యోగుల ప‌క్షాన‌..
ఇటీవ‌ల జోన‌ల్ విధానం ఆధారంగా ఉద్యోగుల బ‌దిలీలు చేప‌ట్టిన తెలంగాణ ప్ర‌భుత్వ తీరుపై ఉద్యోగుల్లో చాలా వ‌ర‌కు అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. అందుకే ఈ విష‌యంపై పోరాడాల‌ని బీజేపీ న‌డుం బిగించింది. అందుకే రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల‌కు, ఉపాధ్యాయుల‌కు తీవ్ర ఇబ్బందులు క‌లిగించేలా ఉంద‌ని సంజ‌య్ పోరాటానికి దిగాడు. ఈ జీవోను స‌వ‌రించాల‌ని డిమాండ్ చేస్తూ త‌న ఎంపీ కార్యాల‌యంలో ఆయ‌న జాగ‌ర‌ణ దీక్ష‌కు దిగ‌డం.. క‌రోనా నేప‌థ్యంలో అనుమ‌తి లేదంటూ పోలీసులు అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడీ పోరాటంతో ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో బీజేపీపై పాజిటివ్ వైఖ‌రి ఏర్ప‌డే అవకాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక ఇప్ప‌టికే నిరుద్యోగుల ప‌క్షాన సంజ‌య్ దీక్ష చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అంత‌కుముందు వ‌రి కొనుగోళ్ల విష‌యంపై రాష్ట్ర ప్ర‌భుత్వంపై బీజేపీ తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. ఇలా ప్ర‌భుత్వంపై అసంతృప్తితో ఉన్న వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు బీజేపీ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతుంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని నిపుణులు అంటున్నారు.